సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టెయ్యనే’ పాత తరం పాలనకు కేసీర్ సర్కారు పాతరేసింది. ‘సమస్య ఎక్కడుందో.. పరిష్కా రం అక్కడే వేతికే’ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమానికి స్పష్టమైన మార్గదర్శకాలతో రూపకల్పన జరిగింది. దీని పర్యవేక్షణ కోసం జిల్లా ప్రత్యేక అధికారిగా హౌసింగ్ ఎండీ బుర్రా వెంకటేశంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పల్లెకు పట్టిన రుగ్మతలు ఏమిటో కనుక్కునేందుకు అధికారులు ఇక పల్లెలకే పరుగుపెట్టనున్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్య, వైద్యం,సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమాచారం సేకరించి, పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈ నెల 28 తరువాత ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. ఈ మేరకు సోమవారం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.
పల్లెల్లో 14 అంశాలపై వివరాల సేకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ఈ నెల నుంచి 13 నుంచి 18 వరకు గ్రామాల ప్రణాళికలు , 19 నుంచి 23 వరకు మండలాల ప్రణాళికలు , 24 నుంచి 28 వరకు జిల్లా ప్రణాళికలు నిర్వహించాలి. సమాచార సేకరణ కోసం గ్రామ, మండల స్థాయి రిసోర్స్ పర్సన్లను ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ పర్యవేక్షణలో నియమించనున్నారు. గ్రామాల్లో సమాచారం సేకరించి మండలాలకు, మండలాల్లో పంచాయతీల వారీగా సమాచారం క్రోడీకరించి జిల్లా కేంద్రానికి పంపుతారు. ఆ తర్వాతజిల్లా యూనిట్‌గా ప్రభుత్వం నివేదికను అందిస్తారు. గ్రామ పంచాయతీ పేరు, కుటుంబాల సంఖ్య, ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యాలయం వివరాలు, ఇతర సంస్థలు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, అప్పులు, ఖర్చు, సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఆవాస ప్రాధాన్యతలు ఇలా... దాదాపు 14 అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తారు.
గామ పంచాయతీ పరిధిలో ఉన్న ఉపరితల జల భాండాగారాలు, చేతిపంపులు, వీధి దీపాలు, రోడ్లు, మరుగు కాల్వలను లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల సంఖ్య, ఎంపీటీసీ, సర్పంచు, వార్డు మెంబర్లు...వారి విద్యార్హత, మెయిల్ ఐడీలు, సెల్ నంబర్లు సేకరిస్తారు. ప్రభుత్వం గ్రామస్థాయిలో చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలియజేసే క్రమంలో గ్రామస్థాయి ప్రణాళికలో ప్రజా ప్రతినిధులకు తగినంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది హోదా, విద్యార్హతలు, వేతనం తదితర వివరాలు కూడా సేకరిస్తారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యత
గ్రామ స్థాయిలో ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు ఉన్నాయి, వాటిలో మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? ఆయా పాఠశాలల్లో, కళాశాల్లో విద్యార్థుల సంఖ్య, విద్యార్థినుల వివరాలు సేకరిస్తారు. 6-20 ఏళ్ల లోపు బడికి వెళ్లే వారి సంఖ్య, బడి బయట ఉన్న వారి సంఖ్య, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్య కోర్సులను అభ్యసిస్తున్న వారి వివరాలు సేకరిస్తారు.
గామంలో చదువు పూర్తయి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన వారి వివరాలు సేకరిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, వాటి పనితీరు, పిల్లల వివరాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రంథాలయాలు తదితర వివరాలు సేకరిస్తారు. అంతేకాకుండా పీహెచ్‌సీల పరిస్థితి, వైద్య సిబ్బంది, వారి పనితీరు, పశువైద్యశాలలు, వైద్యుల వివరాలు సేకరిస్తారు.
సమగ్ర పరిశీలన...
గ్రామాల్లో వ్యవసాయ భూమి, వ్యవసాయ యోగ్యం కాని బీడు భూములు, వాటికి ఉన్న నీటి వసతి, పరపతి సంఘాలు, సహజ వనరులు, ఉపాధి ద్వారా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఈ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చింది. చెరువులు, చెక్‌డ్యాంలు, బావులు, అడవుల వివరాలు కూడా సేకరిస్తారు. గ్రామ ప్రణాళికలో వచ్చే అంశాల ఆధారంగా అక్కడ వ్యవసాయ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్యలు తీసుకుంటుంది. గ్రామంలో రేషన్ కార్డులు, పింఛన్ల వివరాలు, ఎంత మందికి ఉపాధి హామీ జాబు కార్డులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పక్కా ఇళ్ల వివరాలు సేకరిస్తారు. ఇలా సేకరించడం వల్ల ఏ గ్రామంలో ఏఏ సమస్యలు ఉన్నాయి, ఏ మండలంలో ఎలాంటి మొక్కలు పెంచడానికి అనుకూలమైన వాతావరణం ఉంది? పల్లెల్లో ఎలాంటి నిరుద్యోగం ఎక్కువగా ఉంది? ఏ ప్రాంతంలో ఏ పంటలు అధికంగా పండుతాయి? వాటికి మార్కెటింగ్ వసతులు ఎలా మెరుగుపరచాలి? అనే ఒక్కొక్క సమస్య పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని నిధులు అవసరమవుతాయి? వాటిని ఎక్కడ నుంచి తీసుకురావాలి? అనే దానిపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. దీన్ని బట్టి ప్రజా అవసరాలను ఎప్పటికప్పుడు,ఎక్కడికక్కడ గుర్తించి, అక్కడే పరిష్కారం చూపడానికి మార్గం దొరుకుతుంది.
పల్లెకు ప్రభుత్వం
Published Sun, Jul 13 2014 12:10 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement