అసైన్డ్ భూముల్లో బడాబాబుల పాగా!
రికార్డుల్లో మాత్రం సర్కారు భూమి
- రింగ్ రోడ్డు చేరువలో రూ.450 కోట్ల విలువైన భూమికి రెక్కలు
- అజీజ్‌నగర్‌లో చేతులు మారిన 151 ఎకరాల ప్రభుత్వ భూమి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. భూమిలేని పేదల జీవనోపాధికి పంపిణీ చేసిన అసైన్డ్ భూమి బడాబాబుల పాలైంది. రింగ్ రోడ్డు చేరువలో ఉన్న ఈ భూములపై కన్నేసిన భూమాఫియా.. రెవెన్యూ శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రూ.కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టింది. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా చలామణి అవుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు పెద్దల కబ్జాల్లో మగ్గుతున్నాయి. దీంతో రంగా రెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.450 కోట్ల విలువైన 151 ఎకరాల భూమిలో ప్రజా ప్రతి నిధులు, ఐపీఎస్ అధికారులు తిష్ట వేశారు.
అడ్డగోలుగా వ్యవహారం
అసైన్డ్ భూములను వ్యవసాయ అవసరాలకే వినియోగించాలి. అయితే, చేతులు మారిన ఈ భూముల్లో అక్రమ నిర్మా ణాలు వెలిశాయి. ఈ భూ బాగోతం గురించి రెవెన్యూ యంత్రాంగానికి తెలిసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 176లో 220.37 ఎకరాలు, సర్వే నం.177లో 162.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నంబర్లలో 237 ఎకరాల మేర భూమిలేని నిరుపేదలకు 1961–62లో ప్రభుత్వం అసైన్ మెంట్ చేసింది. కాలక్రమేణా చాలా మంది రైతులు ఆ భూములను అమ్ముకున్నారు.
రికార్డుల్లోనే స్వాధీనం
అసైన్డ్ భూములు పరాధీనం కావడంతో 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. పీఓటీ చట్టాన్ని ప్రయోగించి 131 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ తతంగమంతా కాగితాల్లోనే సాగింది. సర్కారు భూములని బోర్డులు ఉన్నా.. కబ్జాలో అక్రమార్కులే ఉన్నారు. హైదరాబాద్ రాజకీయాలను శాసించే ఓ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ భూముల్లో ఇంజనీరింగ్, వైద్యకళాశాలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రికి కూడా ప్రభుత్వం ఇక్కడ అప్పనంగా భూమిని ‘దానం’ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ రాజకీయాలను ‘అల్లాడి’ంచిన మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా అసైన్డ్ భూములకు ఎసరు పెట్టారు. జంట నగరాలకు చెందిన మరో మాజీ ఎంపీ కూడా పేద రైతులను నయానో భయానో ఒప్పించి భూములను సేకరించారు. ఇక సర్వే నంబర్ 176లో దిల్ సంస్థకు కేటాయించిన 126.29 ఎకరాల భూమిలో ఓ ఐపీఎస్ అధికారి పాగా వేశారు. పోలీసుశాఖలో ‘అదనపు’సేవలందిస్తున్న ఆ అధికారి ప్రహరీగోడ కూడా నిర్మించేశారు. ఇదే సర్వే నంబర్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వెలిసింది. తన జిల్లాలో కొలువుదీరిన దేవుడి పేరిట ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థ ఓ మాజీ ఎంపీది కావడం గమనార్హం.
కోర్టు కేసులు నడుస్తున్నాయి
అజీజ్‌నగర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 176, 177లోని అసైన్డ్ భూములు కొంత వరకు చేతులు మారాయి. రైతుల చేతుల్లో లేని భూములను గతంలోనే పీఓటీ కింద స్వాధీనం చేసుకున్నాం. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే కొనసాగుతోంది. దీనిపై కొంత మంది కొనుగోలు దారులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
– నాగయ్య, తహసీల్దార్, మొయినాబాద్