తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు. (వృత్తంలో) గణేశ్వరరావు
సాక్షి,అమరావతి/పెదవాల్తేరు/కురుపాం/చోడవరం/వీరవాసరం: సస్పెన్షన్‌లో ఉన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వరరావు ఆస్తులపై శనివారం ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. గణేశ్వరరావు ఇంటితో పాటు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోను ఈ సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
విశాఖ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లక్ష్మీగణేశ్వరరావుపై ఆనేక ఆరోపణలు రావడంతో ఇటీవల విధుల నుంచి తప్పించారు. విశాఖలోని సీతంపేటలో గణేశ్వరరావు తన బంధువు పేరిట 5 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.70 లక్షల విలువైన వోల్వో కారుతో పాటు హోండా 120, ఇన్నోవా కార్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 3.2కిలోల వెండి సామగ్రి, కిలో బంగారు ఆభరణాలు, వివిధ స్థిరాస్తి పత్రాలు, పెద్ద సంఖ్యలో బ్యాంకు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో పాటు రూ. 25 వేల విలువగల రద్దయిన రూ. 500, రూ.1,000 నోట్లు, రూ.10 లక్షల విలువైన ఇంటి సామగ్రి, రూ.10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంట్లో రూ.34 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. గణేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ తెలిపారు.
బహిరంగ మార్కెట్లో రూ.500కోట్ల విలువైన ఆస్తులు
మాజీ సర్వేయర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలు కీలక ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, ఐదు ఫ్లాట్లు, 30.36 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆయనతో పాటు ఆయన భార్య సరిత, కుమారులు విజయశేఖర్, రాజశేఖర్, బినామీగా ఉన్న గుడాల సత్యనారాయణ తదితరుల పేరుతో ఉన్న ఆస్తుల మార్కెట్ విలువ పెద్దమొత్తంలో ఉండటంతో ఏసీబీ అధికారులు సైతం కంగుతిన్నారు.
సోదాలకొస్తే.. శునకాలను వదిలారు
విశాఖపట్నంలో దాడులకు వెళ్లిన ఏసీబీ అధికారులకు వింత అనుభవం ఎదురయింది. విశాఖలోని రామాటాకీస్ పక్కన శ్రీనగర్‌లోని సువర్ణ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోని గణేశ్వరరావు ఇంటికి ఉదయం 8.30 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో సీఐ సుదర్శనరెడ్డి, ఇతర అధికారులు వెళ్లారు. తలుపులు తీసిన గణేశ్వరరావు ఏసీబీ అధికారులను చూసి వెంటనే మూసేశారు. ఏసీబీ నుంచి వచ్చామని తలుపులు తీయాలని కోరాక.. ఎట్టకేలకు తలుపులు తెరిచారు. అధికారులు ఇంట్లోకి ప్రవేశించగానే గణేశ్వరరావు కుమారుడు రాజశేఖర్ అధికారులు, మీడియా ప్రతినిధులపైకి రెండు పెంపుడు శునకాలను ఉసికొల్పాడు. దీంతో అధికారులు కంగారు పడ్డారు. డీఎస్పీ రమాదేవి.. గణేశ్వరరావుకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ద్వారక సీఐ రాంబాబు ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్ వద్ద ఏసీబీ అధికారులకు రక్షణ కల్పించారు. ఏసీబీ దాడుల సందర్భంగా అధికారులపైకి ఇలా కుక్కలను ఉసికొల్పడం ఇదే తొలిసారని అంటున్నారు. సోదాలు జరిగిన సమయంలో గణేశ్వరరావు, అతని భార్య, ఇద్దరు కుమారులు ఫ్లాట్‌లో ఉన్నారు.
టీడీపీ నేతలకు లింకులు
విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని వలసబల్లేరు గ్రామ సర్పంచ్ ఆరిక విప్లవ్‌కుమార్ (బాలరాజు).. గణేశ్వర రావుకు బినామీగా సిట్ అధికారులు గుర్తించడంతో అతని ఇంట్లో కూడా ఏసీబీ సీఐ లక్మోజీ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఆయన పేరిట ఉన్న బ్యాంకు ఖాతా లు, లావాదేవీలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను తనిఖీ చేశారు. చోడవరం తెలుగుదేశం పార్టీ నేత, స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన మాజీ ఎంపీపీ గూనూరు వెంకట సత్యనారాయణ (పెదబాబు) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల విశాఖపట్నం కొమ్మాదిలో పెద బాబు, ఆయన భార్య పేరున 50 ఎకరాల భూమి క్రయవిక్రయాలపై సిట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గణేశ్వరరావు ఈ క్రయవిక్రయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. భూములు, ఆస్తులకు చెందిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన గుడాల శ్రీనివాస్, కాయల నానిబాబు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. గణేశ్వరరావు బంధువులైన వారిద్దరి ఇళ్లలో రాజమహేంద్రవరం, ఏలూరుకు చెందిన ఏసీబీ బృందాలు సోదాచేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment