సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లుగా నియమితులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు (ఎస్‌జీడీసీ) అటు వేతన, ఇటు పాలనాపర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వకపోవడంతో 18 మంది అదనపు కలెక్టర్లకు ఆరునెలలుగా వేతనాలు కూడా రాలేదని తెలుస్తోంది. గతంలో పనిచేసిన స్థానం నుంచే కొందరు ఇప్పటికీ వేతనాలు డ్రా చేస్తున్నారని, ఆ పోస్టుల్లో ఇతర అధికారులు వచ్చి చేరితే వేతనాలు రావడం లేదని సమాచారం. వేతనాలతో పాటు జాబ్ చార్ట్ లేకపోవడం మరో సమస్యగా మారింది. వారి విధులు, అధికారాలకు సంబంధించిన మార్గదర్శకాలు లేకపోవడంతో కలెక్టర్లు ఇచ్చిన అసైన్‌మెంట్లకే అదనపు కలెక్టర్లు పరిమితం అవుతున్నారని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. చదవండి: (స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?)
జూనియార్టీతో తిప్పలు
రాష్ట్రంలోని చాలా జిల్లాలకు అదనపు కలెక్టర్లుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న అధికారులను నియమించారు. వీరికి ప్రభుత్వంలో జాయింట్ డైరెక్టర్ స్థాయి హోదా కూడా లేదు. కానీ, జిల్లాల్లో సూపరిండెంట్ ఇంజనీర్లు, డీఎంహెచ్‌వో, ఆర్‌జేడీ, జేడీ అగ్రికల్చర్ లాంటి అధికారులు ప్రభుత్వంలో అడిషనల్ డైరెక్టర్ హోదా స్థాయిలో పనిచేస్తున్నారు. దీంతో అధికారుల మధ్య జూనియర్, సీనియర్ సమస్యలు వస్తున్నాయని, రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకుని సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం అదనపు కలెక్టర్లకు ఇబ్బందిగా మారిందని రెవెన్యూ సంఘాలంటున్నాయి.
ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో 40–50 మంది అధికారులకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టులు సృష్టించి ఇవ్వాలని, తద్వారా జిల్లాల్లో పాలన మరింత మెరుగవుతుందని సంఘాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సృష్టికి సిఫారసు చేశారని, 2016లో తయారైన ఫైలు రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌లు కూడా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment