రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మెదక్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారంపై రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రభావం చూపుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన భూ సేకరణకు వివిధ వర్గాలు జిల్లా వైపు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఇన్నాళ్లూ చిన్నా, చితకా వ్యాపారుల చేతుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ‘వెంచర్ల స్థాయి’కి ఎదిగింది. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల వారు జిల్లాలో భూ లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టిన క్రమంలో ప్రస్తుత పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
జిల్లాలో సుమారు 25 శాతం మేర అటు జీహెచ్‌ఎంసీలోనో, ఇటు హెచ్‌ఎండీఏలోనో అంతర్భాగంగా ఉంది. జిల్లా విస్తీర్ణం 9700 చదరపు కిలోమీటర్లు కాగా, 1673 చదరపు కిలోమీటర్లు హెచ్‌ఎండీఏలో అంతర్భాగంగా ఉంది. 10 మండలాలు, 260 గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ పరిధితో పాటు రాకపోకలకు అనువుగా ఉన్న చోట స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. 45, 64 జాతీయ రహదారులు, రాజీవ్ రహదారి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు విపరీతమైన డిమాండు ఉంది. పటాన్‌చెరు, సంగారెడ్డి, తూప్రాన్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపున పరిశ్రమలు భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వేలాది ఎకరాల భూమిని సేకరించారు. పరిశ్రమల ఏర్పాటుతో గజ్వేల్, తూప్రాన్, చేగుంట, సంగారెడ్డి, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న తూప్రాన్, పటాన్‌చెరు, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కొనుగోలుకు స్థానికేతరులు కూడా మొగ్గు చూపుతున్నారు.
సంగారెడ్డి కేంద్రంగా పెట్టుబడులు
సంగారెడ్డి కేవలం ఐదేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా మారింది. విద్య, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా మారడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి బడా సంస్థలు ప్రవేశించాయి. రియల్ వ్యాపారం పుంజుకుంటున్న క్రమంలో వెలువడిన రాష్ట్ర విభజన ప్రకటన ప్రభావంపై ప్రస్తుతం జిల్లా అంతటా చర్చ సాగుతోంది. పెట్టుబడికి తగిన లాభాలు, వృద్ధి ఉంటుందా లేదా అనే కోణంలో విశ్లేషణ సాగుతోంది. కొంతకాలం ధరల వృద్ధిలో స్తబ్దత ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారం రోజులుగా వ్యాపారం సాగుతున్న తీరు అందోళన కలిగించే స్థాయిలో లేదని వ్యాపారులు చెప్తున్నారు. ఐఐటీ క్యాంపస్‌గా శరవేగంగా నిర్మాణం జరుగుతుండటం, బడా పరిశ్రమలు ఉండటంతో రియల్ వ్యాపారం ఆశాజనకంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి భంగం వాటిల్లితే పెద్ద ఎత్తున నష్టపోతామనే ఆందోళన కూడా వ్యాపారుల్లో కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రకటనతో అందరిలోనూ ‘రియల్’ భయం
Published Tue, Aug 6 2013 12:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement