sangar reddy
-
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గందరగోళం
సాక్షి, సంగారెడ్డి: రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గింది.. ఆర్థిక మాంద్యం ప్రభావం భూముల క్రయ, విక్రయాలపై పడింది. కొత్త భవనాల నిర్మాణాలు అంతగా కనిపించడం లేదు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మినహా జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనం లేక వెలవెలబోతున్నాయి. రెండు నెలలుగా అగ్రిమెంట్లు చేసుకున్న వారితోనే క్రయవిక్రయాలు ఎక్కువగా అవుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త వాటి కొనుగోలు కోసం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జిల్లాలోని పారిశ్రామిక రంగాల ప్రభావం రియల్ ఎస్టేట్‌పై ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పడుతోంది. విజయ దశమి తర్వాత భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. ప్రస్తుతం రియల్ వ్యాపారం నేల చూపులు చూస్తుండడంతో నిర్మాణ రంగంపై ఆధారపడినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ప్రత్యామ్నాయ వ్యాపారం వైపు పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నట్లుగా తెసుస్తోంది. రియల్ ఎస్టేట్‌కు జిల్లా అనుకూలం.. హైదరాబాద్‌కు జిల్లా సరిహద్దుగా ఉండడంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉండడంతో రూ. లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్ల స్థాయికి చేరాయి. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పరిశ్రమలు వెలిశాయి. రాజీవ్‌గాంధీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా రావడానికి అనుకూలంగా ఉండటంతో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు జిల్లాలో రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులు పెట్టారు. ఫాంహౌజ్‌లు, షెడ్లు, వ్యవసాయంతో పాటు కొన్ని భూములను కొనుగోలు చేసి కౌలు రైతులకు అప్పగించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, నిర్మాణ రంగాలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీరంగంలో ఉన్నవారికి, ఇతరులు జిల్లాలో రియల్ ఎస్టేట్‌తో అనుబంధం ఉంది. తగ్గిన క్రయ విక్రయాలు.. ఓవైపు ఆర్థిక మాంద్యం, జహీరాబాద్‌లో నిమ్జ్ పనులు నత్తనడకన కొనసాగడం, భూసేకరణ అధికారులకు ఇబ్బందిగా మారడం, మారుమాలు నారాయణఖేడ్‌లో ఎకరం రూ. 50 లక్షల వరకు పలకడంతో రియల్ ఎస్టేట్‌లో మందగమనం వచ్చింది. ఇదిలా ఉండగా బడా వ్యాపార వేత్తలు వేల ఎకరాలు కొనుగోళ్లు చేసి గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ఏంజెట్లను నియమించుకొని మల్టీ లెవల్ మార్కెటింగ్ తరహాలో వ్యాపారం చేస్తున్నారు. కొంత మొత్తంతో అగ్రిమెంట్లు చేసుకొని నెలనెలా కిస్తీలు కట్టుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై పటాన్ చెరు నుండి జహీరాబాద్ వరకు సుమారు 30 వెంచర్లు ఉన్నాయి. దీంతో బయటి వ్యాపారం తగ్గుముఖం పట్టింది. అగ్రిమెంట్లతోనే రియల్ వ్యాపారం.. రిజిస్ట్రేష కార్యాలయాల్లో ప్రస్తుతం అగ్రిమెంట్ల గోల కొనసాగుతోంది. ఆర్థికమాంద్యం, రూ.2వేల నోట్ల రద్దవుతున్నాయని సోషల్ మీడియాల్లో వస్తున్న పుకార్ల నేపథ్యంలో గతంలో అగ్రిమెంట్లు చేసుకున్నవారు మిగతా డబ్బులను చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రాబోయే పరిస్థితులను అంచనా వేసుకొని అగ్రిమెంట్లు రద్దు అవుతాయనే ఉద్దేశంతో అప్పులు చేసి , ఆస్తులు కుదువపెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. భూముల ధరలు పెరగడంతో ప్లాట్ల క్రయ విక్రయాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీంతో రికార్డులో నంబర్లు, ఆదాయం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రియల్ వ్యాపారం జోరు తగ్గింది. మార్టిగేజ్, బంధువులు, స్నేహితులు, నమ్మకమైన వారిపై గిఫ్ట్ సెటిల్మెంట్లు సైతం చేస్తున్నారు. భూ యజమాని ఎప్పుడైనా దీన్ని రద్దు చేసే అవకాశం ఉండటంతో ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నిర్మాణ రంగాలపై ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడం ప్రభావం నిర్మాణ రంగాలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్‌తో నగదు చేతులు మారుతుంటుంది. ప్లాట్లు కొని నిర్మాణాలు చేపడతారు. ఇంజనీర్లు, మేస్త్రీలు, కార్మికులకు ఊపాధి లభిస్తుంది. రియల్ జోరు తగ్గడంతో బిల్డింగ్ పనులు చేయకుండా పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నాను. పెద్ద నోట్ల రద్దవుతాయనే పుకార్లు, ఆదాయ పరిమితులు విధించడం, ప్రభుత్వాల ఆంక్షలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – అనిల్ చంద్ బిల్డర్ రియల్ ఎస్టేట్ కుదేల్ మార్కెట్లో నగదు డబ్బులు చలమణీ ఎక్కువగా లేకపోవడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పాత అగ్రిమెంట్ల రిజిస్టేషన్ తప్ప కొత్తవి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది. జిల్లాలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ జోరు కొనసాగింది. ప్రస్తుతం వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో ఈ వ్యాపారంపై ఆధారపడిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. –ఎం. శశికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారి -
బెజ్జంకి పోలీస్ భేష్..
సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి పోలీసులు అందిస్తున్న సేవలు, విధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు 41వ స్థానం లభించినందుకు బెజ్జంకి పోలీసులు, మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 86 పోలీస్స్టేషన్లను పరిగణలోకి తీసుకున్న వాటిలో మెరుగైన ఫలితాలు సాధించిన బెజ్జంకి పోలీసులు రానించడం అబినందనీయం. శిక్షణలో 53మంది ఎంపిక.. జిల్లా సీపీ జోయల్ డేవిస్ సూచనలతో ఎస్ఐ అభిలాష్ మండలంలో గ్రామ గ్రామాన ప్రజలతో కలిసి పనిచేశారు. వాహనదారులకు లైసన్స్‌లను ఇప్పించడంతో పాటు పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం యువతను చైతన్య పరిచి ఎక్కువ సంఖ్యలో పోలీస్ శాఖలో దరఖాస్తు చేసుకునేలా చేశారు. వారికి శిక్షణ ఇచ్చి 53 మంది ఎంపికయ్యేలా కృషిచేశారు. ప్రస్తుతం వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది ప్రజలతో మమేకమవుతున్నారు.. ఇటీవల మండలంలో ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసులు, క్రైంరేటు, తగ్గించడంతో పాటు మండల స్థాయిలో సీసీ కెమెరాలను బిగించడం, సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమై ఉండటంతో మంచి ఫలితాలు వచ్చాయి. సీసీటీఎన్ఎస్ ఆన్లైన్, ఎఫ్ఐఆర్ల నమోదులోను బెజ్జంకి పోలీసులు ముందున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర కమిటీ బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌ను అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో చోటిచ్చింది. రాష్ట్రంలోనే మూడు పోలీస్స్టేషన్లు కేంద్ర జాబితాలో ఉండగా సీఎం కేసీఆర్ జిలా, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండలమైన సిద్దిపేటలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు 41వ స్థానం లబించినందుకు మండల ప్రజాప్రతినిధులు. ప్రజలు అభినందిస్తున్నారు. సంతోషంగా ఉంది జాతీయ స్థాయి ఉత్తమ పోలీస్ స్టేషన్లో బెజ్జంకి పోలీస్ స్టేషన్ 41వ స్థానం లభించడం సంతోషంగా ఉంది. సిద్దిపేట సీపీ జోయల్‌డేవిస్, జిల్లా అధికారులు, మాపోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ఈ ఫలితాలు సాధించాం. పలు చోరీ కేసులను వేగంగా చేధించాము. ప్రజలకు సేవలందిస్తు వారిలో మమేకమై పని చేస్తున్న మాసిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు. – పుల్ల అభిలాష్, ఎస్ఐ బెజ్జంకి పోలీసుల కృషికి ఫలితం బెజ్జంకి ఎస్ఐ అభిలాష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది మండలంలో చురకుగా పని చేస్తున్నారు. ప్రజల్లో మమేకమై బాదితులకు సహాయం అందిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో మండలంలో ఎలాంటి అవాంతర సంఘటనలు జరకుండా అప్రమత్తంగా చూస్తున్నారు. వీరు చేసిన కృషికి కేంద్ర హోంశాఖ నిర్వహించిన అత్యుత్తమ పోలీస్స్టేషన్లలో 41వ స్థానం లభించడం అభినందనీయం. – లింగాల నిర్మల లక్ష్మణ్, నూతన ఎంపీపీ, బెజ్జంకి -
డ్రంకెన్ డ్రైవ్‌లో 24 మందికి జైలు
సంగారెడ్డి జోన్ : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ కార్యక్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందిని గురువారం సంగారెడ్డి జిల్లా ఏడీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక రోజు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్ష విధిస్తూ ఏడీఎం కోర్టు మేజిస్ట్రేట్ దేవి మానస తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి 9 మందిని కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. ఇద్దరికి రెండురోజులు, ఏడుగురికి ఒక రోజు జైలు శిక్ష వి«ధించారన్నారు. సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒకరికి ఏడు రోజులు, ఒకరికి మూడు రోజులు, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించారన్నారు. మునిపల్లి పోలీస్‌స్టేషన్ నుండి 11 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా వారిలో ఇద్దరికి మూడు రోజులు, ముగ్గురికి రెండు రోజులు, ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష విదించారన్నారు. బీడీఎల్ బానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరిని కోర్టులో హాజరు పర్చగా ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. -
అక్కకోసం.. బావను చంపిన బావమరిది
పుల్కల్(అందోల్): అక్క కోసం ఇద్దరి ప్రాణాలను తీశాడు. ఫ్యాక్షన్ తరహాలో వెంటాడి..వేటాడి హత్య చేశాడు. అయితే అక్కపై ప్రేమతోనే ఈ హత్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాను తలపించేలా అతికిరాతకంగా రాడ్‌తో హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. జంట హత్యల కేసులో నిందితుడు శ్రీశైలంను పోలీసులు సోమవారం తెల్లవారుజామున జోగిపేట ఆర్టీసీ బస్టాప్ సమీపంలో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పుల్కల్ మండల పరిధిలోని శివ్వంపేట గ్రామానికి చెందిన మిర్యాల మల్లేశంకు 12 సంవత్సరాల క్రితం అదే గ్రామంలో ఉంటున్న తన అక్క అనసూజ కూతురు పద్మతో పెళ్లి చేశారు. కొంతకాలం కాపురం సాఫీగా సాగింది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతోపాటు సంసారంలో చిన్నపాటి తగాదాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో పలు మార్లు గ్రామంలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. కానీ వారి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం తనకు న్యాయం చేయాలని పద్మ పుల్కల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మల్లేశంను స్టేషన్‌కు పిలిపించి భార్య, భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆస్తి వ్యవహారంలో విభేదాలు ఉన్నాయని గమనించిన పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగానే గ్రామానికి చెందిన కొందరు పెద్దలు ఇరువురితో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చారు. మల్లేశానికి సంబంధించిన రెండు ఇళ్లతోపాటు ఏడు ఎకరాల భూమిని భార్య, పిల్లల పేరున రాయాలని నిర్ణయించారు. అయితే దీనికి మల్లేశం అంగీకరించలేదని తెలిసింది. దీంతో పుల్కల్ పోలీసులు జోక్యం చేసుకొని మల్లేశానికి ఉన్న రెండు ఇళ్లలో ఒకటి పద్మకు ఇవ్వడంతోపాటు మూడు ఎకరాల భూమిని భార్యకు ఇవ్వాలని సూచించారు. దానికి అనుగుణంగానే గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్నారు. కానీ వారు కోరినట్లుగా భూమి మొత్తం, రెండు ఇళ్లు రాలేదనే అక్కసుతో వారం రోజుల క్రితం మరోసారి మల్లేశం బావమరిది శ్రీశైలం గొడవకు దిగడంతో భయపడి తన తల్లితోపాటు మల్లేశం సొంత ఊరు వదిలేసి బంధువుల వద్దకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆదివారం సాయంత్రం తల్లితోపాటు మల్లేశం బంధువుల ఊరి నుంచి శివ్వంపేటకు వచ్చారు. దీన్ని గమనించిన పద్మ తమ్ముడు శ్రీశైలం ఎలాగైనా మల్లేశాన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో అతడి ఇంటికి వచ్చాడు. మల్లేశం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి అతడు కల్లు దుకాణంలో నుంచి బయటకు వచ్చే వరకు దారి కాచాడు. ఈ క్రమంలో మల్లేశం దుకాణంలో నుంచి బయటకు రాగానే తన వెంట తీసుకువచ్చిన రాడ్‌తో వెనుక నుంచి తలపై బాదాడు. తలపై దెబ్బ తీవ్రంగా తాకడంతో మెదడు చిట్లిపోయి మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి తన అక్క, బావల మధ్య చిచ్చు పెడుతోందని భావించి వరుసకు మేనత్తయిన పెంటమ్మను హతమార్చేందుకు పూనుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగానే ఇంటి పక్క వారితో మాట్లాడుతున్న పెంటమ్మను వెనుక నుంచి వెళ్లి రాడ్‌తో తలపై బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై పెంటమ్మ సైతం అక్కడికక్కడే మృతి చెందింది. కర్ర అనుకున్నా... తన ఇంటి ముందు పెంటమ్మ కూర్చుని ఉండగా మిర్యాల మల్లేశం వచ్చి చేతిలో ఉన్న దాంతో తలపై కొట్టాడని ప్రత్యక్ష సాక్షి వార్డు సభ్యుడు హలీం తెలిపారు. తాను వచ్చి ముసలావిడను ఎందుకు అలాకొడుతున్నావు..?ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవాలని సూచించి అతడి కాలర్ పట్టుకొని చేతిలో ఉన్న దాన్ని తీసుకొని కింద వేయగా శబ్ధం వచ్చిందన్నారు. అంతలోపే కల్లు దుకాణం వద్ద మల్లేశంనుచంపివేశాడు.. పట్టుకోండి... పట్టుకోండి అంటూ జనం కేకలు వేస్తుండగానే తన నుంచి తప్పించుకొని పారిపోయాడన్నారు. తాను తీవ్రంగా గాయాలైన పెంటమ్మను 108లో తరలించడం కోసం సమాచారం ఇచ్చి ఆమెను చూసేసరికే మృతి చెందిందని తెలిపాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ, డీఎస్పీ జంట హత్యలు జరిగిన ప్రదేశాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇద్దరిని హత్య చేయడానికి వారి కుటుంబ తగాదాలే కారణమని తెలిపారు. వారి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. -
సంగారెడ్డికి తరలిన కాంగ్రెస్ నేతలు
ఎల్లారెడ్డిపేట: సంగారెడ్డిలో రాహుల్‌గాంధీతో నిర్వహించిన బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల నుంచి నాయకులు గురువారం తరలివెళ్లారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రధాని కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. తరలివెళ్లిన వారిలో మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, బూట శ్రీనివాస్, నాయకులు బండారి బాల్‌రెడ్డి, గౌస్, లక్ష్మారెడ్డి, పిట్లల ముత్యం, రాజు, బుచ్చిరెడ్డి, లింభానాయక్, పని శివ, భూక్య రాములు, గిరిధర్‌రెడ్డి, సత్యం, రాములు, రాజయ్య, లింగంగౌడ్ తదితరలున్నారు. ముస్తాబాద్: ప్రజాగర్జన సభకు ముస్తాబాద్ నుంచి నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి తిరుపతి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర రాములు, దీటి నర్సింహులు, అగుళ్ల రాజేశం, నవీన్, ఎల్లాగౌడ్, రాజయ్య, నర్సింహరెడ్డి, సత్తయ్య, రాజమల్లు తదితరులు ఉన్నారు. సిరిసిల్లరూరల్: సిరిసిల్ల అర్బన్ మండలం, తంగళ్లపల్లి మండలాల నుంచి సంగారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. సంగారెడ్డిలో జరిగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బహిరంగసభకు సూమారు 500 మంది కాంగ్రెస్ నేతలు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఇల్లంతకుంట: సంగారెడ్డిలో సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 2 వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు తరలివెళ్లారు. వెళ్లిన వారిలో కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు పాశం రాజేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవరెడ్డి, పసుల వెంకటి, నక్క మహేష్, తదితరులున్నారు. -
పల్లెకు ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టెయ్యనే’ పాత తరం పాలనకు కేసీర్ సర్కారు పాతరేసింది. ‘సమస్య ఎక్కడుందో.. పరిష్కా రం అక్కడే వేతికే’ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమానికి స్పష్టమైన మార్గదర్శకాలతో రూపకల్పన జరిగింది. దీని పర్యవేక్షణ కోసం జిల్లా ప్రత్యేక అధికారిగా హౌసింగ్ ఎండీ బుర్రా వెంకటేశంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెకు పట్టిన రుగ్మతలు ఏమిటో కనుక్కునేందుకు అధికారులు ఇక పల్లెలకే పరుగుపెట్టనున్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్య, వైద్యం,సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమాచారం సేకరించి, పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈ నెల 28 తరువాత ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. ఈ మేరకు సోమవారం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. పల్లెల్లో 14 అంశాలపై వివరాల సేకరణ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ఈ నెల నుంచి 13 నుంచి 18 వరకు గ్రామాల ప్రణాళికలు , 19 నుంచి 23 వరకు మండలాల ప్రణాళికలు , 24 నుంచి 28 వరకు జిల్లా ప్రణాళికలు నిర్వహించాలి. సమాచార సేకరణ కోసం గ్రామ, మండల స్థాయి రిసోర్స్ పర్సన్లను ఇన్చార్జి కలెక్టర్ శరత్ పర్యవేక్షణలో నియమించనున్నారు. గ్రామాల్లో సమాచారం సేకరించి మండలాలకు, మండలాల్లో పంచాయతీల వారీగా సమాచారం క్రోడీకరించి జిల్లా కేంద్రానికి పంపుతారు. ఆ తర్వాతజిల్లా యూనిట్‌గా ప్రభుత్వం నివేదికను అందిస్తారు. గ్రామ పంచాయతీ పేరు, కుటుంబాల సంఖ్య, ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యాలయం వివరాలు, ఇతర సంస్థలు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, అప్పులు, ఖర్చు, సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఆవాస ప్రాధాన్యతలు ఇలా... దాదాపు 14 అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తారు. గామ పంచాయతీ పరిధిలో ఉన్న ఉపరితల జల భాండాగారాలు, చేతిపంపులు, వీధి దీపాలు, రోడ్లు, మరుగు కాల్వలను లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల సంఖ్య, ఎంపీటీసీ, సర్పంచు, వార్డు మెంబర్లు...వారి విద్యార్హత, మెయిల్ ఐడీలు, సెల్ నంబర్లు సేకరిస్తారు. ప్రభుత్వం గ్రామస్థాయిలో చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలియజేసే క్రమంలో గ్రామస్థాయి ప్రణాళికలో ప్రజా ప్రతినిధులకు తగినంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది హోదా, విద్యార్హతలు, వేతనం తదితర వివరాలు కూడా సేకరిస్తారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత గ్రామ స్థాయిలో ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు ఉన్నాయి, వాటిలో మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? ఆయా పాఠశాలల్లో, కళాశాల్లో విద్యార్థుల సంఖ్య, విద్యార్థినుల వివరాలు సేకరిస్తారు. 6-20 ఏళ్ల లోపు బడికి వెళ్లే వారి సంఖ్య, బడి బయట ఉన్న వారి సంఖ్య, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్య కోర్సులను అభ్యసిస్తున్న వారి వివరాలు సేకరిస్తారు. గామంలో చదువు పూర్తయి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన వారి వివరాలు సేకరిస్తారు. అంగన్వాడీ కేంద్రాలు, వాటి పనితీరు, పిల్లల వివరాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రంథాలయాలు తదితర వివరాలు సేకరిస్తారు. అంతేకాకుండా పీహెచ్‌సీల పరిస్థితి, వైద్య సిబ్బంది, వారి పనితీరు, పశువైద్యశాలలు, వైద్యుల వివరాలు సేకరిస్తారు. సమగ్ర పరిశీలన... గ్రామాల్లో వ్యవసాయ భూమి, వ్యవసాయ యోగ్యం కాని బీడు భూములు, వాటికి ఉన్న నీటి వసతి, పరపతి సంఘాలు, సహజ వనరులు, ఉపాధి ద్వారా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఈ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చింది. చెరువులు, చెక్‌డ్యాంలు, బావులు, అడవుల వివరాలు కూడా సేకరిస్తారు. గ్రామ ప్రణాళికలో వచ్చే అంశాల ఆధారంగా అక్కడ వ్యవసాయ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్యలు తీసుకుంటుంది. గ్రామంలో రేషన్ కార్డులు, పింఛన్ల వివరాలు, ఎంత మందికి ఉపాధి హామీ జాబు కార్డులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పక్కా ఇళ్ల వివరాలు సేకరిస్తారు. ఇలా సేకరించడం వల్ల ఏ గ్రామంలో ఏఏ సమస్యలు ఉన్నాయి, ఏ మండలంలో ఎలాంటి మొక్కలు పెంచడానికి అనుకూలమైన వాతావరణం ఉంది? పల్లెల్లో ఎలాంటి నిరుద్యోగం ఎక్కువగా ఉంది? ఏ ప్రాంతంలో ఏ పంటలు అధికంగా పండుతాయి? వాటికి మార్కెటింగ్ వసతులు ఎలా మెరుగుపరచాలి? అనే ఒక్కొక్క సమస్య పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని నిధులు అవసరమవుతాయి? వాటిని ఎక్కడ నుంచి తీసుకురావాలి? అనే దానిపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. దీన్ని బట్టి ప్రజా అవసరాలను ఎప్పటికప్పుడు,ఎక్కడికక్కడ గుర్తించి, అక్కడే పరిష్కారం చూపడానికి మార్గం దొరుకుతుంది. -
జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేడే
సంగారెడ్డి క్రైం: జెడ్పీ చైర్మన్ పీఠంపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయనుంది. శనివారం చైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కనప్పటికీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మద్దతు పలకటంతో టీఆర్ఎస్కు కలిసిరానుంది. నర్సాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు రాజమణికే చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. టీఆర్ఎస్లో పలువురు జెడ్పీటీసీ సభ్యులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నప్పటికీ రాజమణి వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అలాగే వైస్ చైర్మన్ పదవిని సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీష్‌రావు స్వయంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు వినికిడి. క్యాంపులో ఉన్న టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు ఉదయం నేరుగా సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయానికి చేరుకుని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారు. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 21 స్థానాల్లో గెలుపొందిందగా కాంగ్రెస్ పార్టీ సైతం 21 స్థానాలను కైవసం చేసుకుంది. మరో నాలుగు జెడ్పీటీసీలను టీడీపీ గెలుపొందింది. జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన పూర్తి మెజార్టీ ఏ పార్టీకి దక్కకపోవటంతో హంగ్ ఏర్పడింది. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించుకునేందుకు ఎత్తులు వేసింది ఫలితంగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలు, ఇద్దరు టీడీపీ జెడ్పీటీసీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ జెడ్పీటీసీల సంఖ్య 26కు చేరుకుంది. మెజార్టీ జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వైపు ఉండటంతో జెడ్పీ చైర్మన్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ.. విప్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఏర్పాట్లు పూర్తి... శనివారం జరగనున్న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక జరగనుంది. మొదట ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత చైర్మన్ ఎన్నికకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. చైర్మన్ పదవి కోసం పోటీ ఏర్పడిన పక్షంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఫలితాలు వెలువరిస్తారు. అనంతరం వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవటం జరుగుతుంది. జెడ్పీ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ కార్యాలభవనం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.