విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత
* 19మండలాలకు వర్తింపు.. ఒకటి రెండురోజుల్లో ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ-గుంటూరు పరిసరాల్లో భూముల రిజష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ప్రాంతంలో భూముల ధరలు కొండెక్కాయి. అయినప్పటికీ ఆశించినంతగా ఖజానాకు ఆదాయం రావడంలేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినా రిజిష్ట్రేషన్ల విలువ తక్కువగానే ఉంటుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువలు ఎలా ఉందీ పరిశీలించాల్సిందిగా కొద్దిరోజుల క్రితమే రెండు జిల్లాల రిజిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు.
మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువను నిర్ధారించడంద్వారా స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అరుునట్లు అధికారులు చెబుతున్నారు. ఒకటీ రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులూ వెలువడనున్నట్టు తెలిపారు.
కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, తాడేపల్లి, అమరావతి, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు అర్బన్, రూరల్ మండలాలను ‘రిజిస్ట్రేషన్ల నిలిపివేత’ పరిధిలో చేర్చినట్లు సమాచారం. భూముల ధరల పెరుగుదల ప్రభావం రాజధాని లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.