
భూముల రిజిస్ట్రేషన్‌కు రైతుల అంగీకారం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి పనుల్లో ముందడుగు పడింది. ఆలయం చుట్టూ ఉన్న గుట్టలను, కొండలనూ నవగిరులు, అభయారణ్యం, గ్రీన్‌పార్కులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రెండు వేల ఎకరాల స్థలం కావాల్సి ఉంది. అయితే దేవస్థానం పరిధిలో 1200 ఎకరాలు ఉండగా, మిగిలిన 800 ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేసీ సత్యనారాయణ సోమవారం యాదగిరిగుట్ట పరిసర గ్రామాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గుండ్లపల్లి, దాతారుపల్లి గ్రామ రైతులు 200 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేందుకు అంగీకరించారు. దేవస్థానం అభివృద్ధి మండలి సదరు రైతులకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోనుంది. ఈ నెల 23న ఈ 200 ఎకరాలు దేవస్థానానికి రిజిస్ట్రేషన్ చేసేందుకు రైతులు అంగీకరించినట్లు జేసీ తెలిపారు.
స్వయం ప్రతిపత్తిగా యాదగిరిగుట్ట?
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానం సైతం అటానమస్ (స్వయం ప్రతిపత్తి) క్షేత్రంగా మారే అవకాశాలు లేకపోలేదని దేవస్థానం అధికారులు అంటున్నారు. ఆలయం అభివృద్ధిపై తరచూ సమీక్షలు జరుపుతున్న సీఎం కేసీఆర్ గుట్ట దేవస్థానాన్ని స్వయం ప్రతిపత్తిగా ఎలా చేయాలని సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని తెలిసింది. స్వయం ప్రతిపత్తి అయితే దేవస్థానం ఈఓలుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియామకం చేసి పంపుతుంది. ఇప్పటి వరకు ఆర్జేసీ కేడర్ అధికారులను ఈఓలుగా గుట్టకు నియమిస్తున్నారు. స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఫైలు కూడా సీఎం టేబుల్‌పై ఉందని దేవస్థానం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి సీఎం యాదగిరిగుట్టకు వస్తే.. రోడ్డు వెడల్పు ఎన్ని ఫీట్లు, స్వయం ప్రతిపత్తి విషయం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.