‘అసైన్డ్‌’ సవరణపై వివరాలు అందజేయండి    | Provide details on assigned amendment says high court | Sakshi
Sakshi News home page

‘అసైన్డ్‌’ సవరణపై వివరాలు అందజేయండి   

Published Thu, Sep 7 2023 2:40 AM | Last Updated on Thu, Sep 7 2023 2:40 AM

Provide details on assigned amendment says high court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌దారులకు హక్కులు కల్పించే తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్ట సవరణపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్   (సీసీఎల్‌ఏ)కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్టం–1977కు 2018లో సవరణ చేయడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది.

చట్టంలోని సెక్షన్‌ 4(1)(b) ప్రకారం నిర్దేశించిన విధంగా 2007, జనవరి 29 నుంచి థర్డ్‌ పార్టీలకు అనుకూలంగా అసైన్డ్‌ భూముల రీఅసైన్‌మెంట్‌ కోసం కటాఫ్‌ తేదీని 2017, డిసెంబర్‌ 31 వరకు పొడిగించిందని.. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్‌ నంబర్‌ 12ను కొట్టివేయాలని కోరారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పేదల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అర్హులైన వారికి 1969లో సాగు భూమిని అందజేసిందని చెప్పారు.

అయితే వారి నిరక్ష్యరాస్యత, అజ్ఞానం, సామాజిక, ఆర్థిక వెనుకబాటును అలుసుగా తీసుకున్న కొందరు వారి భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేశారన్నారు. రూ.50 లక్షల నుంచి కోటి విలువైన భూములను రూ.5 లక్షలు చెల్లించి పలుకుబడి ఉన్న వారు సొంతం చేసుకున్నారని వెల్లడించారు. అసలు లబ్ధిదారులు ఆ భూముల ద్వారా లబ్ధిపొందలేకపోయారని పేర్కొన్నారు. లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి భూములను స్వాదీనం చేసుకుని, అంతకు ముందు కేటాయించిన వారికి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

1977, తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్టం సెక్షన్‌ 3 ప్రకారం అసైన్డ్‌ భూముల అమ్మకం చెల్లదన్నారు. ఇప్పుడు అసైన్డ్‌ భూములను థర్డ్‌ పార్టీల (ఇప్పుడు అ«దీనంలో ఉన్న వారు)కు అప్పగించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఉండగా, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 74 వేల ఎకరాలున్నాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement