తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పులదండ | Land Issue: Wreath Of Sandals For Parents Photos In Suryapet | Sakshi
Sakshi News home page

వీళ్లసలు కొడుకులేనా?

Published Wed, Dec 16 2020 8:37 AM | Last Updated on Wed, Dec 16 2020 8:37 AM

Land Issue: Wreath Of Sandals For Parents Photos In Suryapet - Sakshi

రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులనైనా.. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలనైనా సరే నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడేస్తున్నారు. ఆస్తికున్న విలువ అమ్మానాన్నకు ఇవ్వడంలేదు. కొడుకుపై ఉండే ప్రేమ కూతురిపై చూపించడంలేదు. విచిత్రమేమిటంటే.. ఏ కొడుకుల కోసం ఆడపిల్లలను వద్దని అనుకుంటున్నారో.. ఆ కొడుకులే తల్లిదండ్రులపాలిట కాలయములవుతున్నారు. రాష్ట్రంలో జరిగిన మూడు ఘటనలు చూస్తే అసలు మన సమాజం ఎక్కడికి వెళుతుందో అనే అనుమానం కలగకమానదు. డబ్బులివ్వడంలేదనే కోపంతో తల్లి మెడపైనే కాలేసి తొక్కి చంపడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడు ఒకడైతే.. ఆస్తి పంచడంలేదనే కారణంతో తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పులదండలేసి అవమానించిన పుత్రులు మరో ఇద్దరు. ఇవన్నీ చూస్తే.. ‘తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు..’అన్న వేమన పద్యం గుర్తురాక మానదు.

సాక్షి, సూర్యాపేట : కని, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను ఇద్దరు కుమారులు ఘోరంగా అవమానించారు. అమ్మానాన్నలను చిత్రహింసలకు గురిచేయడమేకాకుండా వారి చిత్రపటానికి చెప్పులదండ వేసి కుటుంబ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. అంతటితో ఆగకుండా తండ్రిని కిడ్నాప్‌ చేసి బలవంతంగా భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని భగత్‌సింగ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న తహసీల్దార్‌ సంజీవరావు, సరోజ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్దకొడుకు నూనె రవీందర్, మూడో కొడుకు నూనె దయాకర్‌లు ప్రభుత్వ ఉద్యోగులు. నాలుగో కుమారుడు ప్రశాంత్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. రెండో కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. కుమార్తె సుజాత వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడింది. సంజీవరావుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో ఐదెకరాల భూమి ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో రవీందర్, దయాకర్‌లు తండ్రితో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరూ కలిసి తల్లిదండ్రుల చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఫొటో తీశారు. దీనిని కుటుంబ వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం సంజీవరావును కిడ్నాప్‌ చేసి రామన్నపేటకు తీసుకెళ్లి బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. చదవండి: టీచర్‌ కాదు.. టీచకుడు


తల్లిదండ్రుల ఫోటోకు చెప్పులదండ వేసిన కుమారులు రవీందర్‌, దయాకర్‌

పోలీసులకు తల్లి ఫిర్యాదు
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాలుగో కుమారుడికి సాయం చేస్తుంటే తమపై దాడి చేస్తున్నారని తల్లి సరోజ ఆరోపించారు. రవీందర్, అతని కుమారులు నూనె ప్రశాంత్, నూనె భాస్కర్‌ల సహాయంతో తన భర్త సంజీవరావును కిడ్నాప్‌ చేశారని ఆమె ఈనెల 14న సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం పోలీసులు రవీందర్‌ను, ఆయన కుమారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే దయాకర్‌ను మిర్యాలగూడలో పోలీసులు పట్టుకొని సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తండ్రి నుంచి ఆస్తులు బలవంతంగా రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నట్టు విచారణలో వారు అంగీకరించడంతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తన ఇష్టపూర్వకంగానే కుమారుడు రవీందర్‌ ఇంటికి వెళ్లానని సంజీవరావు చెప్పడం గమనార్హం. మరోవైపు తల్లిదండ్రులను అవమానిస్తే ఊరుకోబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ ఎ.ఆంజనేయులు హెచ్చరించారు. (చదవండి: పుట్టిన కాసేపటికే కన్నుమూసిన పసికందులు)

తల్లి మెడపై కాలేసి..
గణపురం: డబ్బులు అడిగినా ఇవ్వడంలేదనే కోపంతో కన్నతల్లినే చంపడానికి సిద్దపడ్డాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. డబ్బు కోసం ఆమెపైనే వేధింపులకు దిగి హత్య చేయబోయాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఎస్సీ కాలనీ(ఎర్రగడ్డ)లో మంగళవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బొట్ల సమ్మక్క(75)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి సమ్మక్క స్థానికంగా ఉన్న ఓ రైస్‌మిల్లులో పని చేస్తోంది. స్వామి తరచుగా తల్లి వద్దకు వచ్చి డబ్బు కోసం వేధించేవాడు. మంగళవారం తెల్లవారుజామున సమ్మక్కను తీవ్రంగా కొట్టి బంగారం, డబ్బు లాక్కోవడమే కాక మెడపై కాలుమోపి హత్యచేసే ప్రయత్నం చేశాడు. స్థానికులు ఇది గమనిం చి గట్టిగా అరవడంతో స్వామి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సమ్మక్కను ములుగు ఆస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement