జాగీరు భూముల పాస్‌ పుస్తకాలు రద్దు | Cancellation of the land pass books | Sakshi
Sakshi News home page

జాగీరు భూముల పాస్‌ పుస్తకాలు రద్దు

Published Sat, Jun 17 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

జాగీరు భూముల పాస్‌ పుస్తకాలు రద్దు

జాగీరు భూముల పాస్‌ పుస్తకాలు రద్దు

ఆర్‌వోఆర్‌ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్‌ సిద్ధం
- నేటి కేబినెట్‌ భేటీలో ఆమోదం
 
సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూముల తరహాలో జాగీరు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ముసాయిదా సిద్ధం చేసింది. వీటితోపా టు పలు కీలక ఆర్డినెన్స్‌లను ఆమోదించేందు కు శనివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఇదే సమావేశంలో పోలీస్‌ శాఖలో కొత్తగా పదివేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఏర్పడ్డ కొత్త పోలీస్‌ స్టేషన్లు, పెరిగిన అవసరాల దృష్ట్యా ఎస్సైలు, కానిస్టేబుళ్లు సహా దాదాపు 18 వేల అదనపు సిబ్బంది కావాలని ఆర్థిక శాఖకు హోంశాఖ ప్రతిపాదనలు పంపింది. అందులో దాదాపు 10 వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశా లున్నాయి. ఇదే సందర్భంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ పదో షెడ్యూల్‌ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. విభజన చట్టం ప్రకారం మానవ హక్కుల కమిషన్‌ పదో షెడ్యూల్లో ఉంది. అందుకే దీన్ని కేబినెట్‌ ముందుంచాలా లేదా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
 
జాగీరు భూముల మ్యుటేషన్లకు చెక్‌
నిజాం హయాంలోని జాగీర్దార్లకు సంబంధిం చిన భూములను ప్రభుత్వం అప్పట్లోనే రద్దు చేసింది. వీటిని ప్రభుత్వ భూములుగా గుర్తించింది. అదే సమయంలో ఏడుగురు జాగీర్దార్లకు సంబంధించిన భూములు పెం డింగ్‌లో పడ్డాయి. నలుగురు ఆచూకీ లేకపోగా మిగతా ముగ్గురికి సంబంధించి దాదాపు 2,200 ఎకరాల భూములు తమకే చెందుతా యని కోర్టులో కేసులు నమోదయ్యాయి. మియాపూర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన అవినీతి భాగోతానికి సంబంధించిన భూములు ఇవే. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన పైరవీకారుల ప్రయత్నాలకు తలొగ్గి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఈ భూములను వారి పేరిట మ్యుటేషన్‌ చేయాలని రెండుసార్లు మెమోలు జారీ చేసింది. మియాపూర్‌ భూము ల భాగోతంతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి రావటం ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చట్టాన్ని సవరించి అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది.

ఆర్‌వోఆర్‌ చట్టం ప్రకారం... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయరు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయటం కుదరదు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుంటే మ్యుటేషన్‌ చేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములతోపాటు జాగీరు భూములను ఆర్‌వోఆర్‌ చట్టంలో చేర్చుతూ సవరణ తెచ్చేలా ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తయారు చేసింది. దీంతో పాసు పుస్తకాలు రద్దు చేసి, తదుపరి ఇవ్వకుండా నిలిపేస్తే గతంలో జారీ చేసిన మ్యుటేషన్‌ ఆర్డర్లు చెల్లకుండా పోతాయని న్యాయశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్‌ జారీకి రెవెన్యూ శాఖ ముసాయిదా ను సిద్ధం చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌లకున్న అధికారాలకు  కత్తెర వేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ విడుదల చేయనున్నారు.
 
పీడీ యాక్ట్‌ విస్తరణ
నకిలీలు, మోసాలపై ఉక్కుపాదం మోపేందు కు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్టులో మరిన్ని అంశాలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మరో ఆర్డినెన్స్‌ను రూపొందించారు. ప్రధానంగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ నోట్లు, నకిలీ డాక్యుమెంట్లు, అక్రమంగా చెట్ల నరికివేత, గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, గుడుంబా అమ్మకాలన్నీ ఇందులో చేర్చనున్నారు. 
 
నకిలీ విత్తన నిరోధక చట్టం
నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు నకిలీ విత్తన నిరోధక చట్టం తీసుకు వస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇప్పటికే ప్రకటించారు. ఈ ఖరీఫ్‌ నుంచే అమలయ్యేలా ఈ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని భావిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే జైలు శిక్షతోపాటు రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఆర్డినెన్స్‌ సిద్ధం చేశారు.
 
గవర్నర్‌తో సీఎం భేటీ
కేబినెట్‌ భేటీ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్‌లను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనందున ఆర్డినెన్స్‌లు జారీ చేయాల్సిన అవసరాన్ని సీఎం నివేదించినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement