ఏపీ ఆదాయం రూ.2,978 కోట్లు
ఏపీ ఆదాయం రూ.2,978 కోట్లు
Published Mon, Sep 15 2014 2:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదాయం వరుసగా రెండో నెలలో కూడా ఆశాజనకంగానే ఉంది. జూలైతో పోల్చితే రాష్ట్ర సొంత పన్నులు, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో స్వల్పంగా తగ్గుదల ఉంది. ఆగస్టులో రూ.386 కోట్ల ఆదాయం తగ్గిందని అధికారవర్గాలు తెలిపాయి. ఆగస్టులో ఆదాయం తగ్గుదల సహజమేనని చెప్పాయి. జూలైలో మద్యం దుకాణాల వేలం పాటల రుసుము ఎక్కువగా రావడంతో ఆ నెలలో ఎక్సైజ్ ద్వారా ఏకంగా రూ. 675 కోట్లు వచ్చింది.
ఆగస్టులో మద్యం అమ్మకాల ద్వారా రూ. 200 కోట్లు వచ్చింది. జూలైలో వ్యాట్, ఎక్సైజ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనుల ద్వారా రూ. 3,364 కోట్లు రాగా ఆగస్టులో ఈ రంగాల ద్వారా రూ.2,978 కోట్లు వచ్చింది. వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు అధికంగా ఉండటంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయానికి ఢోకా లేదని అధికారవర్గాలు తెలిపాయి. స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలు బాగానే జరుగుతున్నాయడానికి ఈ ఆదాయం కొలమానమని అధికారవర్గాలు తెలిపాయి. సింగరేణి పూర్తిగా తెలంగాణకు చెందినందున గనుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆదాయం అంతంత మాత్రమేనని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టుకోవాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. జూన్ 2న రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఈ నెల 9న రూ. 2,000 కోట్లు అప్పు చేసింది. సెక్యూరిటీల విక్రయం ద్వారా చేసిన ఈ రుణానికి 9.8 శాతం వడ్డీ పడింది.
జూలై, ఆగస్టు నెలల్లో వివిధ రంగాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆదాయం (రూ. కోట్లలో...)
రంగం జూలై ఆగస్టు
వ్యాట్ 2,266.00 2,300.00
ఎక్సైజ్ 675.00 200.00
రవాణా 160.00 150.00
స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ 213.00 250.00
గనులు 50.00 78.00
మొత్తం 3,364 .00 2,978.00
Advertisement
Advertisement