ఇక మేం చెప్పినట్టే! | formers against for land registration | Sakshi
Sakshi News home page

ఇక మేం చెప్పినట్టే!

Published Fri, Jul 14 2017 2:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ఇక మేం చెప్పినట్టే! - Sakshi

ఇక మేం చెప్పినట్టే!

భూముల రిజిస్ట్రేషన్లకు అంగీకరించని రైతులు
హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌
టీడీపీ పెద్దల మోసాలతో విసిగిపోయిన రాజధాని వాసులు
రైతులను ఒప్పించలేని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు
ఏం చేయాలనే విషయమై అధికారుల మల్లగుల్లాలు


ఎంతవరకైనా పోరాడతాం
సీఆర్‌డీఏ రోడ్డు కోసం అధికారుల మాటలు విని మా ఇల్లు వదులుకునే ప్రసక్తే లేదు. పునరావాస కాలనీని పూర్తిగా నిర్మించి మాకు అప్పగిస్తేనే అంగీకార పత్రాలు ఇస్తాం. అప్పటివరకు ఇళ్ల జోలికి వస్తే సహించం. లేకపోతే ఎంత వరకైనా పోరాడతాం.  
– షేక్‌ షఫీ, నవులూరు

సాక్షి, అమరావతి బ్యూరో : ‘మొదట మీరు చెప్పినవన్నీ చేయండి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ల సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి భూములు రిజిస్ట్రేషన్‌ చేసేది లేదు. భూమలు తీసుకోక ముందు మీరు చెప్పిందొకటి... ఇప్పుడు చేస్తున్నది మరొకటి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు ఇక నమ్మే పరిస్థితి లేదు. మాకు న్యాయం జరగకపోతే ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం...’ అంటూ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు తేల్చిచెబుతున్నారు. మూడేళ్లుగా ఇదిగో అభివృద్ధి.. అదిగో ప్లాట్లు.. అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని సీఆర్‌డీఏ అధికారులపై మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ పెద్దలు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అధికారులపై ఒత్తిడి...
రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల నుంచి సుమారు 33వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సమీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 27 గ్రామాల్లోని 22,400 మంది రైతులకు 56,920 వాణిజ్య, నివాసయోగ్యమైన ప్లాట్లు కేటాయించారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మాత్రం ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరగలేదు. ప్లాట్ల కేటాయింపు పూర్తయ్యాక రైతులు పూలింగ్‌కు ఇచ్చిన భూములను అధికారికంగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి.

అయితే, నెలలు గడుస్తున్నా... రైతులెవ్వరూ భూములు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక సీఆర్‌డీఏ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయితేనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు సీఆర్‌డీఏ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

అప్పుడు హామీల వర్షం... ఇప్పుడు ఆధికార జులుం !
భూములు తీసుకునేముందు అనేక మంది ప్రజాప్రతినిధులు రాజధాని రైతులపై హామీల వర్షం కురిపించారు. కానీ, ఒక్కటీ నెరవేర్చకపోవడం.. మూడేళ్లవుతున్నా రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలు మినహా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీంతో భవిష్యత్‌లో తమకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు ససేమీరా అంటున్నారు. అందులో భాగంగానే.. ఇటీవల తాడేపల్లి, కృష్ణాయపాలెం గ్రామాల పరిధిలో అవగాహన సదస్సులను రైతులు బహిష్కరించారు. రిజిస్ట్రేషన్లు చేసి తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని అధికారులకు తేల్చి చెప్పారు.

గురువారం నవులూరులో నిర్వహించిన గ్రామ సభలో కూడా రైతులు, ప్రజలు ఇదే తరహాలో ముందుగా హామీలు అమలు చేయాలని అధికారులను నిలదీశారు. ఇకపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం కష్టసాధ్యమవుతుందని సీఆర్‌డీఏ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ పెద్దలు అధికార బలం ఉపయోగించి రైతులను బెదిరించి రిజిష్ట్రన్లు చేయించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు...
భూములు ఇచ్చిన మెట్ట రైతులకు రూ.30 వేలు, జరీబుకు రూ.50 వేలు చొప్పున ఏటా కౌలు ఇస్తాం. అలాగే ప్రతి సంవత్సరం 10శాతం కౌలు సొమ్ము పెంచుతాం.
భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద కేటాయించే ప్లాట్లు అదే గ్రా>మంలో కోరినచోట.. కోరుకున్న విధంగా ఇస్తాం.
ప్లాట్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అప్పగిస్తాం..
రైతు కూలీలకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున పింఛను చెల్లింపులు, కూలీలు అందరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చూపుతాం.
ప్రతి గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తాం.
రాజధాని రైతుల పిల్లలకు ఉచిత కార్పొరేట్‌ విద్య, అన్ని కుటుంబాల వారికి ఉచితంగా కార్పొరేట్‌  వైద్యం అందిస్తాం.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లేదంటే నిరుద్యోగ భృతి అందజేస్తాం.
గ్రామ కంఠాలు ఎవరి అనుభవంలో ఉంటే వారికే కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.

ఇదీ ప్రస్తుత పరిస్థితి...
ఏటా ఏప్రిల్‌ మొదటి వారంలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు డబ్బులు వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామన్నారు. కానీ, ఈ ఏడాది జూలై 13వ తేదీ వచ్చినా, ఇంత వరకు కౌలు చెల్లించలేదు.
ఆన్‌లైన్‌ ద్వారా ప్లాట్ల కేటాయింపులో అడుగడుగునా మోసాలకు పాల్పడ్డారు.
ఊరికి అవతల, పక్క గ్రామాలు, పొలిమేరల్లో విలువలేని ప్లాట్లను రైతులకు కేటాయించారు.
మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులకు మాత్రం కోరినచోట, కోరుకున్న విధంగా ప్లాట్లు కేటాయించారు.
రైతులకు కేటాయించిన ప్లాట్లు ఇంత వరకు అభివృద్ధికి నోచుకోలేదు.
కేవలం నేలపాడులో లే అవుట్‌ అభివృద్ధి పనులు ప్రారంభించినా, నేటికీ పూర్తికాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement