కె.పుల్లయ్య కొనుగోలు చేసిన స్థలం
ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెంచర్‌లో 2000వ సంవత్సరంలో ప్లాట్ నంబర్ 99ఏ కొనుగోలు చేశాడు. ఏటా ఒకటి, రెండు సార్లు ప్లాటు వద్దకు వచ్చి చూసుకొని వెళ్లేవాడు. అయినా ఇటీవల తన ప్లాటు కర్నూలుకు చెందిన చిట్టిబాబు పేరుతో ఉందని తెలుసుకుని అతన్ని నిలదీశాడు. తాను కూడా కురువ మధు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని చిట్టిబాబు వివరణ ఇవ్వడంతో ఈసీ తీశాడు. అప్పటికే 15 మంది చేతులు మారిందని తెలుసుకొని నోరెళ్లబెట్టాడు. ‘నేనెవరికీ ప్లాటు విక్రయించకున్నా ఇలా ఎందుకు జరిగిందని రిజిస్ట్రేషన్ అధికారులను, వెంచర్ వేసిన వారిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు’ అ బాధితుడు వాపోతున్నాడు.
సాక్షి,కర్నూలు(సెంట్రల్): మన పొలమో, ప్లాటో, ఇల్లో ఎక్కడికి పోతుందిలే అనుకుంటే పొరపాటే. డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని, భూములు, స్థలాలు మన కళ్లెదుటే ఉన్నాయనుకొని ఇంట్లో కూర్చుంటే అక్రమార్కులు బరి తెగించి కొత్త మోసాలతో మాయ చేసేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇతరుల పేరుతో సొంతం చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు రిజిస్ట్రేషన్ అధికారుల వ్యవహారంతో ఆస్తులు కోల్పోయి బాధితులు రోడ్డున పడుతున్నారు.
పదే పదే రిజిస్ట్రేషన్..
కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కొందరు మాఫియాగా ఏర్పడి భూములు, స్థలాలు, ఇళ్లను రాత్రికి రాత్రే ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వీరికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటున్నట్లు సమాచారం. ముందుగా భూమాయగాళ్లు ప్లాటు, స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా రిజిస్ట్రేషన్ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని తమ పేరుతో గానీ, తమకు తెలిసిన వారి పేర్లతో గానీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ తరువాత అదే స్థలాన్ని పదే పదే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ పోతారు.
రిజిసే్ర్టషన్ సమయంలో స్థలం/పొలం/ఇంటి వద్దకు వెళ్లరు. మొదటి సారి ఆ ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్లు లింకు డాక్యుమెంట్ అడగకుండా మేనేజ్ చేస్తారు. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకుంటూ పోతారు. ఈ ప్రక్రియలో ఎవరైనా ఆస్తిదారులు అప్రమత్తమైతే పంచాయితీకి రమ్మంటారు. ఏదో పొరపాటున జరిగి పోయిందని ఎంతో కొంత చెల్లిస్తే వెనక్కి ఇస్తామని, లేదంటే రిజిస్ట్రేషన్ చార్జీలను అయినా చెల్లించాలని కోరతారు. కె.పుల్లయ్య విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘సెటిల్ చేసుకుందామని పంచాయితీకి పిలుస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు’ అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
వెయ్యికి పైగా కేసులు..
జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డబుల్ రిజిస్ట్రేషన్‌లు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, పదే పదే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. విష యం తెలుసుకున్న లబ్ధిదారులు కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఐదేళ్లలో దాదాపు 1,000కి పైగా కేసులు వచ్చాయి. వీటిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తరువాత దానిని రద్దు చేసే అధికారం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కేసులు కోర్టులకు ఎక్కుతున్నాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా కొన్ని వందల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు ఫిర్యాదు దారులు పంచాయితీల ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment