భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు | Oil prices spike after Saudi drone attack causes biggest disruption | Sakshi
Sakshi News home page

క్రూడ్‌.. కల్లోలం!

Published Tue, Sep 17 2019 4:58 AM | Last Updated on Tue, Sep 17 2019 8:09 AM

Oil prices spike after Saudi drone attack causes biggest disruption - Sakshi

సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్లో సెప్టెంబర్‌ డెలివరీ ఒక బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర 19.5 శాతం ఎగసి 71.95 డాలర్లను తాకింది. ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి డాలర్ల పరంగా ఒక్క రోజులో ఇంతగా ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇక అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటరీ్మడియట్‌ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్‌ 15.5 శాతం ఎగసి 63.34 డాలర్లకు పెరిగింది. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ రెండు రకాల ముడి చమురు ధరలు ఈ రేంజ్‌లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్‌ నైమెక్స్‌ క్రూడ్‌ ధర 12 శాతం ఎగసి 61.38 డాలర్ల వద్ద, బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 12.4 శాతం ఎగసి 67.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

మన మార్కెట్లో 9 శాతం అప్‌...
ఇక మన మార్కెట్‌ విషయానికొస్తే, సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌(ఎమ్‌సీఎక్స్‌)లో సెపె్టంబర్‌ డెలివరీ క్రూడ్‌ ధర 9.14 శాతం ఎగసి రూ.4,273 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో స్పెక్యులేటర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్ల స్పెక్యులేటివ్‌ పొజిషన్ల కారణంగా సమీప భవిష్యత్తులో ధరలు అధిక స్థాయిల్లోనే ట్రేడవుతాయని నిపుణులంటున్నారు. 

సౌదీ సగం ఉత్పత్తికి గండి...
ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్‌ కేంద్రం, సౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్‌కో ఆయిల్‌ ప్లాంట్లపై గత శనివారం ద్రోన్‌లతో దాడి జరిగింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని అబ్‌క్వైక్‌ నగరంలోని రిఫైనరీపైనా, రియాద్‌కు 150 కిమీ. దూరంలోని ఖురయాస్‌ చమురు క్షేత్రంపైనా ద్రోన్‌లతో దాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం (ఇది ప్రపంచ రోజువారీ చమురు సరఫరాల్లో ఐదు శాతానికి సమానం) వరకూ తగ్గుతుందని అంచనా. రోజుకు 5.7 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుంది. కాగా ఈ దాడులకు కారణం ఇరాన్‌ అని అమెరికా ఆరోపిస్తుండగా, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఈ దాడులు తామే చేశామని యెమెన్‌కు చెందిన హౌతి రెబెల్స్‌ పేర్కొన్నారు.  ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలు మరింతగా పెరిగాయని, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ హెచ్చరించారు.  

సౌదీ ఆరామ్‌కో ఐపీఓ ఆలస్యం...!
ఉగ్రవాద దాడుల కారణంగా సౌదీ ఆరామ్‌కో భారీ ఐపీఓ (ఇనీíÙయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దాడుల నష్టా న్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్‌ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్‌లో లిస్టింగ్‌ కావాలని సౌదీ ఆరామ్‌కో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లనూ నియమించింది.

మరింతగా వదలనున్న మన ‘చమురు’...
సింగపూర్‌: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచి్చందని సామెత. సామెత అన్వయం సరిగ్గా లేకపోయినప్పటికీ, సౌదీ అరేబియా ఆయిల్‌ ప్లాంట్లపై దాడుల కారణంగా భారత్‌కు మరింతగా చమురు వదలనున్నది. సౌదీ ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుందని, ముందుగా రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ వెల్లడించింది. ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితేనే, ద్రవ్యోల్బణం 20 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని, భారత కరంట్‌ అకౌంట్‌ లోటు 0.4–05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌  ధర ఒక్కో డాలర్‌ పెరిగితే, భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని వివరించింది. భారత్‌ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.  భారత్‌ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్‌ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆరి్థక సంవత్సరంలో భారత్‌ మొత్తం 2017.3 మిలియన్‌ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబి యా వాటా 40.33 మిలియన్‌ టన్నులుగా ఉంది.


సరఫరాల్లో కొరత ఉండదు
సౌదీ అరేబియా ఆయిల్‌ ప్లాంట్లపై దాడుల కారణంగా మనకు చమురు సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దాడుల అనంతరం  సౌదీ ఆరామ్‌కో కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని, సరఫరాల్లో ఎలాంటి కొరత ఉండబోదని వారు  భరోసానిచ్చారని వివరించారు.  ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌కంపెనీల వద్ద సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన చమురు నిల్వలపై సమీక్ష జరిపామని, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్‌ ధర రూ.5–6 పైపైకి..!
సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడుల కారణంగా లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలు మరో రెండు వారాల్లో రూ.5–6 మేర పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఈ దాడుల కారణంగా సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు భగ్గుమంటూనే ఉంటాయని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. సౌదీలో చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడానికి మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి.


ఏతావాతా పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదిరితే ముడి చమురు ధరల ర్యాలీ ఇప్పట్లో ఆగదని విశ్లేషకులు భయపడుతున్నారు. ముడి చమురు, సంబంధిత ఉత్పాదకాలు పలు పరిశ్రమలకు ముడిపదార్ధాలుగా వినియోగమవుతున్నాయని, పెయింట్లు, టైర్లు, ఆయిల్, గ్యాస్, వాహన విడిభాగాల పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటే, అది ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రతికూలమేనని,  అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే వెనుజులా, ఇరాన్‌ల నుంచి చమురు సరఫరాలు తగ్గాయని కోటక్‌ ఈక్విటీస్‌  తెలిపింది.

రూపాయి.. ‘క్రూడ్‌’ సెగ!
ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పరుగు భయాలు సోమవారం రూపాయిని వెంటాడాయి. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 68 పైసలు పతనమైంది. 71.60 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో లాభాల బాటన పయనించిన రూపాయి సోమవారం మొట్టమొదటిసారి నేలచూపు చూసింది.  క్రూడ్‌ ధరల పెరుగుదల భారత్‌ కరెంట్‌ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆరి్థక గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్‌ దాడి నేపథ్యంలో... సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి బలహీనంగా 71.54 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 71.63 స్థాయినీ చూసింది. రూపాయి శుక్రవారం ముగింపు 70.92.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్‌ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది.

స్టాక్‌ మార్కెట్లో ‘మంట’...
సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ద్రోన్‌లతో దాడి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇంట్రాడేలో 20% వరకూ క్రూడ్‌ ధరలు ఎగియడంతో మన స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు సెగతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది.  ఇంట్రాడేలో 356 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11,004 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరి్థక వ్యవస్థలో వృద్ధి జోష్‌ను పెంచడానికి ప్రభుత్వం శనివారం ప్రకటించిన రూ.70,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ(ఎగుమతులు, రియల్టీకి) చమురు దాడుల నష్టాల్లో కొట్టుకుపోయింది.



ఆయిల్‌ షేర్లు విలవిల....
సౌదీ చమురు క్షేత్రాల దాడుల నేపధ్యంలో బీఎస్‌ఈ  ఆయిల్‌ గ్యాస్‌ అండ్‌ ఎనర్జీ ఇండెక్స్‌ భారీగా నష్టపోయింది. చమురు సంబంధిత  షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, క్యా్రస్టాల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 7% వరకూ నష్టపోయాయి. స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్‌  ఏవియేషన్, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి విమానయాన ఇంధన షేర్లు 4% వరకూ నష్టపోయాయి. ఇప్పటికే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కుదేలైన ప్రపంచ మార్కెట్లపై సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తాజాగా జరిగిన దాడి మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని షేర్‌ఖాన్‌ బీఎన్‌పీ పారిబా ఎనలిస్ట్‌ గౌరవ్‌ దువా వ్యాఖ్యానించారు. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, మన ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ రాహుల్‌ గుప్తా పేర్కొన్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement