పంపిణీ సరే...పట్టాలేవీ?
భూముల రిజిస్ట్రేషన్లలో ఎడతెగని జాప్యం
- తొమ్మిది నియోజకవర్గాల్లోనే దళితులకు భూపంపిణీ అమలు
- ప్రైవేటు భూముల కొనుగోలుపైనే తర్జనభర్జన
- చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు
నీలగిరి : కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మందగించింది. పంద్రాగస్టునాడు శ్రీకారం చుట్టిన ఈ పథకానికి ఆది నుంచి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మొదట్లో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి భూమిలేని దళితులకు మూడెకరాలు పంపిణీ చేయాలని భావించారు. అది ఆచరణ సాధ్యంకాకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి అర్హులైన లబ్ధిదారులకు భూపంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల దృష్ట్యా కేవలం 9 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. మునుగోడు, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో భూములు కొరతతో లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కన పెట్టేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నప్పటికీ భూసమస్య వల్లనే అందరికి ఈ పథకం వర్తింపచేయలేకపోయారు.
భూముల కొనుగోలు భారం
పన్నెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో దళిత కుటుంబాలు 1489 మంది ఉండగా...వీరిలో అసలు భూమి లేని నిరుపేద కుటుంబాలు, పథకానికి అర్హులైన 260 మందిని గుర్తించారు. దీంట్లో 102 కుటుంబాలకు 247 ఎకరాలు భూ పంపిణీ చేశారు. అయితే మొత్తం పంపిణీ చేసిన దాంట్లో ప్రభుత్వ భూమి కేవలం 18 ఎకరాలకు మించి లేదు. మిగతా 229 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇచ్చిందే. ప్రభుత్వ నిర్ణయించిన రేటు ప్రకారం ఎకరాకు రూ.3 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. కానీ ఇంతవరకు భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం చేయించలేదు.
కేవలం పంద్రాగస్టు రోజున మంజూరు పత్రాలు ఇచ్చారు. ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల లభ్యతను బట్టి లబ్ధిదారులకు పత్రాలు ఇచ్చారు. చాలా చోట్ల భూములు ఉన్న గ్రామాల్లో లబ్ధిదారులు ఉండకపోవడం, లబ్ధిదారులు ఉన్న గ్రామాల్లో భూములు లభించకపోవడం వంటి సమస్యలు అధికారులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ప్రైవేటు భూము లు అమ్మేందుకు భూయజమానులు ముందుకు వస్తున్నా, ప్రభుత్వం నిర్ణయించిన ధరను అమ్మేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఈ పథకాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారన్నది వేచిచూడాల్సిందే.
వచ్చేవారంలో పూర్తిచేస్తాం : శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
రెవెన్యూ యంత్రాంగం సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో బిజీగా ఉంది. వచ్చే వారంలో లబ్ధిదారులకు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం. చాలా చోట్ల భూమి కొరత ఉంది. పట్టాదారులు అమ్మేందుకు ముందుకు వస్తు న్నా, మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధర చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశానుసారం పథకాన్ని అమలు చేయడానికి కృషి చేస్తాం.