అక్కకోసం.. బావను చంపిన బావమరిది | a man killed two members for his sister at medak | Sakshi
Sakshi News home page

అక్కకోసం.. బావను చంపిన బావమరిది

Published Tue, Jan 23 2018 5:00 PM | Last Updated on Tue, Jan 23 2018 5:43 PM

a man killed two members for his sister at medak - Sakshi

పుల్‌కల్‌(అందోల్‌): అక్క కోసం ఇద్దరి ప్రాణాలను తీశాడు. ఫ్యాక్షన్‌ తరహాలో వెంటాడి..వేటాడి హత్య చేశాడు. అయితే అక్కపై ప్రేమతోనే ఈ హత్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాను తలపించేలా అతికిరాతకంగా రాడ్‌తో హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. జంట హత్యల కేసులో నిందితుడు శ్రీశైలంను పోలీసులు సోమవారం తెల్లవారుజామున జోగిపేట ఆర్టీసీ బస్టాప్‌ సమీపంలో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పుల్‌కల్‌ మండల పరిధిలోని శివ్వంపేట గ్రామానికి చెందిన మిర్యాల మల్లేశంకు 12 సంవత్సరాల క్రితం అదే గ్రామంలో ఉంటున్న  తన అక్క  అనసూజ కూతురు పద్మతో పెళ్లి చేశారు. కొంతకాలం కాపురం సాఫీగా సాగింది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతోపాటు సంసారంలో చిన్నపాటి తగాదాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో పలు మార్లు గ్రామంలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. కానీ వారి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం తనకు న్యాయం చేయాలని పద్మ పుల్‌కల్‌ పోలీసులను ఆశ్రయించారు.

దీంతో పోలీసులు మల్లేశంను స్టేషన్‌కు పిలిపించి భార్య, భర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఆస్తి వ్యవహారంలో విభేదాలు ఉన్నాయని గమనించిన పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగానే గ్రామానికి చెందిన కొందరు పెద్దలు ఇరువురితో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చారు. మల్లేశానికి సంబంధించిన రెండు ఇళ్లతోపాటు ఏడు ఎకరాల భూమిని భార్య, పిల్లల పేరున రాయాలని నిర్ణయించారు. అయితే దీనికి మల్లేశం అంగీకరించలేదని తెలిసింది. దీంతో పుల్‌కల్‌ పోలీసులు జోక్యం చేసుకొని మల్లేశానికి ఉన్న రెండు ఇళ్లలో ఒకటి పద్మకు ఇవ్వడంతోపాటు మూడు ఎకరాల భూమిని భార్యకు ఇవ్వాలని సూచించారు. దానికి అనుగుణంగానే గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్నారు. కానీ వారు కోరినట్లుగా భూమి మొత్తం, రెండు ఇళ్లు రాలేదనే అక్కసుతో వారం రోజుల క్రితం మరోసారి మల్లేశం బావమరిది శ్రీశైలం గొడవకు దిగడంతో  భయపడి తన తల్లితోపాటు మల్లేశం సొంత ఊరు వదిలేసి బంధువుల వద్దకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆదివారం సాయంత్రం తల్లితోపాటు మల్లేశం బంధువుల ఊరి నుంచి శివ్వంపేటకు వచ్చారు.

 దీన్ని గమనించిన పద్మ తమ్ముడు శ్రీశైలం ఎలాగైనా మల్లేశాన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో అతడి ఇంటికి వచ్చాడు. మల్లేశం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి అతడు కల్లు దుకాణంలో నుంచి బయటకు వచ్చే వరకు  దారి కాచాడు. ఈ క్రమంలో మల్లేశం దుకాణంలో నుంచి బయటకు రాగానే  తన వెంట తీసుకువచ్చిన రాడ్‌తో వెనుక నుంచి తలపై బాదాడు. తలపై దెబ్బ తీవ్రంగా తాకడంతో మెదడు చిట్లిపోయి మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి తన అక్క, బావల మధ్య చిచ్చు పెడుతోందని భావించి వరుసకు మేనత్తయిన పెంటమ్మను హతమార్చేందుకు పూనుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగానే  ఇంటి పక్క వారితో మాట్లాడుతున్న పెంటమ్మను వెనుక నుంచి వెళ్లి రాడ్‌తో తలపై బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై పెంటమ్మ సైతం అక్కడికక్కడే మృతి చెందింది.

కర్ర అనుకున్నా...
తన ఇంటి ముందు పెంటమ్మ కూర్చుని ఉండగా మిర్యాల మల్లేశం వచ్చి చేతిలో ఉన్న దాంతో తలపై కొట్టాడని ప్రత్యక్ష సాక్షి వార్డు సభ్యుడు హలీం తెలిపారు. తాను వచ్చి ముసలావిడను ఎందుకు అలాకొడుతున్నావు..?ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవాలని సూచించి అతడి కాలర్‌ పట్టుకొని చేతిలో ఉన్న దాన్ని తీసుకొని కింద వేయగా శబ్ధం వచ్చిందన్నారు. అంతలోపే కల్లు దుకాణం వద్ద మల్లేశంనుచంపివేశాడు.. పట్టుకోండి... పట్టుకోండి అంటూ జనం  కేకలు వేస్తుండగానే తన నుంచి తప్పించుకొని పారిపోయాడన్నారు. తాను తీవ్రంగా గాయాలైన పెంటమ్మను 108లో తరలించడం కోసం సమాచారం ఇచ్చి ఆమెను చూసేసరికే మృతి చెందిందని తెలిపాడు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ, డీఎస్పీ
జంట హత్యలు జరిగిన ప్రదేశాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇద్దరిని హత్య చేయడానికి వారి కుటుంబ తగాదాలే కారణమని తెలిపారు. వారి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement