సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పైచేయి సాధించినా, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బయట పడింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఆత్మరక్షణలో పడిన అధికార పార్టీ నేతలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరింత షాకిచ్చాయి. టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీలు చాలా చోట్ల అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చాయి. 2009 సాధారణ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు పంచాయతీ ఫలితాలు తలబొప్పి కట్టించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా వెలువడిన ప్రకటన కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమపై, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటన దోహదం చేస్తుందని పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు ఒక్కోనేత ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి బుధవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఆహ్వానించి తూప్రాన్‌లో సభ ఏర్పాటు చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కూడా తెలంగాణ ప్రకటన సాధనలో తమ పాత్రను ప్రమోట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు సొంత నియోజకవర్గం అందోలులో రాజకీయ ప్రత్యర్థి లేకపోవడంతో ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సాధన క్రెడిట్ అంతా డిప్యూటీ సీఎం ఖాతాలో చేరిందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు.
విలీనంపై అనాసక్తి
టీఆర్‌ఎస్ విలీన వార్తలపై అధికార పార్టీ నేతల్లో అనాసక్తి వ్యక్తమవుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యూహంతో జిల్లాలో రికార్డు స్థాయిలో ఎనిమిది మంది కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.‘నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపే టీఆర్‌ఎస్‌తో విలీనమైతే కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం కలగదు’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.మెదక్ ఎంపీ విజయశాంతి చేరిక తమకు నష్టం చేస్తుందనే భావన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎంపీగా విజయశాంతి కూడగట్టుకున్న వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో తమపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు విశ్లేషించుకుంటున్నారు.
‘తెలంగాణ’ ఓట్లపై ఆశలు
Published Thu, Aug 8 2013 2:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement