
కోలుకోని రిజిస్ట్రేషన్లు!
జనవరిలో 25 శాతం పడిపోయిన ఆదాయం
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు దెబ్బ నుంచి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఇంకా కోలుకోలేదు. కేంద్రం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి మూడు నెలలైనా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఇంకా మెరుగుపడలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు, అమ్మకాల జోరు తగ్గడంతో ఈ జనవరిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాది జనవరి కంటే భారీగా తగ్గింది. గతేడాది జనవరిలో రూ.232.53 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు సమకూరగా, ఈ ఏడాది కేవలం రూ.175.04 కోట్ల ఆదాయమే వచ్చింది.
ఆదాయంలో పెరుగుదల శాతం –24.72గా నమోదు కావడం గమనార్హం. పాతనోట్ల మార్పిడితో వినియోగదారుల సొమ్మంతా బ్యాంకుల్లోనే ఉండిపోవడం, ఆస్తుల అమ ్మకం ద్వారా వచ్చిన సొమ్ముపై క్యాపిటల్ గెయిన్స్ కింద అమ్మకందారు భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి రావడం కూడా క్రయవిక్రయాల తిరోగమనానికి కారణాలు గా కనిపిస్తున్నాయి. క్యాపిటల్ గెయిన్స్‌పై 30 శాతం దాకా పన్ను ఉండడంతో కొనుగోళ్లు, అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది.
గత సెప్టెంబర్ వరకు 32 శాతం పెరుగదలతో దూసుకెళ్లిన రిజిస్ట్రేషన్ల ఆదా యం తాజాగా జనవరిలో 24 శాతం తగ్గడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెలన్నర రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు నిర్ధేశించిన ఈ ఏడాది వార్షిక లక్ష్యం రూ.4,292 కోట్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు.
భయమే కారణమా..!
ఏ వ్యక్తి పేరిటనైనా ఒకటి కన్నా ఎక్కువ ఫ్లాట్‌లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లయితే వాటిని విక్రయించేప్పుడు తప్పనిసరిగా క్యాపిటల్ గెయిన్స్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అమ్మకందారులు బెంబే లెత్తుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకున్న రెండు ఫ్లాట్లలో ఒకదాన్ని రూ.కోటికి అమ్మినట్లయితే, తొలి మూడేళ్ల లోనైతే అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో 30 శాతం అంటే దాదాపు రూ.30 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత అయినట్లయితే 20 శాతం అంటే రూ.20లక్షలు ఆదాయపుపన్నుగా చెల్లించాలి. అయితే, కేంద్రం ఇటీవల క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను విధానాన్ని సడలించిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి కాసింత సాంత్వన లభించనుంది.
30 శాతం పన్ను స్లాబ్‌ను మూడేళ్ల నుంచి రెండేళ్లకు కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం మూడేళ్లుగా సవరించకపోవడంతో బహిరంగ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో భూమి ధర చదరపు గజం రూ.3 వేలు ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ రూ.వెయ్యికి మించి లేదు. దీంతో బహిరంగ మార్కెట్ ధర మేరకు సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో చెల్లించే దానికంటే చాలా ఎక్కువ అవుతుం డడం కూడా కొనుగోలుదారులు మొగ్గు చూపకపోవడానికి కారణంగా తెలుస్తోంది.