
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, రిషికొండ రిసార్ట్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల విషయంలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ (ఎంవోఈఎఫ్) ఏర్పాటు చేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఒకపక్క రిషికొండను విచక్షణారహితంగా తవ్వేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంటే, మరోపక్క అదే ప్రభుత్వానికి చెందిన అధికారులకు కమిటీలో స్థానం కల్పించడం ఏమిటని ప్రశ్నించింది.
కమిటీలో వారికి స్థానం కల్పించే విషయాన్ని పునఃపరిశీలించాలని ఎంవోఈఎఫ్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నం జిల్లా యందాడ గ్రామంలోని సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ గత ఏడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఇదే అంశంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారించిన సీజే ధర్మాసనం.. రిషికొండ తవ్వకాలపై సర్వేచేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు రావడంతో.. ధర్మాసనం ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె.ఎస్.మూర్తి స్పందిస్తూ.. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అధికారులున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కమిటీ కూర్పుపై పునఃపరిశీలించాలని ఎంవోఈఎఫ్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment