ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం పలు రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. స్థిరాస్తి దానం, ఎన్‌కంబరెన్సీ సర్టిఫికెట్‌లు (ఈసీ), దస్తావేజు నకళ్లు (సర్టిఫైడ్ కాపీ) ఫీజులు కూడా పెరిగాయి. తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునేందుకు (రెక్టిఫికేషన్), ఒ ప్పందం (రాటిఫికేషన్) రద్దు (క్యాన్సలేషన్) ఫీజులను ప్రభుత్వం ఏకంగా పదిరే ట్లు పెంచేసింది. స్థలాన్ని అభివృద్ధి చేసేం దుకు కుదుర్చుకునే ఒప్పందాల రుసుము భారీగా పెరగడంతో బిల్డర్లు, స్థల యజమానులకు భారంగా మారనుంది. వీటితోపాటు వివిధ రకాల రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వం పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సమయం, సందర్భం లేకుండా ఇష్టారీతిన పెంచడంపై విమర్శలు చేస్తున్నారు.
గిఫ్ట్‌డీడ్ భారం..
రక్త సంబంధీకులకు స్థిరాస్తి దానం (గిఫ్ట్ డీడ్) ఇక భారం కానుంది. సెటిల్‌మెంట్ రాయించేందుకు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోయేది. ఇకపై దీనికోసం స్థిరాస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (ఉదాహరణకు రూ.2 లక్షల విలువ ఉన్న స్థిరాస్తి దానం చేస్తే సెటిల్‌మెంట్ రాయించేందుకు 0.5 శాతంతో రూ.వెయ్యి చెల్లించాలి. అదే రూ.లక్ష విలువైన స్థిరాస్తి దానంలో 0.5 శాతంతో చూస్తే రూ.500 చెల్లించాల్సి ఉన్నా కనిష్టంగా రూ.వెయ్యి నిర్ధారించడంతో అంత పుచ్చుకోవాల్సిందే.) రూ.30లక్షలు ఉంటే సెటిల్‌మెంట్ రాయించేందుకు 0.5 శాతం విలువతో చూస్తే రూ.15వేలు చెల్లించాలి. అయితే గరిష్టంగా రూ.10 వేలు నిర్ధారించడంతో అంతే చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు స్థిరాస్తి దానం చేసేవారిపై భారంపడనుంది. రూ.వెయ్యి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే చోట భారం అధికం కానుంది. ప్రస్తుతం స్థిరాస్తి విలువల దృష్ట్యా ఎక్కడా కనిష్ట విలువ అమలయ్యే పరిస్థితి లేదు. స్థిరాాస్తి దానంలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఫీజులతో అమితభారం మోయాల్సి వస్తుంది.
ఇవికూడా భారమే..
భూమి, ఇల్లు, ఇంటిస్థలం కొనాలనుకునే వారు ముందుగా ఆ ఆస్తికి సంబంధించి గతంలో జరిగిన లావాదేవీల వివరాల కాపీ (ఎన్‌కంబరెన్సీ సర్టిఫికెట్) పొందేందుకు ఫీజు ప్రస్తుతం రూ.100 ఉంది. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. కాలాన్ని బట్టి ఈసీల కోసం రెండు రకాల ఫీజులను నిర్ణయించింది. 30 ఏళ్ల లోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ.200, 30 ఏళ్లకు మించిన లావాదేవీల వివరాలు కావాలంటే రూ.500 చెల్లించాలని నిర్ణయించింది. దస్తావేజు నకళ్లు (సర్టిఫైడ్ కాపీ) ప్రస్తుతం రూ.50 ఉన్న సీసీ ఫీజును నాలుగు రేట్లు పెంచి రూ.200 చేసింది.
ఇవి అమితభారం..
రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు వంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే (రెక్టిఫికేషన్) అవకాశం ఉంది. ఆస్తి వాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే, పలాన తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ (రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటు ఉంది. ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలున్నా, రిజిస్ట్రేషన్ తర్వాత రద్దు (క్యాన్సలేషన్) చేసుకునే అవకాశం ఉంది. ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం పది రేట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం రూ.100 రుసుము ఉండగా, రూ.వెయ్యికి పెంచింది. స్థలాన్ని అభివృద్ది చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందాల రుసుము భారీగా రూ.2 వేలు ఫీజు ఉంటే.. రూ.20 వేలకు పెంచింది. అభివృద్ధి ఒప్పంద ఆస్తి విలువలో ఫీజు 0.5 శాతం గరిష్టంగా రూ.20 వేలకు పెంచారు. పరోక్షంగా ఇళ్ల కొనుగోలుదారులపై ఈ భారం పడనుంది. జిల్లాలో ఇప్పుడిప్పుడే అపార్ట్‌మెంట్ల సంస్కృతి ఊపందుకుంటుంది. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లలో ఇప్పుడిప్పుడే స్థలాల అభివృద్ధి జరుగుతుండగా ఈ నిర్ణయం ఇటు బిల్డర్లు, అటు ఇళ్ల కొనుగోలుదారులను నిరాశకు గురిచేసింది.
ఆదాయంపైనే దృష్టి..
ఆదాయం పెంచుకోవాలనే లక్ష్యంతోనే రిజిస్ట్రేషన్ శాఖ ఈ భారాన్ని మోపినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, బోథ్, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. 2012-13లో అమ్మకం దస్తావేజులు 34,370, ఇతర దస్తావేజులు 12,838 జరిగాయి. లక్ష్యం రూ.63 కోట్ల 64 లక్షల 55 వేలు కాగా, రూ.62 కోట్ల 79 లక్షల 61 వేలు సాధించారు. 2011-12 కంటే 25 శాతం అధికంగా లక్ష్యం సాధించారు.
నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు
Published Sun, Sep 1 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement