Visakhapatnam land scam
-
విశాఖ భూ కుంభకోణంపై ‘సిట్’ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గడువును ప్రభుత్వం వచ్చే నెల 28 వరకూ పొడిగించింది. జిల్లాలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, రికార్డులు మాయం చేశారంటూ వచ్చిన అభియోగాలపై లోతైన దర్యాప్తు నిమిత్తం 2019 నవంబర్ 17న ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది ఫిబ్రవరి 12న సిట్ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. కరోనా, లాక్డౌన్ కారణంగా తమ బృందం గతేడాది మార్చి 15వ తేదీ వరకే పని చేసిందని, అనంతరం గతేడాది జూన్ 10 నుంచే పని ప్రారంభించిందని సిట్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదించారు. మిగిలిన రికార్డులను పరిశీలించి, నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సిట్ చైర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిట్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. -
సిట్ నివేదిక: టీడీపీ ముఖ్య నేతల్లో గుబులు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముగిసింది. టీడీపీ హయాంలో రికార్డుల తారుమారు, ఎన్వోసీ జారీ, నిషేధిత భూముల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో సిట్ నివేదిక సిద్ధమయ్యింది. సిట్ నివేదిక ఏం తేలుస్తుందోనని టీడీపీ ముఖ్య నేతల్లో గుబులు పట్టుకుంది. సిట్ కార్యాలయానికి కేటాయించిన 19 మంది రెవెన్యూ సిబ్బందిని చైర్మన్ వెనక్కి పంపించారు. వచ్చే వారంలో చివరిరోజు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సిట్ చైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, అన్ని విషయాలు నివేదికలో స్పష్టంగా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు. (చదవండి: ‘ఇల్లు కదలరు.. బయటకు రారు..’) -
‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. అధికారమే పరమావధిగా గంటా పనిచేస్తారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు గంటా పార్టీ మారుదామని అనుకుంటే సిట్ దర్యాప్తులో ఆయన పేరు ఉందని చంద్రబాబు బెదిరించారట. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వంటివారు విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన అపరాధి గంటా శ్రీనివాసరావే అని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లు, మచ్చ లేనోళ్లు ఎవరైనా బీజేపీ లోకి రావచ్చు. గంటా శ్రీనివాసరావు ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులను కలుస్తున్నారు. అధికారమే పరమావధిగా ఆయన పని చేస్తున్నారు. అధికారం మాత్రమే కావాలా? సిద్ధాంతాలు వద్దా? వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీలు మారితే ప్రజలు క్షమించరు. అమిత్ షా, సీఎం జగన్ మధ్య జరిగిన సమావేశంలో ఏం జరిగిందో మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది’అని రఘురాం అన్నారు. -
విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభకోణంపై పూర్తి విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ సభ్యులుగా వైవీ అనురాధ, టి.భాస్కర్‌రావును నియమించింది. విశాఖ జిల్లాలో భూముల అక్రమాలపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. -
ఉత్తుత్తి ‘సిట్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం దర్యాప్తు పెద్ద ఫార్సుగా ముగిసింది. ప్రతిపక్షం సహా అన్ని వర్గాల నుంచి ఈ భూదందాపై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేయడం మొక్కుబడి తంతేనని తేలిపోయింది. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే తమ పునాదులు ఎక్కడ కదులుతాయనే భయంతో ‘సిట్’కు ఎలాంటి న్యాయపరమైన అధికారాలు ఇవ్వలేదని స్పష్టమైంది. తమకు పరిమితులు విధించారని ప్రత్యేక దర్యాప్తు బృందమే ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను రాష్ట్ర కేబినెట్లో ఓ మంత్రి దోచేశారని, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని కేబినెట్లోని మరో మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన పెద్దలు వేల ఎకరాలను కాజేశారన్న వార్తలు పతాక శీర్షికలెక్కాయి. ఈ నేపథ్యంలో డిప్యూటి ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా గత ఏడాది జూన్ 15న ప్రజా విచారణను చేపట్టారు. అయితే, ఇది కొనసాగితే తమతో పాటు కేబినెట్లో సదరు మంత్రి భూ దాహం, ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. ఇది 2017 జూన్ నుంచి జనవరి 2018 వరకు విచారణ చేపట్టి ఈ ఏడాది జనవరిలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ‘సిట్’కు న్యాయపరమైన ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ ప్రకారం ఏ ప్రాంతాన్నైనా తనిఖీలు చేసే అధికారంగానీ, రికార్డులను స్వాధీనం చేసుకోవడంగానీ.. ప్రైవేట్ వ్యక్తులను విచారణకు పిలిచే అధికారాలు కానీ ఇవ్వలేదని.. కొన్ని పరిమితులను విధించారని ‘సిట్’ ఆ నివేదికలోనే స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే విశాఖ భూకుంభకోణంపై ‘సిట్’ విచారణ ఓ పెద్ద ఫార్సుగా మారిందని అధికార వర్గాలే పేర్కొన్నాయి. కేబినెట్ మంత్రిపై మరో కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలను వదిలేసి, ‘ముఖ్య’నేత సూచనలతో గతంలోనే భూ కుంభకోణం జరిగిందనే రీతిలోను ‘సిట్’ నివేదికను రూపొందించింది. 2015లో 18 ఎంట్రీలు ట్యాంపరింగ్ 2015లోనే విశాఖ రూరల్ పరిధిలోని ప్రభుత్వ రికార్డుల్లో 18 ఎంట్రీలు టాంపరింగ్ అయినట్లు గుర్తించినప్పటికీ 2017 వరకు జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలను తీసుకోలేదని ‘సిట్’ తన నివేదికలో పేర్కొంది. అలాగే, 1995, 2005, 2007, 2013, 2015 సంవత్సరాల్లో ప్రభుత్వ రికార్డులు టాంపరింగ్ జరిగినట్లు ‘సిట్’ దర్యాప్తుల్లో తేలినట్లు పేర్కొన్నారు. అయితే, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అందులో ప్రస్తావించారు. ప్రైవేట్ భూమి టైటిల్ నుంచి 1బి రిజిస్టర్లోను, వెబ్ ల్యాండ్లోను ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద మార్చేసినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. అయితే, ఇలా ఎవరు చేశారనే దానికి ఆధారాల్లేవని తెలిపింది. అలాగే, ప్రభుత్వ భూముల టైటిల్‌ను ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకు మార్చేశారని, అలాంటి వారిపై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ‘సిట్’ సిఫార్సు చేసింది. ఐఏఎస్‌లు, కలెక్టర్లు, జేసీల పాత్రపై అనుమానాలు ఇదిలా ఉంటే.. ఈ భూబాగోతం వ్యవహారంలో పలువురు ఐఏఎస్‌లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని ‘సిట్’ పేర్కొంది. భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు సంబంధించి మొత్తం 2,875 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో ప్రజల నుంచి వచ్చినవి 333. 113 అంశాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన 11 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాగా.. మిగతా 2,531 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాలేదని, వీటిని జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను విక్రయించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీచేసిన 68 కేసులను కూడా ‘సిట్’ గుర్తించింది. ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వోద్యోగుల దాసోహం విశాఖ జిల్లాల్లోని 40 మండలాలకు చెందిన 1,494 కేసులు రెండు ప్రైవేట్ పార్టీల మధ్య భూ వివాదాలకు సంబంధించినవని, వీటిలోని 763 కేసుల్లో పరిపాలనపరమైన వైఫల్యాలున్నాయని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పక్కదారి పట్టించి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించారని, 618 కేసులు ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉందని గుర్తించినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. చాలా కేసుల్లో రికార్డులు లభ్యం కాకపోవడం, అధికారులు బదిలీ కావడం, రికార్డులను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు తరలింపులో ఆ రికార్డులు మాయం కావడం, లింక్‌లు మిస్ కావడంతో ‘సిట్’ ఏమీ చేయలేకపోయిందని నివేదికలో వివరించారు. 1,225.92 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 4,318 చదరపు మీటర్లు, 7,136 చదరపు అడుగుల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని.. 751.19 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని, అలాగే.. 109 కేసుల్లో పట్టాదారు పుస్తకాల్లో అక్రమాలు జరిగాయని ‘సిట్’ స్పష్టం చేసింది. ఇవీ ‘సిట్’ సిఫార్సులు.. – భూ ఆక్రమణలు, అక్రమాలకు సంబంధించి విశాఖ జిల్లాలో గతంలో పనిచేసిన ముగ్గురు జిల్లా కలెక్టర్లు, అలాగే.. గతంలో పనిచేసిన నలుగురు జిల్లా జాయింట్ కలెక్టర్లు, ముగ్గురు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు, పది మంది ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్, పలువురు తహసీల్దార్లపైన, అలాగే ఓ మాజీ మంత్రితో పాటు అతని నలుగురు అనుచరులపైన క్రిమినల్, క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలి. – 50 కేసులకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 49 కేసులకు సంబంధించిన ప్రభుత్వ అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 134 కేసులకు సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. – 20 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – వెబ్‌ల్యాండ్‌లో 34 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిగా ఉంటే రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లుగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 29 కేసులకు చెందిన రిజిస్ట్రేషన్ డీడ్స్‌ను రద్దు చేయాలి. – గతంలో మూసివేసిన క్రిమినల్ కేసులను పునరుద్ధరించాలి. – విశాఖ జిల్లాలో రెవెన్యూ, సర్వే రికార్డులు మాయమైన తరహాలోనే ఇతర జిల్లాల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉండి ఉంటాయని.. వీటిని సరిచేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
500 కోట్లకు ‘సర్వే’ చేశాడు
సాక్షి,అమరావతి/పెదవాల్తేరు/కురుపాం/చోడవరం/వీరవాసరం: సస్పెన్షన్‌లో ఉన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వరరావు ఆస్తులపై శనివారం ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. గణేశ్వరరావు ఇంటితో పాటు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోను ఈ సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. విశాఖ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లక్ష్మీగణేశ్వరరావుపై ఆనేక ఆరోపణలు రావడంతో ఇటీవల విధుల నుంచి తప్పించారు. విశాఖలోని సీతంపేటలో గణేశ్వరరావు తన బంధువు పేరిట 5 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.70 లక్షల విలువైన వోల్వో కారుతో పాటు హోండా 120, ఇన్నోవా కార్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 3.2కిలోల వెండి సామగ్రి, కిలో బంగారు ఆభరణాలు, వివిధ స్థిరాస్తి పత్రాలు, పెద్ద సంఖ్యలో బ్యాంకు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో పాటు రూ. 25 వేల విలువగల రద్దయిన రూ. 500, రూ.1,000 నోట్లు, రూ.10 లక్షల విలువైన ఇంటి సామగ్రి, రూ.10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంట్లో రూ.34 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. గణేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.500కోట్ల విలువైన ఆస్తులు మాజీ సర్వేయర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలు కీలక ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, ఐదు ఫ్లాట్లు, 30.36 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆయనతో పాటు ఆయన భార్య సరిత, కుమారులు విజయశేఖర్, రాజశేఖర్, బినామీగా ఉన్న గుడాల సత్యనారాయణ తదితరుల పేరుతో ఉన్న ఆస్తుల మార్కెట్ విలువ పెద్దమొత్తంలో ఉండటంతో ఏసీబీ అధికారులు సైతం కంగుతిన్నారు. సోదాలకొస్తే.. శునకాలను వదిలారు విశాఖపట్నంలో దాడులకు వెళ్లిన ఏసీబీ అధికారులకు వింత అనుభవం ఎదురయింది. విశాఖలోని రామాటాకీస్ పక్కన శ్రీనగర్‌లోని సువర్ణ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని గణేశ్వరరావు ఇంటికి ఉదయం 8.30 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో సీఐ సుదర్శనరెడ్డి, ఇతర అధికారులు వెళ్లారు. తలుపులు తీసిన గణేశ్వరరావు ఏసీబీ అధికారులను చూసి వెంటనే మూసేశారు. ఏసీబీ నుంచి వచ్చామని తలుపులు తీయాలని కోరాక.. ఎట్టకేలకు తలుపులు తెరిచారు. అధికారులు ఇంట్లోకి ప్రవేశించగానే గణేశ్వరరావు కుమారుడు రాజశేఖర్ అధికారులు, మీడియా ప్రతినిధులపైకి రెండు పెంపుడు శునకాలను ఉసికొల్పాడు. దీంతో అధికారులు కంగారు పడ్డారు. డీఎస్పీ రమాదేవి.. గణేశ్వరరావుకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ద్వారక సీఐ రాంబాబు ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వద్ద ఏసీబీ అధికారులకు రక్షణ కల్పించారు. ఏసీబీ దాడుల సందర్భంగా అధికారులపైకి ఇలా కుక్కలను ఉసికొల్పడం ఇదే తొలిసారని అంటున్నారు. సోదాలు జరిగిన సమయంలో గణేశ్వరరావు, అతని భార్య, ఇద్దరు కుమారులు ఫ్లాట్‌లో ఉన్నారు. టీడీపీ నేతలకు లింకులు విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని వలసబల్లేరు గ్రామ సర్పంచ్ ఆరిక విప్లవ్‌కుమార్ (బాలరాజు).. గణేశ్వర రావుకు బినామీగా సిట్ అధికారులు గుర్తించడంతో అతని ఇంట్లో కూడా ఏసీబీ సీఐ లక్మోజీ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఆయన పేరిట ఉన్న బ్యాంకు ఖాతా లు, లావాదేవీలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను తనిఖీ చేశారు. చోడవరం తెలుగుదేశం పార్టీ నేత, స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన మాజీ ఎంపీపీ గూనూరు వెంకట సత్యనారాయణ (పెదబాబు) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల విశాఖపట్నం కొమ్మాదిలో పెద బాబు, ఆయన భార్య పేరున 50 ఎకరాల భూమి క్రయవిక్రయాలపై సిట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గణేశ్వరరావు ఈ క్రయవిక్రయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. భూములు, ఆస్తులకు చెందిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన గుడాల శ్రీనివాస్, కాయల నానిబాబు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. గణేశ్వరరావు బంధువులైన వారిద్దరి ఇళ్లలో రాజమహేంద్రవరం, ఏలూరుకు చెందిన ఏసీబీ బృందాలు సోదాచేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. -
ఎంపీ హరి.. మౌనంతో సరి!
♦ విశాఖ భూకుంభకోణాలపై స్పందించని నేత ♦ నగర పరువు మంటగలుస్తున్నా సరే.. ♦ మిత్రపక్ష పెద్దల రక్షణకే ♦ కట్టుబడ్డారని ఆరోపణలు ♦ ప్రజాప్రతినిధిగా బాధితుల కష్టాలు పట్టించుకోలేదని విమర్శలు ♦ సహచర బీజేపీ నేత గర్జిస్తున్నా.. ♦ ఈయనది మాత్రం మౌనముద్రే ‘విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తున్నాం.. ఎన్నో ప్రాజెక్టులు తెస్తున్నాం.. అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులతో ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం’.. అని సందు దొరికినప్పుడల్లా సోది చెబుతుంటారు.. మన ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారైన హరిబాబు.. పనిలో పనిగా సీఎం చంద్రబాబును, టీడీపీ జిల్లా నేతలను కీర్తించడం ఎన్నడూ మరిచిపోలేదు.. మరి అదే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా పేరుతో ఫలహారం చేసేసిన భారీ కుంభకోణం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది.. బ్రాండ్ ఇమేజ్ సంగతేమోగానీ.. విశాఖ పరువును మంటగలిపేసినా.. స్థానిక ఎంపీగా హరిబాబు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని అంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : భూ రికార్డులను తారుమారు చేసి.. గల్లంతు చేసి.. దర్జాగా కబ్జాలపర్వం సాగించిన బడా భూ చోరుల ఆగడాల వల్ల విశాఖ పరువు జాతీయస్థాయిలో దెబ్బతింటోందని విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ పెద్దల భూదాహానికి విశాఖ బ్రాండ్ ఇమేజ్ కొట్టుకుపోతున్నా.. స్థానిక ఎంపీగా హరిబాబు మాత్రం నోరు మెదపడం లేదు. సహచర పార్టీ నేత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విశాఖ భూ దందాలపై సమయం దొరికినప్పుడల్లా గొంతెత్తుతున్నారు. అధికార టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. ఆధారాలతో సహా ముదపాక భూముల కుంభకోణంలో టీడీపీ నేతల పాత్రను బట్టబయలు చేశారు. విశాఖ రూరల్, భీమిలితో సహా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లోనే ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఓ పక్క ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో రూ.2,200 కోట్ల విలువైన భూములకు చెందిన 1బీ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురికాగా...లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఉద్యమ బాటలో విపక్షాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి జాతీయస్థాయి ఉద్యమానికి నడుం బిగించాయి. ఇప్పటికే ముదుపాకలో ఆక్రమణకు గురైన భూముల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ పార్టీకి చెందిన వారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనంటూ మంత్రి గంటా ఏకంగా అయ్యన్నపై సీఎంకే ఫిర్యాదు చేశారు. ఇలా రోజురోజుకు ఈ భూ కబ్జాల దుమారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. కుంభకోణాల్లో అత్యధిక శాతం తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే జరుగుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా హరిబాబు వీసమెత్తయినా స్పందించ లేదు. ఆయన తీరుపై విశాఖవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ పెద్దలున్నందున సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తుంటే జాతీయ స్థాయిలో పరపతి కలిగిన హరిబాబు మాత్రం ఆ దిశగా తానూ ప్రయత్నిస్తానన్న పాపాన పోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం కబ్జాకోరుల పాలై మానసిక క్షోభకు గురవుతున్నా పట్టించుకోని వ్యక్తినా.. ఎంపీనా తాము ఎంపీగా ఎన్నుకున్నది అని వారు ఆవేదన చెందుతున్నారు. ‘విశాఖకు అది చేశాం..ఇది చేశాం.. అని లేని గొప్పలు చెప్పుకోవడం కాకుండా తమ కష్టాలపై స్పందించరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భూ కుంభకోణంపై ఎంపీ హరిబాబు నోరు విప్పి బాధితులకు అండగా నిలుస్తానని భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిత్రపక్ష పెద్దలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మిన్నకుండిపోతే మాత్రం సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని భూ కబ్జాల బాధితులు హెచ్చరిస్తున్నారు.