రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గందరగోళం | Real Estate Facing Crisis Situation | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గందరగోళం

Published Sat, Oct 19 2019 10:28 AM | Last Updated on Sat, Oct 19 2019 10:35 AM

Real Estate Facing Crisis Situation - Sakshi

సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

సాక్షి, సంగారెడ్డి: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరు తగ్గింది.. ఆర్థిక మాంద్యం ప్రభావం భూముల క్రయ, విక్రయాలపై పడింది. కొత్త భవనాల నిర్మాణాలు అంతగా కనిపించడం లేదు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు మినహా జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు జనం లేక వెలవెలబోతున్నాయి. రెండు నెలలుగా అగ్రిమెంట్లు చేసుకున్న వారితోనే క్రయవిక్రయాలు ఎక్కువగా అవుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త వాటి కొనుగోలు కోసం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జిల్లాలోని పారిశ్రామిక రంగాల ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పడుతోంది. విజయ దశమి తర్వాత భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. ప్రస్తుతం రియల్‌ వ్యాపారం నేల చూపులు చూస్తుండడంతో నిర్మాణ రంగంపై ఆధారపడినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంతో ప్రత్యామ్నాయ వ్యాపారం వైపు పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నట్లుగా తెసుస్తోంది. 

రియల్‌ ఎస్టేట్‌కు జిల్లా అనుకూలం.. 
హైదరాబాద్‌కు జిల్లా సరిహద్దుగా ఉండడంతోపాటు ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉండడంతో రూ. లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్ల స్థాయికి చేరాయి. సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో పరిశ్రమలు వెలిశాయి. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా రావడానికి అనుకూలంగా ఉండటంతో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌పై పెట్టుబడులు పెట్టారు.

ఫాంహౌజ్‌లు, షెడ్లు, వ్యవసాయంతో పాటు కొన్ని భూములను కొనుగోలు చేసి కౌలు రైతులకు అప్పగించారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు, నిర్మాణ రంగాలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీరంగంలో ఉన్నవారికి, ఇతరులు జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌తో అనుబంధం ఉంది. 

తగ్గిన క్రయ విక్రయాలు..  
ఓవైపు ఆర్థిక మాంద్యం, జహీరాబాద్‌లో నిమ్జ్‌ పనులు నత్తనడకన కొనసాగడం, భూసేకరణ అధికారులకు ఇబ్బందిగా మారడం, మారుమాలు నారాయణఖేడ్‌లో ఎకరం రూ. 50 లక్షల వరకు పలకడంతో రియల్‌ ఎస్టేట్‌లో మందగమనం వచ్చింది. ఇదిలా ఉండగా బడా వ్యాపార వేత్తలు వేల ఎకరాలు కొనుగోళ్లు చేసి గేటెడ్‌ కమ్యూనిటీ పేరుతో ఏంజెట్లను నియమించుకొని మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ తరహాలో వ్యాపారం చేస్తున్నారు.

కొంత మొత్తంతో అగ్రిమెంట్లు చేసుకొని నెలనెలా కిస్తీలు కట్టుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. 65వ నంబర్‌ జాతీయ రహదారిపై పటాన్‌ చెరు నుండి జహీరాబాద్‌ వరకు సుమారు 30 వెంచర్లు ఉన్నాయి. దీంతో బయటి వ్యాపారం తగ్గుముఖం పట్టింది.  

అగ్రిమెంట్లతోనే రియల్‌ వ్యాపారం.. 
రిజిస్ట్రేష కార్యాలయాల్లో ప్రస్తుతం అగ్రిమెంట్ల గోల కొనసాగుతోంది. ఆర్థికమాంద్యం, రూ.2వేల నోట్ల రద్దవుతున్నాయని సోషల్‌ మీడియాల్లో వస్తున్న పుకార్ల నేపథ్యంలో  గతంలో అగ్రిమెంట్లు చేసుకున్నవారు మిగతా డబ్బులను చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. రాబోయే పరిస్థితులను అంచనా వేసుకొని అగ్రిమెంట్లు రద్దు అవుతాయనే ఉద్దేశంతో అప్పులు చేసి , ఆస్తులు కుదువపెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. భూముల ధరలు పెరగడంతో ప్లాట్ల క్రయ విక్రయాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.

దీంతో రికార్డులో నంబర్లు, ఆదాయం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ   రియల్‌ వ్యాపారం జోరు తగ్గింది. మార్టిగేజ్, బంధువులు, స్నేహితులు, నమ్మకమైన వారిపై గిఫ్ట్‌ సెటిల్‌మెంట్లు సైతం చేస్తున్నారు. భూ యజమాని ఎప్పుడైనా దీన్ని రద్దు చేసే అవకాశం ఉండటంతో ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి.

నిర్మాణ రంగాలపై ఎఫెక్ట్‌  
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గడం ప్రభావం నిర్మాణ రంగాలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌తో నగదు చేతులు మారుతుంటుంది. ప్లాట్లు కొని నిర్మాణాలు చేపడతారు. ఇంజనీర్లు, మేస్త్రీలు, కార్మికులకు ఊపాధి లభిస్తుంది. రియల్‌ జోరు తగ్గడంతో బిల్డింగ్‌ పనులు చేయకుండా పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నాను. పెద్ద నోట్ల రద్దవుతాయనే పుకార్లు, ఆదాయ పరిమితులు విధించడం, ప్రభుత్వాల ఆంక్షలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
– అనిల్‌ చంద్‌ బిల్డర్‌ 

రియల్‌ ఎస్టేట్‌ కుదేల్‌  
మార్కెట్‌లో నగదు డబ్బులు చలమణీ ఎక్కువగా లేకపోవడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌  కార్యాలయాల వద్ద పాత అగ్రిమెంట్ల రిజిస్టేషన్‌  తప్ప కొత్తవి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది. జిల్లాలో ఒకప్పుడు రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగింది. ప్రస్తుతం వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో ఈ వ్యాపారంపై ఆధారపడిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. 
–ఎం. శశికాంత్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement