
రాజేందర్‌రెడ్డి (ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: భూ కబ్జా వ్యవహారం ఓ నిండు ప్రాణం తీసింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్ కొనుగోలు చేసిన ఓ ఉపాధ్యాయుడు నిలువునా మోసపోయాడు. అప్పటికే ఆ ప్లాట్ వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయి ఉండడతో షాక్‌కు గురైన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కానీ న్యాయం జరగకపోగా అతనిపైనే ఎదురు కేసు నమోదైంది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన భర్త రాజేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ మోసంతోపాటు పోలీసు అధికారుల బెదిరింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య జయలక్ష్మి ఆరోపించింది.
నగరంలో భూ కబ్జాల వ్యవహారం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. రియల్టర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై అమాయకులను మోసం చేసి రూ. లక్షలు దండుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారిలో వెళ్లే వారికి చట్టం సకాలంలో భరోసా కల్పించకపోవటంతో ఓ నిండు ప్రాణం బలైంది.
వివరాల్లోకి వెళితే కర్మాన్‌ఘాట్ మాధవనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బి.రాజేందర్‌రెడ్డి దంపతులు పొదుపు చేసుకున్న డబ్బుతో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఫిబ్రవరి 2106లో ప్లాటు కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ పాటు మున్సిపల్ అనుమతులు తీసుకున్నాడు. తీరా చూస్తే 2019 ఏప్రిల్15న అదే ప్లాట్‌ను వినోద్‌బాబు అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ప్రహారీ నిర్మాణం చేపట్టాడు.
ఈ విషయం తెలియడంతో రాజేందర్‌రెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిబ్బంది అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించారు. ఆపై కాగితాలు తీసుకురమ్మని ఆదేశించగా ఒరిజిల్స్ తీసుకువెళ్లిన దంపతులపై మే6న కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సైతం రెండో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికే సహకరిస్తున్నారన్న అనుమానంతో కోర్టును ఆశ్రయించిన రాజేందర్‌రెడ్డి ఇంజెక్షన్ ఆర్డరు పొందారు.
అయినా ఆ స్థలంలోకి వెళ్లేందుకు వీళ్లేదంటూ రాజేంద్రనగర్ పోలీసులు హుకుం జారీ చేయటం, ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి ఇవ్వాలని ఆదేశించటంతో ఈ నెల 21న అన్ని సర్టిఫికెట్లు తీసుకువెళ్లి పోలీస్ అధికారికి అందజేశారు. సదరు అధికారి తీరుతో మనస్తాపానికిలోనైన రాజేందర్‌రెడ్డి ఈనెల 22న ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగిరాలేదు. తన భర్త కోసం గత వారం రోజులుగా గాలిస్తున్న జయలక్ష్మికి శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమీపంలో రైలు పట్టాలపై రాజేందర్‌రెడ్డి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందడంతో కుప్పకూలింది.
పోలీసుల పాపమే: జయలక్ష్మి
తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాటును తమకు కాకుండా చేసేందుకు ఒక వ్యక్తితో కుమ్మక్కైన పోలీసు అధికారి బెదిరింపు కారణంగానే తన భర్త మరణించాడని మృతుడు రాజేందర్‌రెడ్డి భార్య జయలక్ష్మి ఆరోపించింది. ఉస్మానియా మార్చురీలో గుర్తుపట్టరాని స్థితిలో ఉన్న భర్త శవం వద్ద బోరుగా విలపిస్తూ ఇంత దారుణం చేస్తారని ఊహించలేదని కన్నీరుమున్నీరైంది. తన భర్త మృతిపై విచారణ చేపట్టాలని ఆమె పోలీస్ ఉన్నతాధికారులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment