సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై నమోదైన కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నారా లోకేశ్‌కు నోటీసులు అందించాలని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మంగళవారం కోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించడం కలకలం రేపింది.
‘ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోవడం లేదు’
కాగా.. ఈ కేసులకు సంబంధించి గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది.
కాగా.. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు లోకేశ్ అందుబాటులోకి రాలేదు. రెండుసార్లు ఆయన నివాసానికి వెళ్లినా అధికారులను కలిసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు.
నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఈ విషయాన్ని సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. లోకేశ్ ఉద్దేశపూర్వకంగానే నోటీసులను తీసుకోవడం లేదని వివరించారు. ఈ అంశంపై తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం లోకేశ్‌కు స్వయంగా నోటీసులు అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment