సాక్షి, అమరావతి: పెళ్లయిన ఏడాదిన్నరకే భర్తను కోల్పోయిన ఓ మహిళకు కారుణ్య నియామకం కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రాకుండా అత్త అభ్యంతరం చెప్పింది. దీంతో అధికారులు సర్టిఫికెట్ జారీ చేయలేదు. ఆస్తిపై హక్కు వదులుకుంటేనే సర్టిఫికెట్‌కు అభ్యంతరం లేదని చెబుతానని అత్త తేల్చి చెప్పింది. ఆ మహిళ చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించడమే కాదు, అనేక ఏళ్లుగా అమలు చేస్తున్న జీవోను సవరించేలా కోర్టు ద్వారా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడానికి కారణమయ్యారు.
కోర్టు ఆదేశాలతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో ‘లిఖితపూర్వక అభ్యంతరం’ నిబంధన వల్ల దరఖాస్తుదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ‘కుటుంబంలో ఇతర సభ్యులెవ్వరూ లిఖితపూర్వక అభ్యంతరం లేవనెత్తకపోతేనే దరఖాస్తుదారుకు ఫ్యామిలీ మెంబర్ సరి్టఫికెట్ ఇవ్వాలి’ అని జీవోలో పేర్కొనడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
అభ్యంతరాన్ని కేవలం దరఖాస్తుదారు కుటుంబ సభ్యుడా/సభ్యురాలా అన్న దానికే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ దిశగా జీవో 145కు సవరణ చేయాలని, దానికి అనుగుణంగా నడుచుకునేలా తహసీల్దార్లు, ఎమ్మార్వోలను ఆదేశించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దరఖాస్తుదారుల హక్కును హరించేందుకు కొందరు ఈ నిబంధనను వాడుకుంటున్నారని తెలిపింది.
ప్రస్తుత కేసులో అత్త అభ్యంతరం చెప్పిన కారణంగా కోడలికి సర్టిఫికెట్ జారీ చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్‌కు రెండు వారాల్లో సర్టిఫికెట్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. తమ ఆదేశాలు అమలయ్యాయో లేదో తెలుసుకునేందుకు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు.
ఇదీ కేసు..
విశాఖపట్నంకు చెందిన జ్యోతి, బంగార్రాజు భార్యాభర్తలు. విశాఖపట్నం మహిళా కోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్న రాజు పెళ్లయిన ఏడాదిన్నరకే కరోనా కారణంగా చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకం కోసం జ్యోతి జిల్లా జడ్జికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు సమర్పించడానికి ఆమె ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం మాకవరపాలెం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై బంగార్రాజు తల్లి, జ్యోతి అత్త అయిన వరహాలమ్మ తహసీల్దార్‌కు లిఖితపూర్వక అభ్యంతరం తెలిపారు. బంగార్రాజు మరణానంతర ఆర్థిక ప్రయోజనాల్లో 75 శాతం ఇవ్వడంతో పాటు ఇంటిపైన, ఎకరా భూమిపైన హక్కును వదులుకుంటేనే జ్యోతికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ‘నో అబ్జక్షన్’ ఇస్తానని వరహాలమ్మ స్పష్టం చేశారు.
ఈ అభ్యంతరంతో జ్యోతికి తహసీల్దార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. జ్యోతి జిల్లా కలెక్టర్‌ను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది టీవీ శ్రీదేవి, అత్త తరపున న్యాయవాది సాయి నవీన్ వాదనలు వినిపించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమికస్ క్యూరీ ఒ.మనోహర్‌రెడ్డి వివరించారు. ఈ సర్టిఫికెట్ జారీకి ఉద్దేశించిన జీవో 145ను న్యాయమూర్తి పరిశీలించారు.
కుటుంబ సభ్యుల్లో ఎవరూ అభ్యంతరం చెప్పకపోతేనే సర్టిఫికేట్ ఇవ్వాలన్న నిబంధనపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. విచారణ సమయంలో దరఖాస్తు గురించి సదరు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చి, దరఖాస్తుదారు వారి కుటుంబ సభ్యుడా? కాదా? అన్న విషయాన్ని తేల్చేందుకే ఆ నిబంధనను ఉపయోగించాలి తప్ప, మరో ప్రయోజనం కోసం కాదని న్యాయమూర్తి తెలిపారు. సర్టిఫికెట్ జారీకి ఎలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి, వేటిని తోసిపుచ్చాలి తదితర విషయాలపై జీవోలో మరింత స్పష్టత ఇచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
కోడలికి ఫ్యామిలీ మెంబర్ రాకుండా అత్త అభ్యంతరం.. హైకోర్టు కీలక తీర్పు
Published Sun, Jan 15 2023 2:26 AM | Last Updated on Sun, Jan 15 2023 9:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment