విశాఖ భూ కుంభకోణంపై ఫార్సుగా ముగిసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం దర్యాప్తు పెద్ద ఫార్సుగా ముగిసింది. ప్రతిపక్షం సహా అన్ని వర్గాల నుంచి ఈ భూదందాపై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేయడం మొక్కుబడి తంతేనని తేలిపోయింది. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే తమ పునాదులు ఎక్కడ కదులుతాయనే భయంతో ‘సిట్’కు ఎలాంటి న్యాయపరమైన అధికారాలు ఇవ్వలేదని స్పష్టమైంది. తమకు పరిమితులు విధించారని ప్రత్యేక దర్యాప్తు బృందమే ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను రాష్ట్ర కేబినెట్‌లో ఓ మంత్రి దోచేశారని, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని కేబినెట్‌లోని మరో మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన పెద్దలు వేల ఎకరాలను కాజేశారన్న వార్తలు పతాక శీర్షికలెక్కాయి.
ఈ నేపథ్యంలో డిప్యూటి ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా గత ఏడాది జూన్ 15న ప్రజా విచారణను చేపట్టారు. అయితే, ఇది కొనసాగితే తమతో పాటు కేబినెట్‌లో సదరు మంత్రి భూ దాహం, ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. ఇది 2017 జూన్ నుంచి జనవరి 2018 వరకు విచారణ చేపట్టి ఈ ఏడాది జనవరిలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ‘సిట్’కు న్యాయపరమైన ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ ప్రకారం ఏ ప్రాంతాన్నైనా తనిఖీలు చేసే అధికారంగానీ, రికార్డులను స్వాధీనం చేసుకోవడంగానీ.. ప్రైవేట్ వ్యక్తులను విచారణకు పిలిచే అధికారాలు కానీ ఇవ్వలేదని.. కొన్ని పరిమితులను విధించారని ‘సిట్’ ఆ నివేదికలోనే స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే విశాఖ భూకుంభకోణంపై ‘సిట్’ విచారణ ఓ పెద్ద ఫార్సుగా మారిందని అధికార వర్గాలే పేర్కొన్నాయి. కేబినెట్ మంత్రిపై మరో కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలను వదిలేసి, ‘ముఖ్య’నేత సూచనలతో గతంలోనే భూ కుంభకోణం జరిగిందనే రీతిలోను ‘సిట్’ నివేదికను రూపొందించింది.
2015లో 18 ఎంట్రీలు ట్యాంపరింగ్
2015లోనే విశాఖ రూరల్ పరిధిలోని ప్రభుత్వ రికార్డుల్లో 18 ఎంట్రీలు టాంపరింగ్ అయినట్లు గుర్తించినప్పటికీ 2017 వరకు జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలను తీసుకోలేదని ‘సిట్’ తన నివేదికలో పేర్కొంది. అలాగే, 1995, 2005, 2007, 2013, 2015 సంవత్సరాల్లో ప్రభుత్వ రికార్డులు టాంపరింగ్ జరిగినట్లు ‘సిట్’ దర్యాప్తుల్లో తేలినట్లు పేర్కొన్నారు. అయితే, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అందులో ప్రస్తావించారు. ప్రైవేట్ భూమి టైటిల్ నుంచి 1బి రిజిస్టర్‌లోను, వెబ్ ల్యాండ్‌లోను ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద మార్చేసినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. అయితే, ఇలా ఎవరు చేశారనే దానికి ఆధారాల్లేవని తెలిపింది. అలాగే, ప్రభుత్వ భూముల టైటిల్‌ను ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకు మార్చేశారని, అలాంటి వారిపై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ‘సిట్’ సిఫార్సు చేసింది.
ఐఏఎస్‌లు, కలెక్టర్లు, జేసీల పాత్రపై అనుమానాలు
ఇదిలా ఉంటే.. ఈ భూబాగోతం వ్యవహారంలో పలువురు ఐఏఎస్‌లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని ‘సిట్’ పేర్కొంది. భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు సంబంధించి మొత్తం 2,875 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో ప్రజల నుంచి వచ్చినవి 333. 113 అంశాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన 11 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాగా.. మిగతా 2,531 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాలేదని, వీటిని జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను విక్రయించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీచేసిన 68 కేసులను కూడా ‘సిట్’ గుర్తించింది.
ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వోద్యోగుల దాసోహం
విశాఖ జిల్లాల్లోని 40 మండలాలకు చెందిన 1,494 కేసులు రెండు ప్రైవేట్ పార్టీల మధ్య భూ వివాదాలకు సంబంధించినవని, వీటిలోని 763 కేసుల్లో పరిపాలనపరమైన వైఫల్యాలున్నాయని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పక్కదారి పట్టించి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించారని, 618 కేసులు ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉందని గుర్తించినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. చాలా కేసుల్లో రికార్డులు లభ్యం కాకపోవడం, అధికారులు బదిలీ కావడం, రికార్డులను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు తరలింపులో ఆ రికార్డులు మాయం కావడం, లింక్‌లు మిస్ కావడంతో ‘సిట్’ ఏమీ చేయలేకపోయిందని నివేదికలో వివరించారు. 1,225.92 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 4,318 చదరపు మీటర్లు, 7,136 చదరపు అడుగుల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని.. 751.19 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని, అలాగే.. 109 కేసుల్లో పట్టాదారు పుస్తకాల్లో అక్రమాలు జరిగాయని ‘సిట్’ స్పష్టం చేసింది.
ఇవీ ‘సిట్’ సిఫార్సులు..
– భూ ఆక్రమణలు, అక్రమాలకు సంబంధించి విశాఖ జిల్లాలో గతంలో పనిచేసిన ముగ్గురు జిల్లా కలెక్టర్లు, అలాగే.. గతంలో పనిచేసిన నలుగురు జిల్లా జాయింట్ కలెక్టర్లు, ముగ్గురు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు, పది మంది ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్, పలువురు తహసీల్దార్లపైన, అలాగే ఓ మాజీ మంత్రితో పాటు అతని నలుగురు అనుచరులపైన క్రిమినల్, క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలి.
– 50 కేసులకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
– 49 కేసులకు సంబంధించిన ప్రభుత్వ అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
– 134 కేసులకు సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
– 20 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
– వెబ్‌ల్యాండ్‌లో 34 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిగా ఉంటే రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లుగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
– 29 కేసులకు చెందిన రిజిస్ట్రేషన్ డీడ్స్‌ను రద్దు చేయాలి.
– గతంలో మూసివేసిన క్రిమినల్ కేసులను పునరుద్ధరించాలి.
– విశాఖ జిల్లాలో రెవెన్యూ, సర్వే రికార్డులు మాయమైన తరహాలోనే ఇతర జిల్లాల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉండి ఉంటాయని.. వీటిని సరిచేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment