మార్కెట్ ధరకే భూ సేకరణ
- గన్నవరం భూముల రిజిస్ట్రేషన్‌కు అంగీకారం
- పామాయిల్ చెట్టుకు రెట్టింపు రేటు
- సుముఖత వ్యక్తంచేసిన సీఎం చంద్రబాబు
- రైతులతో విడివిడిగా సమావేశం
సాక్షి, విజయవాడ : పోలవరం కుడి ప్రధాన కాలువ కోసం రైతుల నుంచి సేకరించే భూములకు మార్కెట్ ధర ప్రకారమే పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. పోలవరం కుడికాలువ నిర్మాణం, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం ఉదయం ఆయన సీఎం క్యాంపు కార్యాల యంలో తాను బసచేసిన బస్సులో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలను రైతులు ‘సాక్షి’కి వివరించారు.
కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న తమకు మార్కెట్ ధర చెల్లించాలని కోరగా ముఖ్యమంత్రి అంగీకరించారని బాపులపాడు మండలం వేలేరు రైతు వేములపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పామాయిల్ చెట్టుకు రూ.6 వేలకు బదులు రూ.12వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. భూములు విక్రయించిన తరువాత వచ్చే మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కూడా సీఎం హామీ ఇచ్చారని నూజివీడు మండలం సీతారాంపురానికి చెందిన పర్వతనేని శ్రీనివాసరావు తెలిపారు. నష్టపరిహారం ఒకేసారి చెల్లించేందుకు సుముఖత వ్యక్తంచేశారన్నారు.
రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్
గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం సుమారు 700 ఎకరాల భూమి సేకరించనున్నారు. తొలి విడతగా 450 ఎకరాలు సేకరిస్తారు. ఇక్కడ రైతులకు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో 1450 గజాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ప్రాంత భూముల ధర పెరిగింది. అయితే భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తొలగిస్తే తుళ్లూరులో స్థలం కావాలనుకునేవారు ఈ ప్రాంత భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, దానివల్ల రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వంశీమోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కరువు రహిత రాష్ట్రం కోసం ప్రణాళికలు
తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమైన చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎర్రకాలువ, కొవ్వాడ కాలువ ద్వారా లభించే 10వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణాడెల్టాలో వ్యవసాయ అవసరాలకు వాడుకుని, మిగులు జలాలను తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలకు మళ్లించాలని సూచించారు.
ఇరిగేషన్ పనులు చేస్తున్న ప్రోగ్రెసివ్ కంపెనీతో తలెత్తుతున్న సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించాలని మంత్రి ఉమాను ఆదేశించారు. పొగాకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కంపెనీలు కొనుగోలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని సీఎం హెచ్చరిం చారు. పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రైతులు, కంపెనీ ప్రతినిధులతో ఒక కమిటీని వేయాలని పొగాకు బోర్డు డెరైక్టర్ సి.వి.సుబ్బారావును ఆదేశించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, పోలవరం ప్రధాన కుడికాలువ అధికారులు తదితరులు పాల్గొన్నారు.