ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికాబద్ధమైన ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ లేఅవుట్లు) నిర్మాణానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి భూములను గుర్తించి ముందస్తుగా మునిసిపల్ శాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి అందుకు ఉపయోగించకుండా ఉన్న భూములను సేకరించాలని ఆదేశించారు.
స్మార్ట్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ఉపయోగపడే ఇలాంటి భూములను క్రమబద్ధీకరించి మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు నేరుగా ఇచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అలాంటి భూముల వివరాలను సీసీఎల్‌ఏకు పంపాలని కలెక్టర్లకు సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం మాత్రమే కలెక్టర్లకు ఈ అధికారాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేవదాయ, వక్ఫ్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంబంధిత భూములు, పర్యావరణ సున్నితమైన భూములను ఈ సేకరణ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. చెరువు, కాలువ కట్టలు, నీటి వనరులున్న భూములు, అడవులతో నిండిన కొండ ప్రాంతాలతోపాటు అభ్యంతరకరమైన ప్రభుత్వ పోరంబోకు, కమ్యూనిటీ పోరంబోకు భూములను సైతం సేకరించవద్దని ఆదేశించారు. మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా, అన్ని సౌకర్యాలతో కూడిన నివాస స్థలాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment