కర్నూలు(అగ్రికల్చర్): పౌరులకు ఆధార్ సంఖ్య కేటాయించినట్లుగానే భూములకు, ఇతర స్థిరాస్తులకు భూధార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూధార్ విధానం ఇప్పటికే జగ్గయ్యపేట, ఉయ్యూరుల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలులో ఉంది. ఈ విధానం అమలుపై తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో త్వరలో జరగనున్న వర్క్‌షాపునకు కర్నూలు ఆర్‌డీఓ హుసేన్‌సాహెబ్ వెళ్లనున్నారు. ఆయన తిరిగొచ్చిన అనంతరం జిల్లాలో ప్రాజెక్టు అమలుపై ప్రాథమిక పనులు మొదలు కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లోపు అమలయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భూధార్‌లోనే అన్ని వివరాలు..
భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరును కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 4,67,243 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవిగాక 60 లక్షలకు పైగా స్థిరాస్తులు అంటే ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆధార్ నంబర్ల తరహాలో భూధార్ నంబర్లు ఇవ్వనున్నారు. భూధార్‌లో భూ యజమానిపేరు, విస్తీర్ణం, భూమి మార్కెట్ విలువ తదితర 20 అంశాలు ఉంటాయి. ఇందులో ప్రతి సర్వే నంబరును జియోట్యాగింగ్ చేస్తుండటంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తులకు విశిష్ట నంబరు..
ప్రభుత్వ భూములు, స్థలాలు మొదట రెండు సున్నాలతో విశిష్ట నంబరును కేటాయిస్తారు. వీటిని కూడా జియోట్యాగింగ్ చేయడం వల్ల ఆన్‌లైన్‌లో భూధార్ నంబరు కొట్టగానే ఆ భూమి ఎక్కడ ఉందో తెలుస్తుంది. జియోట్యాగింగ్ చేసిన తర్వాత భూములను ఎవరైన కొనుగోలు చేస్తే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ (మార్పులు) జరుగుతాయి. మ్యుటేషన్ కోసం మీసేవ కేంద్రాలు, రెవెన్యూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్‌లు, మోసపూరితంగా రుణాలు పొందే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment