YSRCP Plenary 2022 Day 2: AP CM YS Jagan Speech Highlights - Sakshi
Sakshi News home page

CM YS Jagan: మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్‌

Published Sat, Jul 9 2022 2:47 PM | Last Updated on Sat, Jul 9 2022 10:53 PM

CM YS Jagan Speech At YSRCP Plenary 2022 Day 2 - Sakshi

సాక్షి,గుంటూరు/విజయవాడ: భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా.. రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ను ఎన్నుకుంది ప్లీనరీ. అనంతరం జన సంద్రాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.  

‘‘ఈరోజు జన సునామీ కనిపిస్తోంది. ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్‌. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  పార్టీని గట్టి పునాదిపై నిర్మించుకున్నాం. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నాం. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని అన్నారాయన. 

నాన్న మరణ వార్త విని సుమారు 700 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను పరామర్శించడం నా బాధ్యతగా భావించా. నాపై కాంగ్రెస్‌, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయి. నాపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కుట్రలకు, తప్పుడు కేసులకు లొంగేవాడు కాదు జగన్‌. నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఆనాడూ చంద్రబాబు మన పార్టీలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. 2014లో 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి.. 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు.

ఒక్క ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. నిండు మనసుతో మీ అందరికీ సెల్యూట్‌ చేస్తున్నా అని ప్రజాభివాదం చేశారు సీఎం జగన్‌.

చంద్రబాబుకు ఆ చిప్‌ లేదు 
ఈ మధ్య చంద్రబాబు రింగ్‌లో చిప్‌ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా రింగ్‌లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్‌ ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్‌ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంట. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుంది. కానీ, మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ తీసుకెళ్లడానికి శ్రమిస్తోంది. ఒక్క విద్యారంగం కోసమే తొమ్మిది పథకాలు తీసుకొచ్చింది.. అంటూ ఇప్పటిదాకా వెచ్చించిన పలు సంక్షేమ నిధుల కేటాయింపులను సభాముఖంగా ప్రకటించారు సీఎం జగన్‌. 

14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేసింది మీ జగన్‌ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశాం. మరింత పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. టీడీపీ అంటే పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు అని సీఎం జగన్‌ ప్రస్తావించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇది కూడా చదవండి: బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్‌

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement