![HYD: Two Persons With Fake Documents Registered A Place Worth Crores Of Rupees - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/26/HYD.jpg.webp?itok=9p0STDzK)
సాక్షి, శంషాబాద్: నకిలీ పత్రాలతో ఇద్దరు వ్యక్తులు కోటిన్నర విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎంఓ పేరిట పలుమార్లు ఫోన్ చేసి రిజిస్టార్‌ను బురిడీ కొట్టించారు. జరిగిన తప్పు తెలుసుకున్న రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయంలో భూములు కోల్పోయిన బాధితులకు శంషాబాద్ పట్టణంలో ఎయిర్‌పోర్టు కాలనీలో సర్వే నంబర్ 626/1లో ప్లాట్లను 2003లో కేటాయించారు. వీటికి అప్పట్లో పట్టా సర్టిఫికెట్లను మాత్రమే జారీచేశారు. అయితే, ఇప్పటికీ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై కన్నేసిన మోసగాళ్లు పెద్ద కుట్రకు తెరలేపారు.
ఈ సంవత్సరం జనవరి నెలలో కుమ్మరి అమృత అనే మహిళ ఎయిర్‌పోర్టు కాలనీలో ప్రభుత్వం తనకు కేటాయించిన 360 గజాల ప్లాటును మొకరాల శ్రీనివాస్‌శాస్త్రికి విక్రయించేందుకు శంషాబాద్ సబ్‌రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లింది. ఆమె పేరిట ఉన్న పట్టాపై అనుమానం వ్యక్తం చేసిన శంషాబాద్ సబ్ రిజిస్టార్ సిద్ధిఖీ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారు. దీంతో అక్రమార్కులు నకిలీ పత్రాన్ని సృష్టించారు. ప్రస్తుత రాజేంద్రనగర్ ఆర్‌డీఓ చంద్రకళ జనవరి 19న కుమ్మరి అమృత సరైన లబ్దిదారు అంటూ నకిలీ పత్రాన్ని తయారు చేసి సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) నుంచి అంటూ రిజిస్టార్‌కు పలుమార్లు ఫోన్లు కూడా చేయించారు.
దీంతో సబ్‌రిజిస్టార్ వీటిపై పూర్తిగా విచారణ చేయకుండానే ఈ నెల 15న కుమ్మరి అమృత నుంచి శ్రీనివాస్‌శాస్త్రికి 360 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేశారు. కాగా కుమ్మరి అమృత పాత్రను కూడా కొనుగోలుదారులే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.
అది బర్త్ సర్టిఫికెట్..
మోసగాళ్లు ఆర్డీఓ పేరిట తయారు చేసిన పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించగా అది నకిలీదిగా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు జారీ చేసే పత్రాలపై ఎక్కడా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఎంబ్లం ఉండదని తేల్చిచెప్పారు. అంతేగాకుండా సదరు పత్రంలో వేసిన ఎస్‌డీసీఎల్‌ఈ(ఎల్‌ఏపీ) బి/691/2003 రికార్డుల పరిశీలనలో అప్పటి చేవెళ్ల ఆర్‌డీఓ పరిధిలో ఉన్న బాలానగర్ నివాసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఆర్డీఓ జారీ చేసినట్లుగా ఇచ్చిన పత్రం పూర్తిగా నకిలీదిగా తేలింది. కొనుగోలుదారుడైన వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఈ తంతంగాన్ని నడిపించారు. మరికొన్ని ప్లాట్లు కూడా ఇదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు పథకాన్ని రచించారు.
కేసుల నమోదుకు సూచించాం..
విమానాశ్రయం భూ నిర్వాసితులకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం నుంచి అధికారులెవరూ లేఖలను ఇటీవల జారీ చేయలేదు. సదరు వ్యక్తులు సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో ఇచ్చిన లేఖ నకిలీది. అధికారికంగా మేము జారీచేస్తున్న వాటిలో ఎక్కడ కూడా తెలంగాణ రాజముద్ర ఉండదు. లేఖలో వారిచ్చిన నంబరుపై ఇక్కడ మేము బర్త్ సరి్టఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాల్సిందిగా సబ్‌రిజిస్టార్‌కు సూచించాం.
– చంద్రకళ, రాజేంద్రనగర్ ఆర్డీఓ
నకిలీ డాక్యుమెంట్‌గా తేలింది
తొలుత మేము పట్టా సర్టిఫికెట్‌తో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో పలుమార్లు సీఎంఓ నుంచి అంటూ ఫోన్లు చేయించారు. అంతేగాకుండా ఆర్డీఓ జారీ చేసినట్లు లబ్దిదారులు లేఖను అందజేయడంతో సరైనదేనని భావించి రిజిస్ట్రేషన్ చేశాం. అనంతరం పరిశీలనలో అది నకిలీ డాక్యుమెంట్‌గా తేలింది. కొనుగోలుదారుడే వాటిని మాకు సమర్పించాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నకిలీ సర్టిఫికెట్‌లు అందజేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.
– సిద్ధిఖీ, సబ్ రిజిస్టార్, శంషాబాద్
చదవండి: ఏ బస్సు ఎప్పుడొస్తుందో..?
Comments
Please login to add a commentAdd a comment