తొగుట, న్యూస్‌లైన్: అప్పుల బాధలు తాళలేక మండ ల పరిధిలోని లింగాపూర్‌కు చెందిన అక్కరాజు శ్రీనివాస్ (29) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఏస్‌ఐ హబీబ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అదే గ్రామవాసి గాంధారి నరేందర్‌రెడ్డికి చెందిన బోరు వెల్ లారీకి రెండేళ్లుగా డ్రైవర్, డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. వారం పది రోజులకోమారు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బోరు బండి పనులు సాగక పోవడంతో తొగుటలో ఉన్న బోర్‌వెల్ కార్యాలయం లో ఇతర పనివాళ్లతో కలిసి శ్రీనివాస్ ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నిద్రలేచిన శ్రీనివాస్ దిన చర్యలో భాగంగా బహిర్భూమికని బయటకు వచ్చాడు.
బోర్‌వెల్ కార్యాలయానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న పత్తి చేను పక్కనే ఉన్న బండ పైకి చేరుకున్న శ్రీనివాస్ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును తాగాడు. ఇదిలా ఉండగా పత్తి చేనును కౌలుకు చేస్తున్న పాగాల బాల్‌రెడ్డి బుధవారం చేనులోకి వెళ్లాడు. అయితే అప్పటికే శ్రీనివాస్ పడి ఉన్న విషయాన్ని గమనించాడు. దగ్గరకు వెళ్లి చూడగా పురుగుల మందు డబ్బాను చూసి అతడి యజమాని నరేందర్‌రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న భార్య, బంధువులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని కంటతడి పెట్టారు. గ్రామస్థులతో స్నేహపూర్వకంగా ఉండే శ్రీనివాస్ ఇక లేడంటూ జీర్ణించుకోలేక పోయాడు. భార్య లత మాత్రం తన భర్త సొంతింటి కోసం అప్పులు చేశాడని, ఈ నేపథ్యంలో అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య లత, ఓ కుమార్తె గాయత్రి ఉన్నారు.
వృద్ధాప్యంలో తోడుగా ఉంటావనికుంటివి కదరా..
వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటావని అనుకుంటే ఇంతలో ఎంత పని జరిగిపోయిందంటూ తల్లిదండ్రులు అక్కరాజు నర్సింలు, లక్ష్మిల రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడు శ్రీనివాస్ యజమాని నరేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కంటతడిపెట్టాడు.
అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య
Published Thu, Aug 8 2013 2:26 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement