● రూ.5.5 లక్షల విలువైన 25 మోటార్ల స్వాధీనం
తోటపల్లిగూడూరు: ఇనుప వ్యాపారం పేరుతో పగటి పూట గ్రామాల్లో తిరుగుతూ రాత్రి వేళల్లో పొలాల్లో మోటార్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ సౌజన్య వివరాలు వెల్లడించారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం గ్రామానికి చెందిన కత్తుల బాబీ, పొట్లూరు పూర్ణచంద్రరావు, చౌటూరు శ్రీను ముఠాగా ఏర్పడి విద్యుత్ మోటార్లు చోరీ చేస్తున్నారు. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, వెంకటాచలం, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాలుగు నెలల్లో వీరిపై 11 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి రూ.5.5 లక్షల విలువైన 25 మోటార్లను రికవరీ చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా ఐదునెలల కాలంలో నెల్లూరు సబ్ డివిజన్‌లో చోరీకి గురైన 103 మోటార్లను రికవరీ చేశామని ఏఎస్పీ వెల్లడించారు. కేసులను ఛేదించి మోటార్లను రికవరీ చేయడంతోపాటు నిందితులను పట్టుకున్న పలు స్టేషన్ల పోలీస్ అధికారులు, సిబ్బందికి ఏఎస్పీ రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, కృష్ణపట్నం పోర్టు స్టేషన్ల ఎస్సైలు వీరేంద్రబాబు, విశ్వనాథరెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.