జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేడే
సంగారెడ్డి క్రైం: జెడ్పీ చైర్మన్ పీఠంపై టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేయనుంది. శనివారం చైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కనప్పటికీ టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మద్దతు పలకటంతో టీఆర్‌ఎస్‌కు కలిసిరానుంది. నర్సాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు రాజమణికే చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఆమె పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో పలువురు జెడ్పీటీసీ సభ్యులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నప్పటికీ రాజమణి వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అలాగే వైస్ చైర్మన్ పదవిని సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి హరీష్‌రావు స్వయంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు వినికిడి. క్యాంపులో ఉన్న టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యులు ఉదయం నేరుగా సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయానికి చేరుకుని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారు. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్ 21 స్థానాల్లో గెలుపొందిందగా కాంగ్రెస్ పార్టీ సైతం 21 స్థానాలను కైవసం చేసుకుంది. మరో నాలుగు జెడ్పీటీసీలను టీడీపీ గెలుపొందింది. జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన పూర్తి మెజార్టీ ఏ పార్టీకి దక్కకపోవటంతో హంగ్ ఏర్పడింది. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించుకునేందుకు ఎత్తులు వేసింది ఫలితంగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలు, ఇద్దరు టీడీపీ జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీల సంఖ్య 26కు చేరుకుంది. మెజార్టీ జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ వైపు ఉండటంతో జెడ్పీ చైర్మన్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ.. విప్‌పైనే ఆశలు పెట్టుకుంది.
ఏర్పాట్లు పూర్తి...
శనివారం జరగనున్న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక జరగనుంది.
మొదట ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత చైర్మన్ ఎన్నికకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. చైర్మన్ పదవి కోసం పోటీ ఏర్పడిన పక్షంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఫలితాలు వెలువరిస్తారు. అనంతరం వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవటం జరుగుతుంది. జెడ్పీ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ కార్యాలభవనం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.