సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ మహిళాధికారి దారుణహత్యకు గురికావడం రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె పనిచేస్తున్న చోటే సజీవదహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమేదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆందోళనకు గురైంది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత ఆందోళనకు లోనైంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కింద నిజామాబాద్ తహసీల్దార్ జ్వాలాగిరిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్యోగవర్గాలను కలవరపరిచింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పు డు మహిళా తహసీల్దార్‌ను ఏకంగా హత్య చేయడం రెవెన్యూ వర్గాలను కలవరపరుస్తోంది.
ఎవరికీ తెలియలేదు..
మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో విధి నిర్వహణలో తలమునకలైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ గదికి రానుపోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్ రూమ్‌లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి ఉంది. సోమవారం తహసీల్దార్ ఉండే గది లోపలికి నిందితుడు వెళ్లి గడియ వేసుకున్నా.. ఆమెతో వాగి్వవాదానికి దిగినా.. ఆఖరికిపై ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినా వెలుపల హాల్‌లో పనిచేసేవారికి తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి విజయారెడ్డికి నిప్పంటించే క్రమంలో కాలిన గాయాలతో భరించలేక నిందితుడు గడియ తీసుకొని బయటకు పరుగులు తీస్తే కానీ, లోపలేం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. ప్రైవేటు సెక్యూరిటీని కూడా నియమించుకోకపోవడం.. తహసీల్దార్‌ను కలిసిన సమయంలో అక్కడే ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఘటనకు ఊతమిచ్చింది.
రికార్డుల నవీకరణతో సతమతం..
భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రికార్డుల నవీకరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులపై పనిభారమే కాకుండా ఒత్తిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలాచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరకపోవడంతో వివాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కబ్జా కాలమ్‌ను ప్రభుత్వం తొలగించడం రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయపరమైన వివాదాలపై అర్జీదారులను సముదాయించినా.. సమాధానం చెప్పినా.. శాంతించకపోవడంతో రెవెన్యూ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ధరణి సాఫ్ట్‌వేర్ లోపాలూ వీరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజాయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకుఆదేశించింది.
రెవెన్యూలో భయం.. భయం!
Published Tue, Nov 5 2019 3:49 AM | Last Updated on Tue, Nov 5 2019 3:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment