రెవెన్యూ శాఖలో పదోన్నతులు! | Promotions in the Revenue Department | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖలో పదోన్నతులు!

Published Mon, Aug 30 2021 1:42 AM | Last Updated on Mon, Aug 30 2021 1:42 AM

Promotions in the Revenue Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట. ఈ శాఖ పరిధిలోని ఉద్యోగులకు సెప్టెంబర్‌లో పదోన్నతులిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ను కలిసినప్పుడు ఆయన ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ హోదా వరకు పలుస్థాయిల్లో పదోన్నతులు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

40–50 స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, 90–100 డిప్యూటీ కలెక్టర్లు, 160 తహశీల్దార్‌ పోస్టులు ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 369 మంది నాయిబ్‌ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) నిర్ణయించిందని, అయితే ఇందులో 190 మందికి మాత్రమే పదోన్నతులు ఖరారు చేయగా, మిగిలిన వారికి ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ ప్యానెల్‌ ఇయర్‌ ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో డీపీసీ ఆమోదం వచ్చినా పదోన్నతులు రాని నాయబ్‌ తహసీల్దార్ల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

గ్రామానికి ఒక్కరే వీఆర్‌ఏ!
సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో ట్రెసా నేతల భేటీ సందర్భంగా వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఇస్తామని, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసినందున వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం (వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి ముందు) 5,836 మంది వీఆర్వోలుగా పనిచేస్తున్నారు. వీరి భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన సిబ్బందిలో కనిపిస్తున్నా, వారిలో అర్హులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించి, మిగిలిన వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. వీఆర్‌ఏల విషయానికి వస్తే గ్రామానికి ఒక్కరిని మాత్రమే వీఆర్‌ఏగా కొనసాగిస్తారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల మంది వీఆర్‌ఏలు ఉండగా, గ్రామానికి ఒకరి చొప్పున కొనసాగిస్తే 10 వేల మందికి ఊరట కలగనుంది. మిగిలిన వారిని అర్హతలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.  

సీనియార్టీ సమస్యలు 
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌జీడీసీ)ల వరకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఆ తర్వా త రెవెన్యూ కోటాలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా మాత్రమే అవకాశముంది. దీంతో సీనియార్టీ సమస్యలు వస్తున్నాయని రెవె న్యూ సంఘాలంటున్నాయి. డీఆర్‌వో, జేసీలాంటి పోస్టుల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, డీఆర్‌వో పోస్టుకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను పరిగణనలోకి తీసుకుంటుండటంతో ఆ తర్వాత పదోన్నతులు రావడం లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ పరిధిలో సెలక్షన్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌జీడీసీ) పోస్టు సృష్టించాలని ‘ట్రెసా’విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఈసారి ఐదు ఆప్షన్లు
రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బదిలీలకు ఒకట్రెండు ఆప్షన్లు ఇచ్చే సంప్రదాయం ఉండగా, ఈసారి ఐదు రకాల ఆప్షన్లు ఇస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. ఇందులో స్పౌస్, మెడికల్, పీహెచ్‌సీ, జిల్లా, మల్టీజోన్‌ ఆప్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement