భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు లేనట్లే!
- రెవెన్యూ లక్ష్యాన్ని చేరాలంటే పెంచక తప్పదన్న రిజిస్ట్రేషన్ల శాఖ
- రూ.400 కోట్ల పెంపు ప్రతిపాదనలను తోసిపుచ్చిన సర్కారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఈ ఏడాదికి పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భూముల ధరలను సమీక్షించడం తప్పనిసరని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. అయితే, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చిన ధరల పెంపు ప్రతిపాదనలను సర్కారు తాజాగా తోసిపుచ్చిందని, ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరల పెంపు అంశం ప్రస్తుతానికి వాయిదా పడినట్లేనని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి రెండేళ్లకోసారి భూముల ధరలను రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షించాలి.
2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం భూముల ధరలను సవరించింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడటం, మూడేళ్లుగా భూముల ధరల పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుండటం, వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తుండటం జరుగుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడం, మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా మార్కెట్ వాల్యూ మరింత తగ్గడం.. తదితర అంశాలు రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతియేటా రెవెన్యూ వసూళ్లకు సంబంధించి లక్ష్యాలను పెంచుతున్న సర్కారు ఆ మేరకు భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచకపోతే లక్ష్యాలను చేరుకోవడం ఎలాగంటూ.. ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు.
ఈ ఏడాది లక్ష్యం రూ. 4,291 కోట్లు
రిజిస్ట్రేషన్ శాఖకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.4,291 కోట్ల రెవెన్యూ వసూలు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, వివిధ కారణాలతో నాలుగేళ్లుగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేక ఆ శాఖ ప్రతియేటా చతికిల పడుతోంది. ప్రతియేటా అంతకుముందు సంవత్సరం కంటే ఎంతోకొంత ఆదాయం పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది రూ.3,700 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,100 కోట్ల(83.78 శాతం) రెవెన్యూ రాబట్టిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు..అంతకుముందు ఏడాది ఆదాయం కన్నా 22.59 శాతం పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచిన పక్షంలో మరో రూ.400 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని, గతేడాది మాదిరిగా వార్షికాదాయంలో 23 శాతం పెరుగుదల కనిపించిన పక్షంలో మరో రూ.713 కోట్లు రావచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. మొత్తంగా రూ. 1,113 కోట్ల ఆదాయం అదనంగా లభించినట్లయితే ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావించారు. అయితే..రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సమర్పించిన ధరల పెంపు ప్రతిపాదనను సర్కారు తాజాగా తోసిపుచ్చడంతో ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడమెలాగని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.