సాక్షి, అమరావతి: రెవెన్యూ సర్వీసుల్లో ప్రధానమైన సర్టిఫికెట్ల జారీ సమయాన్ని తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్, ఇన్‌కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్లను ఇంకా సులభంగా, తక్కువ సమయంలో జారీచేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది.
అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఈ అంశంపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా వస్తున్న దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేసి వాటి జారీ సమయంపై ఒక అంచనాకు వచ్చారు.
► కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్‌లను కలిపి ఒకటిగా ఇచ్చే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను ఇచ్చేందుకు ప్రస్తుతం 30 రోజుల గడువు ఉంది. దీన్ని ఎనిమిది రోజుల్లో జారీచేయాలని ప్రతిపాదించారు.
► గతంలో వీఆర్‌ఓ వెరిఫికేషన్‌కు ఉన్న ఏడురోజుల సమయాన్ని మూడ్రోజులకు, ఆర్‌ఐ వెరిఫికేషన్‌కు 10 రోజుల సమయాన్ని రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ రెండు దశల వెరిఫికేషన్ల తర్వాత మూడో దశలో చివరిగా తహసీల్దార్ 13 రోజుల్లో సర్టిఫికెట్ జారీచేయాల్సి వుంది. కానీ, చివరి దశను డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించి సమయాన్ని మూడ్రోజులకు కుదించాలని భావిస్తున్నారు. గతంలో ఈ సరి్టఫికెట్ జారీచేసి ఉంటే ఏ–కేటగిరీ కింద వెంటనే సర్టిఫికెట్ జారీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
► ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి సమయాన్ని 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్‌ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులకు, ఆర్‌ఐ వెరిఫికేషన్ సమయాన్ని ఐదు నుంచి రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. చివరిగా తహసీల్దార్ వద్దకు వెళ్లాక ఆయన పరిశీలించి జారీచేసే సమయాన్ని మూడు నుంచి ఐదు రోజులకు పెంచారు. మొత్తంగా జారీ సమయం 5 రోజులు తగ్గించాలని చూస్తున్నారు.
► ఇక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్ల జారీని 60 నుంచి 20 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్‌ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులు, ఆర్‌ఐ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, తహసీల్దార్ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, చివరిగా ఆర్డీఓ/సబ్ కలెక్టర్ వెరిఫికేషన్ సమయాన్ని 33 నుంచి 11 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు.
► అలాగే, ఆదాయ ధ్రువీకరణ (ఇన్‌కమ్) పత్రం జారీకి ప్రస్తుతం ఏడురోజుల గడువు వుండగా దాన్ని మాత్రం 10 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. వీఆర్‌ఓ వెరిఫికేషన్‌కు ప్రస్తుతం ఉన్న రెండ్రోజుల్ని మూడ్రోజులకు, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలనకు ప్రస్తుతమున్న మూడ్రోజుల గడువుని ఐదు రోజులుగా ప్రతిపాదించారు. మధ్యలో ఆర్‌ఐ వెరిఫికేషన్‌కు రెండ్రోజుల సమయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.
► భూమి సరిహద్దుల కొలతలు నిర్ధారించే ఎఫ్–లైన్ దరఖాస్తులు గతంలో మాదిరిగానే 30 రోజుల సమయాన్ని నిర్దేశించారు. పట్టా సబ్ డివిజన్‌కు ఉన్న 30 రోజులు, చుక్కల భూముల వినతులకు 180 రోజులు, నిషేధిత భూముల జాబితా 22 (ఎ) నుంచి తొలగించే దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న 30 రోజుల సమయాన్ని అలాగే ఉంచాలని భావిస్తున్నారు.
వీలైనంత సులభంగా, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని త్వరగా జారీచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ మార్పులు ప్రతిపాదించింది. త్వరలో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వీటిని ఆమల్లోకి తేవాలని రెవెన్యూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సర్టిఫికెట్ల జారీ సమయం తగ్గింపు?
Published Sun, Sep 25 2022 4:17 AM | Last Updated on Sun, Sep 25 2022 7:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment