
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం రెవెన్యూ శాఖ సమాయత్తం అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 5–15 తేదీల మధ్యలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, అందుకు తగినట్టుగా కార్యాచరణ మొదలైందని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు (ఆర్‌వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌వో)తోపాటు క్షేత్రస్థాయిలో ఎంత మంది సిబ్బంది అవసరమనే దానిపై కసరత్తు జరుగుతోందని తెలిపాయి.
ఆర్‌వోలుగా డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లతోపాటు ఈసారి జిల్లాల అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వివరించాయి. ఈ మేరకు 74 మంది డిప్యూటీ కలెక్టర్లు (ఇటీవలే పదోన్నతి పొందిన వారితో కలిపి), 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 31 మంది అదనపు కలెక్టర్లను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. ఇక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనికి వచ్చే అన్ని మండలాల తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది.
ఏఆర్‌వోల పర్యవేక్షణలో క్షేత్రస్థాయి ఏర్పాట్లు
నామినేషన్ల ప్రక్రియతోపాటు పోలింగ్ సామాగ్రి సమకూర్చుకోవడం, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయడం, పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాల కల్పన వంటి ఏర్పాట్లన్నీ ఏఆర్‌వోల పర్యవేక్షణలో జరగనున్నాయి. ప్రస్తుతం ఓటర్ల జాబితా తయారీలో భాగంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ (ఏఈఆర్‌వో) అధికారులుగా తహసీల్దార్లు పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఉండటంతో, ఆ తర్వాతే షెడ్యూల్ వస్తుందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు మార్చి 5–15వ తేదీ మధ్య షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి.
2018లో ముందస్తు ఎన్నికలతో..
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటు 2019 ఏప్రిల్–మే నెలల్లో జరగాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ కంగాళీ వాతావరణం ఏర్పడిందని.. తనను, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
2018 సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేబినెట్‌లో తీర్మానించి.. అప్పటి గవర్నర్‌ను నరసింహన్‌కు అందజేయడం, ఆయన వెంటనే ఆమోదించడం, అదే రోజున 105 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం చకచకా జరిగాయి.
అప్పుడు దేశంలో మరో నాలుగు రాష్ట్రాలకూ ఎన్నికల సమయం కావడంతో.. వాటితోపాటు తెలంగాణనూ కలిపి అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 12న నోటిఫికేషన్ జారీకాగా డిసెంబర్ 7న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈసారి అదే సమయంలో..!
ఈసారి కూడా ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. 2018లో జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా.. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది.
మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్ 28న, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఈసారి కూడా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 5–9 తేదీల మధ్య ముగిసే అవకాశాలు ఉన్నాయని.. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ రెండో వారంలోనే షెడ్యూల్ రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment