సాక్షి, హైదరాబాద్: రూ. 2.23 లక్షల కోట్లు.. అక్షరాలా రెండు లక్షల ఇరవైమూడు వేల కోట్లు.. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నమోదైన రిజిస్ట్రేషన్ లావాదేవీల విలువ ఇది.. వీటితో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.13,380 కోట్లు. రాష్ట్ర విభజన జరిగితే రియల్ బూమ్ తగ్గిపోతుందన్న అంచనాలను పటాపంచలు చేస్తూ... తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతూనే ఉంది. విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2,531.05 కోట్లుకాగా.. 2017–18 నాటికి 67% పెరిగిపోయి.. రూ.4,222 కోట్లకు చేరింది. ప్రభుత్వం స్థిరాస్తుల మార్కెట్ విలువను పెంచకపోయినా కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బూమ్‌తోపాటు శాఖాపరంగా చేపట్టిన సాంకేతిక సంస్కరణలు, పెద్ద నోట్ల రద్దు, బ్యాంకుల ఇబ్బందుల కారణంగా జనం భూములు, స్థలాల కొనుగోలు వైపు చూడటం వంటివి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
తొలి ఏడాదిలో మందకొడిగా..
రాష్ట్ర విభజనకు ముందు రెండేళ్లు, తర్వాతి రెండేళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,589.62 కోట్లుగా నమోదైంది. అయితే విభజన సమయంలో అనిశ్చితి కారణంగా.. విభజన జరిగిన ఏడాది ఆదాయం కొంత తగ్గింది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాది కన్నా రూ.57 కోట్లు తక్కువ ఆదాయం వచ్చింది. ముఖ్యంగా విభజన జరిగిన 2014 జూన్‌లో అత్యల్పంగా రూ.180 కోట్లే వచ్చాయి. దాంతో రాష్ట్రం విడిపోతే రియల్ బూమ్ తగ్గిపోతుందన్న అపోహలు, ఆదాయం తగ్గిపోతుందన్న అంచనాలు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల్లనూ వ్యక్తమయ్యాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుని.. ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా రూ.453 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం సమకూర్చే స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇదే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. 2014–15 మొదలు 2017–18 వరకు ఏటా రిజిస్ట్రేషన్ లావాదేవీలు, ఆదాయం పెరుగుతూనే వచ్చాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014–15తో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం ఏకంగా 67 శాతం పెరిగి రూ.4,222 కోట్లకు చేరింది.
సర్వర్లు, నెట్‌వర్క్ మెరుగుపర్చుకోవడంతోనూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు.. రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు చేయడంతో ఆదాయంలో గణనీయంగా వృద్ధి కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌తో కలసి ఉన్న నెట్‌వర్క్ నుంచి విడిపోయి తెలంగాణకు స్వతంత్ర నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం, సర్వర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం సత్ఫలితాలనిచ్చింది. సర్వర్ అప్‌గ్రెడేషన్‌కు ముందు నెలకు నాలుగైదు రోజులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు సంబంధించి సాంకేతిక అవాంతరాలు ఎదురయ్యేవి. సర్వర్‌ను ఆధునీకరించాక వేగంగా లావాదేవీలు జరగడం, సాంకేతిక సమస్యలు ఎదురవకపోవడంతో.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. దీంతో గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. 2016 డిసెంబర్‌లో రూ.223 కోట్ల ఆదాయం వస్తే.. 2017 డిసెంబర్‌లో 79.03 శాతం ఎక్కువగా 400.46 కోట్లు ఆదాయం వచ్చింది. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే.. 2018 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా 109.60 శాతం, 105.22 శాతం ఆదాయం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
నోట్ల రద్దుతో భూముల వైపు..!
పెద్ద నోట్ల రద్దు అనంతరం జనం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి భయపడుతున్నారు. ఐటీ అధికారులు వివరణ కోరుతారని.. నోటీసులు, విచారణల వంటి తలనొప్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకుల్లో కుంభకోణాలు పెరిగిపోవటం కూడ ఆందోళనకరంగా మారింది. దీంతో బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయడానికి బదులుగా.. స్థలాలు, భూముల కొనుగోలుపై దృష్టిసారిస్తున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దు తరువాతి నుంచి.. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. ఇక కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా చోట్ల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. దీంతో జిల్లాల్లోనూ రియల్‌ఎస్టేట్‌పై పెట్టుబడులు భారీగా పెరిగాయి.
రియల్ బూమ్.. జూమ్.!
Published Fri, Apr 13 2018 1:53 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment