నోట్ల రద్దు పరిణామాలతో బ్యాంకులంటే భయం బ్యాంకుల్లో కుంభకోణాలు,రుణ ఎగవేతలు, ఐటీ నిబంధనలూ కారణమే! ఖాతాల్లో డిపాజిట్లు కొనసాగించేందుకు జంకుతున్న జనం ఆ సొమ్మంతా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకే.. భారీగా ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ల శాఖకు ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.513 కోట్ల ఆదాయం ఈ లావాదేవీల రిజిస్ట్రేషన్ విలువ రూ.8,500 కోట్లు..మార్కెట్ ధరల ప్రకారం చూస్తే రూ.30–35 వేల కోట్ల పైమాటే!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యాంకుల్లో డబ్బుంటే జేబులో ఉన్నట్టే.. నాలుగు రాళ్లు వెనకేసుకుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవసరానికి పనికొస్తుంది..’..ఇది పాత మాట.
‘బ్యాంకుల్లో డబ్బులు పెట్టి కష్టాలు తెచ్చుకునేకన్నా.. ఆ డబ్బుతో ఎక్కడైనా ఓ ఇల్లు లేదా కొంత స్థలమో కొనుక్కుందాం.. డబ్బులకూ భద్రత.. ధర పెరిగితే మరింత డబ్బూ వస్తుంది..’..ఇది ఇప్పటిమాట. ..
కొద్దినెలలుగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు జమ చేయడం బాగా తగ్గించేశారు. వీలైతే ఉన్న డిపాజిట్లనూ వెనక్కి తీసేసుకుంటున్నారు. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడులవైపు మళ్లిస్తున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలు, బ్యాంకుల్లో కుంభకోణాలు, ఆదాయ పన్ను శాఖ నిబంధనలు, రియల్ ఎస్టేట్‌లో పెడితే సొమ్ము వేగంగా పెరుగుతుందన్న ఆశలు వంటివన్నీ దీనికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయం ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతోంది. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ఏప్రిల్ ఒక్క నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్లకు పైగా స్థిరాస్తిలావాదేవీలు జరిగాయి. బహిరంగ మార్కెట్ ధరల లెక్కన చూస్తే ఈ లావాదేవీల విలువ ఏకంగా రూ. 35 వేల కోట్లకుపైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒక్క నెలలో రూ.513 కోట్ల ఆదాయం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అ«ధికారిక గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా రూ.513 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీకి సంబంధించి మార్కెట్ ధరలో 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మార్టిగేజ్‌లు, గిఫ్ట్‌డీడ్‌లు, లీజు ఒప్పందాలకు కొంచెం తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఇవి మొత్తం లావాదేవీల్లో 10 శాతానికి మించవు. అంటే ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన రూ.513 కోట్ల ఆదాయాన్ని బట్టి లెక్కిస్తే... ఆయా రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ.8,500 కోట్లు. ఇది కేవలం రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే. సాధారణంగా> చాలా చోట్ల రిజిస్ట్రేషన్ విలువతో పోలిస్తే.. మార్కెట్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన ఏప్రిల్ నెలలో స్థిరాస్తి లావాదేవీల విలువ కనీసం రూ.30 వేల కోట్ల నుంచి రూ. 35 వేల కోట్ల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బ్యాంకుల్లో డబ్బులన్నీ ఖాళీ!
కొద్ది నెలలుగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గిపోయాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. అంటే బ్యాంకుల్లోకి డిపాజిట్లుగా వెళ్లే సొమ్మంతా రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతోందని స్పష్టమవుతోందని.. స్థిరాస్తి లావాదేవీల లెక్కలే దీనికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలో 1,26,655 స్థిరాస్తి లావాదేవీలు జరిగాయని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ లావాదేవీల్లో మొత్తంగా నగదు మాత్రమే చేతులు మారే అవకాశం లేదు. బ్యాంకుల్లో ఉన్న సొమ్మును బదలాయించడం ద్వారానే లావాదేవీల చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే స్థిరాస్తిని విక్రయించినవారు ఇలా తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన సొమ్మును.. బ్యాంకుల్లో నిల్వ ఉంచడం లేదు. వాటిని విత్‌డ్రా చేయడం ద్వారాగానీ, ఇతర విక్రేతకు బదలాయించడం ద్వారాగానీ వెంటనే మరో స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎక్కువ శాతం ఓపెన్ ప్లాట్లకే మొగ్గు
ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అంచనా ప్రకారం.. స్థిరాస్తి లావాదేవీలు చేస్తున్నవారిలో 75 శాతం మంది ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారు. అంటే మొత్తం రూ. 30–35 వేల కోట్ల వ్యాపారంలో దాదాపు రూ. 25 వేల కోట్ల సొమ్ము ఈ లావాదేవీల ద్వారానే చేతులు మారుతోంది. మరో 15 శాతం మంది అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, డూప్లెక్స్‌లు కొనుగోలు చేస్తుండగా.. ఇంకో 10 శాతం మంది ఇళ్లు, వాణిజ్య సముదాయాల కొనుగోళ్లకు డబ్బు వెచ్చిస్తున్నారు. వీటిలో మరో రూ. 5–10 వేల కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తంగా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం కన్నా.. ఏదో ఒక రకంగా రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడదామనే భావన పెరిగిపోతోంది.
బ్యాంకులంటే భయమెందుకు?
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. డబ్బును బ్యాంకుల్లో జమ చేసుకుందామనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, అనంతరం తీవ్రంగా నగదు కొరత ఏర్పడడం, అవసరానికి సొమ్ము తీసుకోలేకపోవడమే దీనికి కారణం. బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేస్తే.. అవసరానికి తీసుకునే వీలు ఉంటుందో లేదోనన్న సందేహంతో చాలా మంది ప్రజలు తమ వద్దే నగదును భద్రపరుచుకుంటూ వస్తున్నారు. అవసరమైతే తప్ప బ్యాంకు లావాదేవీల వైపు మొగ్గు చూపడం లేదు. దీనికితోడు బ్యాంకుల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు, పలువురు పారిశ్రామికవేత్తలు కూడా బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొడుతుండటం వంటివాటితోనూ తమ డబ్బు భద్రతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయ పన్ను నిబంధనల కారణంగానూ..
మరోవైపు బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించి డబ్బులు జమ చేయడానికి, అంతకు మించి లావాదేవీలు జరపడానికి జనం వెనుకంజ వేస్తున్నారు. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, లావాదేవీలపై కేంద్రం కన్నేసి ఉంటుందని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని విచారిస్తుందనే ప్రచారం కూడా ప్రజలను బ్యాంకులకు దూరం చేస్తోంది. బ్యాంకుల్లో జమ చేస్తే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ఎక్కడ నోటీసులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment