సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న దుగ్ధతోనే పిచ్చి రాతలు
దళితులకు భూములపై హక్కులు కల్పించేందుకే సీఎం జగన్ చట్టం తెచ్చారు
దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీ నిర్మించింది రామోజీరావే
మంత్రి మేరుగు నాగార్జున
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు.
అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు.
వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్ నిర్ణయంపై విషం కక్కుతున్నారని చెప్పారు.
తాము చంద్రబాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment