* స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు బ్రేక్
* రిజిస్ట్రేషన్ల ఆదాయం దారుణంగా కోల్పోయిన సర్కారు
* ‘గ్రేటర్’లో భారీగా తగ్గిన లావాదేవీలు
* కోస్తాంధ్రలో అదే తీరు.. 3 జిల్లాల్లో సంపన్నుల కొనుగోలు ఒప్పందాలు
* మధ్యతరగతి ప్రజల్లో వేచిచూసే ధోరణి
* ప్రభుత్వ సిబ్బంది సమ్మెతో సీమాంధ్రలో ఒప్పందాలకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన సెగ రిజిస్ట్రేషన్ల శాఖను గట్టిగానే తాకింది. మాంద్యంతో సతమతమవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని విభజన ప్రకటన మరింత దెబ్బతీసింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లపై ఈ ప్రభావం మరీ తీవ్రంగా ఉంది.
జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి భారీగా పడిపోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన ప్రకటన జూలై 31న వెలువడినప్పటికీ 2 నెలల ముందు నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి స్థిరాస్తి లావాదేవీల్లో స్తబ్ధత ఏర్పడింది. వేచి ఉండాలన్న ధోరణి ప్రబలడంతో అత్యధికులు స్థిరాస్తి కొనుగోళ్లకు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి.
గత ఏడాది ఆగస్టులో రూ.134.72 కోట్లున్న రంగారెడ్డి రెవెన్యూ జిల్లా ఆదాయం ఈ ఏడాది ఆగస్టులో రూ.86.29 కోట్లకు పడిపోయింది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది జూలైలో రాబడి 25 శాతం తగ్గింది. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో గత ఏడాది జూలైలో రూ. 71.16 కోట్లున్న ఆదాయం ఈ ఏడాది జూలైలో రూ.41.06 కోట్లకు పడిపోయింది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు రాబడి 40 శాతానికే పరిమితం కావడం గమనార్హం.
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి మాంద్యం ప్రభావం కంటే రాష్ట్ర విభజన దెబ్బే ప్రధాన కారణమని చెబుతున్నారు. ‘రంగారెడ్డి జిల్లాలో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ అంతకు ముందు నెలల్లో కుదుర్చుకున్న కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించినవే. స్థలాలు, భవనాల కొనుగోళ్లకు సంబంధించి ధరలు మాట్లాడుకుని అధిక మొత్తంలో అడ్వాన్సులు చెల్లించిన వారు విధిలేక మిగిలిన మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కొద్దిమొత్తంలో అడ్వాన్సు చెల్లించిన వారు చాలామంది విభజన ప్రకటనతో అడ్వాన్సులను వదిలేసుకున్నారు’ అని రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద మొత్తంలో ఖాళీ స్థలాలున్న రంగారెడ్డి జిల్లాలో లావాదేవీలు గత 3 నెలల్లో దారుణంగా తగ్గిపోయాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉన్నతాధికారి వివరించారు.
సీమాంధ్రలోనూ అదే సీను..
సీమాంధ్ర ప్రాంతంలో కూడా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రభుత్వ సిబ్బంది సమ్మె, భూముల అధిక ధరలు సీమాంధ్రలో లావాదేవీలు తగ్గడానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. ‘సీమాంధ్రలోని చిన్న పట్టణాల్లో కూడా హైదరాబాద్ స్థాయిలో స్థలాల రేట్లు పెరిగిపోయాయని వినికిడి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు గతంలోనే ధరలను అమితంగా పెంచేశారు. పట్టణాలకు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ రియల్ వెంచర్లు వేసి.. సెంటు మూడు, నాలుగు లక్షలకు విక్రయించారు.
ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సెంటు రూ.రెండు, మూడు లక్షలకు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అంతకంటే ధర తగ్గించి విక్రయిస్తే భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో లావాదేవీలు పూర్తిగా మందగించాయి. తిరుపతి వంటి చోట్ల అప్పట్లో కొన్న ధరకు 25 శాతం తగ్గించి అమ్ముదామనుకున్నా కొనే వాళ్లు లేని పరిస్థితి నెలకొంది. ‘..లేని బూమ్‌ను చూపించి గతంలోనే ధరలు పెంచారు. ఇప్పుడు పూర్తి నెగటివ్ బూమ్ ఉంది’ అని సీమాంధ్ర రిజిస్ట్రేషన్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు.
3 జిల్లాల్లో కొనుగోలు ఒప్పందాలు
రాష్ట్రం అనివార్యంగా విడిపోతే రాజధాని ఎక్కడ నిర్మితమవుతుంది? అనే అంశంపై ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దృష్టిపెట్టారు. డబ్బున్న వారు గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసి ఒప్పందాలు రాసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. మధ్యతరగతి వారు మాత్రం వేచి ఉండే ధోరణిని అవలంభిస్తున్నారని అంటున్నారు. సీమాంధ్రలోని ఇతర జిల్లాల్లో కొనుగోలు ఒప్పందాలూ పెద్దగా జరగడం లేదు. ఆగస్టు మొదటి వారంలో కోస్తా జిల్లాల్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినా.. సిబ్బంది సమ్మె వల్ల ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి.
అనిశ్చితిలో ‘రియల్’ రంగం!
Published Mon, Sep 9 2013 1:48 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement