రోజుకు 6 వేల రిజిస్ట్రేషన్లు!
విజయవాడ: ఆగస్టు ఒకటో తేదీ నుంచి పొలాలు, స్థలాల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పోటెత్తాయి. స్టాంప్ డ్యూటీ శుక్రవారం నుంచి భారీగా పెరుగుతుందన్న ఆందోళనతో భూముల రిజిస్ట్రేషన్ కు ప్రజలు బారులు తీరారు.
గత మూడు రోజుల్లో ఒక్కో జిల్లాలో 6 వేలకు పైగా రిజిస్టేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. మామూలుగా గుంటూరు జిల్లాలో ప్రతిరోజు 700 రిజిస్ట్రేషన్లు నమోదవుతుంటాయి. సోమవారం 2200, బుధవారం 3 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కృష్ణా జిల్లాలోని చిన్నచిన్న గ్రామాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్లు పెరగడం విశేషం. ప్రతిప్తాడు, పెదకాకాని, నల్లపాడు గ్రామాలతో పాటు నందిగామ, జగ్గంపేట, గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది.
కాగా, భూముల, రిజిస్ట్రేషన్ల ధరల పెంపుపై రేపు కేబినెట్‌లో చర్చిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్ లో చెప్పారు. కేబినెట్ చర్చ తర్వాత పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.