family member certificate
-
కోడలికి ఫ్యామిలీ మెంబర్ రాకుండా అత్త అభ్యంతరం.. హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, అమరావతి: పెళ్లయిన ఏడాదిన్నరకే భర్తను కోల్పోయిన ఓ మహిళకు కారుణ్య నియామకం కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రాకుండా అత్త అభ్యంతరం చెప్పింది. దీంతో అధికారులు సర్టిఫికెట్ జారీ చేయలేదు. ఆస్తిపై హక్కు వదులుకుంటేనే సర్టిఫికెట్‌కు అభ్యంతరం లేదని చెబుతానని అత్త తేల్చి చెప్పింది. ఆ మహిళ చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించడమే కాదు, అనేక ఏళ్లుగా అమలు చేస్తున్న జీవోను సవరించేలా కోర్టు ద్వారా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడానికి కారణమయ్యారు. కోర్టు ఆదేశాలతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో ‘లిఖితపూర్వక అభ్యంతరం’ నిబంధన వల్ల దరఖాస్తుదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ‘కుటుంబంలో ఇతర సభ్యులెవ్వరూ లిఖితపూర్వక అభ్యంతరం లేవనెత్తకపోతేనే దరఖాస్తుదారుకు ఫ్యామిలీ మెంబర్ సరి్టఫికెట్ ఇవ్వాలి’ అని జీవోలో పేర్కొనడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అభ్యంతరాన్ని కేవలం దరఖాస్తుదారు కుటుంబ సభ్యుడా/సభ్యురాలా అన్న దానికే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ దిశగా జీవో 145కు సవరణ చేయాలని, దానికి అనుగుణంగా నడుచుకునేలా తహసీల్దార్లు, ఎమ్మార్వోలను ఆదేశించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దరఖాస్తుదారుల హక్కును హరించేందుకు కొందరు ఈ నిబంధనను వాడుకుంటున్నారని తెలిపింది. ప్రస్తుత కేసులో అత్త అభ్యంతరం చెప్పిన కారణంగా కోడలికి సర్టిఫికెట్ జారీ చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్‌కు రెండు వారాల్లో సర్టిఫికెట్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. తమ ఆదేశాలు అమలయ్యాయో లేదో తెలుసుకునేందుకు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ కేసు.. విశాఖపట్నంకు చెందిన జ్యోతి, బంగార్రాజు భార్యాభర్తలు. విశాఖపట్నం మహిళా కోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్న రాజు పెళ్లయిన ఏడాదిన్నరకే కరోనా కారణంగా చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకం కోసం జ్యోతి జిల్లా జడ్జికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు సమర్పించడానికి ఆమె ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం మాకవరపాలెం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై బంగార్రాజు తల్లి, జ్యోతి అత్త అయిన వరహాలమ్మ తహసీల్దార్‌కు లిఖితపూర్వక అభ్యంతరం తెలిపారు. బంగార్రాజు మరణానంతర ఆర్థిక ప్రయోజనాల్లో 75 శాతం ఇవ్వడంతో పాటు ఇంటిపైన, ఎకరా భూమిపైన హక్కును వదులుకుంటేనే జ్యోతికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ‘నో అబ్జక్షన్’ ఇస్తానని వరహాలమ్మ స్పష్టం చేశారు. ఈ అభ్యంతరంతో జ్యోతికి తహసీల్దార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. జ్యోతి జిల్లా కలెక్టర్‌ను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది టీవీ శ్రీదేవి, అత్త తరపున న్యాయవాది సాయి నవీన్ వాదనలు వినిపించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమికస్ క్యూరీ ఒ.మనోహర్‌రెడ్డి వివరించారు. ఈ సర్టిఫికెట్ జారీకి ఉద్దేశించిన జీవో 145ను న్యాయమూర్తి పరిశీలించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అభ్యంతరం చెప్పకపోతేనే సర్టిఫికేట్ ఇవ్వాలన్న నిబంధనపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. విచారణ సమయంలో దరఖాస్తు గురించి సదరు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చి, దరఖాస్తుదారు వారి కుటుంబ సభ్యుడా? కాదా? అన్న విషయాన్ని తేల్చేందుకే ఆ నిబంధనను ఉపయోగించాలి తప్ప, మరో ప్రయోజనం కోసం కాదని న్యాయమూర్తి తెలిపారు. సర్టిఫికెట్ జారీకి ఎలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి, వేటిని తోసిపుచ్చాలి తదితర విషయాలపై జీవోలో మరింత స్పష్టత ఇచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. -
సర్టిఫికెట్ల జారీ సమయం తగ్గింపు?
సాక్షి, అమరావతి: రెవెన్యూ సర్వీసుల్లో ప్రధానమైన సర్టిఫికెట్ల జారీ సమయాన్ని తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్లను ఇంకా సులభంగా, తక్కువ సమయంలో జారీచేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఈ అంశంపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా వస్తున్న దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేసి వాటి జారీ సమయంపై ఒక అంచనాకు వచ్చారు. ► కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్‌లను కలిపి ఒకటిగా ఇచ్చే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను ఇచ్చేందుకు ప్రస్తుతం 30 రోజుల గడువు ఉంది. దీన్ని ఎనిమిది రోజుల్లో జారీచేయాలని ప్రతిపాదించారు. ► గతంలో వీఆర్ఓ వెరిఫికేషన్‌కు ఉన్న ఏడురోజుల సమయాన్ని మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్‌కు 10 రోజుల సమయాన్ని రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ రెండు దశల వెరిఫికేషన్ల తర్వాత మూడో దశలో చివరిగా తహసీల్దార్ 13 రోజుల్లో సర్టిఫికెట్ జారీచేయాల్సి వుంది. కానీ, చివరి దశను డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించి సమయాన్ని మూడ్రోజులకు కుదించాలని భావిస్తున్నారు. గతంలో ఈ సరి్టఫికెట్ జారీచేసి ఉంటే ఏ–కేటగిరీ కింద వెంటనే సర్టిఫికెట్ జారీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ► ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి సమయాన్ని 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్ సమయాన్ని ఐదు నుంచి రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. చివరిగా తహసీల్దార్ వద్దకు వెళ్లాక ఆయన పరిశీలించి జారీచేసే సమయాన్ని మూడు నుంచి ఐదు రోజులకు పెంచారు. మొత్తంగా జారీ సమయం 5 రోజులు తగ్గించాలని చూస్తున్నారు. ► ఇక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్ల జారీని 60 నుంచి 20 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులు, ఆర్ఐ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, తహసీల్దార్ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, చివరిగా ఆర్డీఓ/సబ్ కలెక్టర్ వెరిఫికేషన్ సమయాన్ని 33 నుంచి 11 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ► అలాగే, ఆదాయ ధ్రువీకరణ (ఇన్కమ్) పత్రం జారీకి ప్రస్తుతం ఏడురోజుల గడువు వుండగా దాన్ని మాత్రం 10 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్‌కు ప్రస్తుతం ఉన్న రెండ్రోజుల్ని మూడ్రోజులకు, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలనకు ప్రస్తుతమున్న మూడ్రోజుల గడువుని ఐదు రోజులుగా ప్రతిపాదించారు. మధ్యలో ఆర్ఐ వెరిఫికేషన్‌కు రెండ్రోజుల సమయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ► భూమి సరిహద్దుల కొలతలు నిర్ధారించే ఎఫ్–లైన్ దరఖాస్తులు గతంలో మాదిరిగానే 30 రోజుల సమయాన్ని నిర్దేశించారు. పట్టా సబ్ డివిజన్‌కు ఉన్న 30 రోజులు, చుక్కల భూముల వినతులకు 180 రోజులు, నిషేధిత భూముల జాబితా 22 (ఎ) నుంచి తొలగించే దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న 30 రోజుల సమయాన్ని అలాగే ఉంచాలని భావిస్తున్నారు. వీలైనంత సులభంగా, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని త్వరగా జారీచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ మార్పులు ప్రతిపాదించింది. త్వరలో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వీటిని ఆమల్లోకి తేవాలని రెవెన్యూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఏసీబీ వలలో మరో రెవెన్యూ చేప
ముత్తుకూరు, న్యూస్‌లైన్:ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు జోరందుకున్న నేపథ్యంలో అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ స్పీడ్ పెంచింది. సరిగ్గా వారం క్రితం వింజమూరు మండలం నందిగుంట వీఆర్వో శేషయ్య ఏసీబీకి చిక్కగా శుక్రవారం ముత్తుకూరు బిట్-2 ఆర్ఐ నన్నం నాగరాజు అడ్డంగా బుక్కయ్యాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.2 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నంజుండప్ప కథనం మేరకు.. దువ్వూరువారిపాళేనికి చెందిన నడవల గున్నయ్యకు ఇటీవల గుండె ఆపరేషన్ చేయాల్సివచ్చింది. ఆరోగ్యశ్రీకార్డు ఇన్వాల్యూడ్ కావడంతో చెల్లుబాటులోకి తెచ్చేందుకు గున్నయ్య కొడుకు నడవల మోహన్ సంబంధిత వీఆర్వో పోలయ్యకు ఫోన్ చేశాడు. తాను శిక్షణలో ఉన్నానని, ఆర్ఐ నాగరాజును సంప్రదించాలని పోలయ్య సూచించాడు. దీంతో ఈ నెల 4న మోహన్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆర్ఐ నాగరాజును కలిసి, ఆరోగ్యశ్రీకార్డు విషయం ప్రస్తావించాడు. దీనికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరమని, రూ.2 వేలు ఖర్చవుతుందని ఆర్ఐ బదులిచ్చాడు. మరుసటి రోజే మోహన్ మళ్లీ ఆర్ఐని కలిసి లంచం మొత్తం తగ్గించాలని కోరాడు. దీనికి ఆయన ససేమిరా అనడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ముత్తుకూరు తహశీల్దార్ కార్యాలయంలో నాగరాజుకు మోహన్ రూ.2 వేలు ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విధి లే కే ఏసీబీని ఆశ్రయించాను: నడవల మోహన్. తండ్రి గుండె అపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమై ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అడిగాను. అది ఇవ్వడానికి ఆర్ఐ నాగరాజు రూ.2 వేలు లంచం అడిగాడు. మరోమారు కలిసి లంచం మొత్తం తగ్గించమని ప్రాధేయపడ్డాను. ఆయన ససేమిరా అన్నాడు. దీంతో విధిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఉపేక్షించేది లేదు : డీఎస్పీ నంజుండప్ప ముత్తుకూరు ఆర్ఐ నాగరాజుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నడవల మోహన్ తమకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి ఎవరైనా లంచం అడిగితే వెంటనే ప్రజలు మాకు ఫిర్యాదు చేయాలి. అవినీతి పరులు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవినీతి ఉద్యోగుల్లో ఏసీబీ గుబులు మొదటి సారి ముత్తుకూరు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడి చేసి ఆర్ఐ నాగరాజును అదుపులోకి తీసుకొన్న సంఘటన కలకలం సృష్టించిం ది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ప నిచేసే కొందరు అవినీతి ఉద్యోగుల్లో గుబులు రేగింది. రెవెన్యూ కార్యాల యంలో కొందరు వీఆర్వోలు, ఉద్యోగులు ఇటీవల లంచాలకు బాగా అల వాటు పడ్డారన్న ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపధ్యంలో ఏసీబీ దాడి జరగడంతో వారిలో కలకలం మొదలైంది.