ఆత్మకూరురూరల్(మర్రిపాడు): మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూ పరిధిలో రెవెన్యూ లీలలు వెలుగుచూశాయి. సర్వే నంబర్ 682–పీ లోని భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇద్దరికి డీ ఫారం పట్టాలు అందజేశారు. 1997లో రసం రామయ్యకు రెండెకరాలకు పట్టా ఇవ్వగా, అదే భూమిని 2005లో కొక్కంటి పద్మావతి పేరుతో 2.90 ఎకరాలకు డీ ఫారం పట్టాగా ఇచ్చారు. భూమి లబ్ధిదారులు ఇద్దరూ ఏపిలగుంటకు చెందిన వారు కావడంతో నిత్యం ఈ విషయమై ఇరువర్గాల మధ్యన గొడవలు చెలరేగుతున్నాయి.
రెవెన్యూ వర్గాలు మాత్రం ముందుగా పట్టా పొందిన వారు భూమిని తమ అనుభవంలో ఉంచుకోలేదని, రెండో వారు గత 19 ఏళ్లుగా వివిధ పంటలు సాగు చేసుకుంటూ అనుభవంలో ఉంచుకున్నారని చెబుతున్నారు. అయితే పట్టా లబ్ధిదారుల కంటే వారి బంధువుల ప్రమేయంతో వివాదాస్పద భూమి సమస్య రోజురోజుకు జఠిలంగా మారి గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయమై ప్రస్తుతం సాగులో ఉన్న కొక్కంటి పద్మావతి భర్త శ్రీనివాసులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు తరచూ వినతి పత్రాలు ఇస్తున్నారు.
తన పొలంలోకి తనను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. అలాగే రసం రామయ్య భార్య తమకు ఎఫ్‌డీస్ 16/1407/97 ప్రకారం రెండెకరాలకు పట్టా ఇచ్చారని, అందులో ఉన్న 90 సెంట్లను మాత్రమే కొక్కంటి పద్మావతికి డీ ఫారం పట్టా గా మంజూరు చేసే వీలుందన్నారు.
రెవెన్యూ అధికారులను లోబరుచుకుని పద్మావతి భర్త శ్రీనివాసులు 90 సెంట్ల్లకు బదులుగా 2.90 ఎకరాలకు డీ ఫారం పట్టా పొందారని, తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మర్రిపాడు తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ట్రెయినీ కలెక్టర్ సంజనా సిన్హా శనివారం రెవెన్యూ సిబ్బందితో కలిసి వివాదాస్పద భూమిని క్షేత్ర పరిశీలన చేశారు. ఇరువర్గాలు తమ వద్దనున్న అన్ని ఆధారాలతో సోమవారం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment