సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు
పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment