‘ఈ- పంటతో వ్యవసాయరంగంలో మేలి మలుపు’ | CM YS Jagan Holds Review Meeting With Agriculture And Revenue Department | Sakshi
Sakshi News home page

ఈ- పంటతో వ్యవసాయరంగంలో మేలి మలుపు : సీఎం జగన్‌

Published Tue, Mar 17 2020 5:32 PM | Last Updated on Tue, Mar 17 2020 5:40 PM

CM YS Jagan Holds Review Meeting With Agriculture And Revenue Department - Sakshi

సాక్షి, అమరావతి: ఈ-పంట విధానం వ్యవసాయరంగంలో కీలక మలుపు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ-పంట వల్ల పంటల బీమా రిజిస్ట్రేషన్, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు లభించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ- పంట విధానాన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా సకాలంలో రుణాలు లభ్యం కావడానికి, వేసిన పంటలకు తగినట్టుగా రుణం పొందడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. నాలుగు కీలక బాధ్యతలను రైతు భరోసాకేంద్రాలు నిర్వర్తించేలా దిశా నిర్దేశం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో వ్యవసాయ, రెవిన్యూశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ- పంట విధానంపై వివరాలను సీఎంకు తెలిపారు. ఇదివరకటి సమావేశాల్లో ముఖ్యమంత్రి సూచనలను పరిగణలోకి తీసుకుని  ఆండ్రాయిడ్‌ ఆధారిత అప్లికేషన్‌ను రూపొందించామని వివరించారు. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ సహా ఇతర అనుబంధ రంగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్లు ఈ–పంట రిజిస్ట్రేషన్‌ చూస్తారని, వ్యవసాయంతోపాటు ఉద్యానవన, సెరికల్చర్, పశుదాణాకు సంబంధించిన పంటలు కూడా ఈ రిజిస్ట్రేషన్‌లో ఉంటాయని వివరించారు.

పంటలతోపాటుగా వెరైటీలనుకూడా ఈ అప్లికేషన్‌లో పొందుపరుస్తున్నట్టు వెల్లడించారు. సాగు చేస్తున్న పంట మొదటి పంటా, రెండో పంటా, మూడో పంటా, లేక చేపలు పెంచుతున్నారా? ఉద్యాన వన పంటలు వేస్తున్నారా? ఈ పంటల్లో అంతర పంటగా మరో పంటను ఏదైనా వేశారా? సమగ్ర వివరాలు అప్లికేషన్‌లో పొందుపరచామన్నారు. రబీ సీజన్లో ఈ అప్లికేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని చెప్పారు.  వెబ్‌ల్యాండ్‌ నమోదు సందర్భంగా ఇదివరకు రైతులు ఇబ్బందులు పడ్డారని, ఈసారి ఆ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సాగుచేసే ప్రతి రైతు ఈ-పంట కింద రిజిస్టర్‌ అయ్యేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈ పంట కింద వివరాల నమోదు డేటా బ్యాంకులతో అనుసంధానం చేయాలని, దీనివల్ల సాగు చేసిన పంటలకు తగిన రీతిలో రుణాలు పొందే అవకాశం లభిస్తుందని, అంతేకాకుండా పంట బీమాకూడా సమగ్రంగా, వేగంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. 

రైతులు ఏ పంటలు వేశారన్నది ముందుగానే తెలుస్తుంది కాబట్టి సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్లో ఎలాంటి రేట్లు లభిస్తున్నాయో పర్యవేక్షణ చేయడంతోపాటు, రైతు నష్టపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే జోక్యం చేసుకుని మార్కెట్‌లో పోటీ పెంచడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయత్నాలు చేస్తుందన్నారు. అంతేకాదు రైతులు సాగుచేస్తున్న పంటలకు సంబంధించి ముందస్తుగానే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించి... ఆ రేటుకన్నా.. తక్కువ ధరకు రైతుకు అమ్ముకునే పరిస్థితిని నివారించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త బాధ్యతగా ఈ క్రాపింగ్‌ను చేపట్టాలని, దీనిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్లను రూపొందించుకోవాలన్నారు. ఈ–క్రాపింగు చేసేటప్పుడే బోర్లకింద సాగవుతున్న భూములనుకూడా గుర్తించాలని, డేటాలో ఆ విషయాన్ని కూడా పొందుపరచాలని సీఎం చెప్పారు. 

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల విధివిధానాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ పంటలు వేయాలన్నదానిపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా మెరుగైన సాగు పద్ధతుల్లో ఈ కేంద్రాలు శిక్షణ ఇవ్వాలన్నారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను రైతులకు నేర్పించాలన్నారు.  నాణ్యతతో కూడిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ అయ్యేలా చూడాలని, దీంతో పాటు ఈ–పంట కింద వివరాలు నమోదు చేయాలన్నారు. డిమాండు – సప్లయిలను దృష్టిలో ఉంచుకుని వేయాల్సిన పంటలపై రైతులకు సూచనలు చేయాలని, ఈ వివరాలను గ్రామ సచివాలయాల్లో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచడంలో రాజీ వద్దని, ఒక ప్రతిష్టాత్మక సంస్థతో థర్డ్‌పార్టీ కింద నాణ్యత నిర్ధారణ పరీక్షలు కూడా చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్న కియోస్క్‌లో ఉంచాల్సిన వివరాలు, డేటాపైన కూడా శ్రద్ధపెట్టాలని, పలానా సమస్య వల్ల తన పంట దెబ్బతింటోందని రైతు నివేదించిన 24 గంటల్లోగా ఆ రైతుకు పరిష్కారం లభించాలని స్పష్టంచేశారు. దీనికోసం ఏర్పాటు చేస్తున్న కాల్‌సెంటర్‌ అత్యంత సమర్థవంతంగా పనిచేయాలని, కాల్‌సెంటర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement