ఇక మిగిలింది 48 గంటలే...
కొనాల్సింది 18 మిలియన్ కేజీలు
మంత్రి మాట
సెప్టెంబర్ నెలాఖరుకల్లా మొత్తం 172 మిలియన్ కిలోల పొగాకు కొంటాం. అదనంగా పండిన పొగాకును కూడా కొనుగోలు చేస్తాం.
ఈ నెల 18న జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ పొగాకు రైతులకు ఇచ్చిన హామీ.
నీటి మూట
మంత్రి హామీతో కొనుగోళ్లు ఊపందుకుంటాయనుకున్నారు. ఆమె వచ్చి రైతులను పరామర్శించి వెళ్లి పది రోజులు దాటిపోయింది. గిట్టుబాటు ధర ఇంకా ఎగతాళి చేస్తూనే ఉంది. గడువు ఇంకా రెండు రోజులే ఉంది.
- కేంద్ర మంత్రి హామీ నత్తనడక
- కొనసాగుతున్న పొగాకు సంక్షోభం
- జగన్ హుంకరిస్తే కాస్తా జరిగింది
- సీఎం చంద్రబాబుదీ ప్రేక్షకపాత్రే
కదలిక
బుధవారం జిల్లాకు జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారన్న వార్త తెలిసిన బాబు సర్కార్.. సోమవారం కొంతమేర ధర పెంచి కొనుగోళ్లు జరిపారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు సంక్షోభం రైతుల్లో కాటేస్తూనే ఉంది. వరుసగా విషాదాలు చోటుచేసుకోవడంతో పది రోజుల కిందట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా ఒంగోలు వచ్చి నిరసనల మధ్యనే బాధితులను పరామర్శించారు. అదే రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో సమీక్ష నిర్విహంచి హామీలు గుప్పించినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తక్కువ రకం పొగాకు విక్రయం తయారైంది. ఇంకా 18 మిలియన్ కిలోలకుపైగా పొగాకు రైతుల వద్ద ఉండిపోయింది. ఇది కాకుండా అనధికారికంగా పండిన మరో 15 నుంచి 20 మిలియన్ కిలోల పొగాకు కూడా రైతుల వద్దే ఉంది.
ఇంకా మిగిలిన రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని ఎలా కొనుగోలు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ఈ దశలో రైతులకు అండగా ఈ నెల 30న టంగుటూరు వేలం కేంద్రం ఎదుట వైఎస్ జగన్ ధర్నా చేయనున్నారన్న వార్తతో సోమవారం కొంతమేర ధర పెంచి కొనుగోళ్లు జరిపారు.
ఇప్పటికి కొనుగోలు చేసంది 142 మిలియిన్ కిలోలే...
ఈ నెల 18న మంత్రి పర్యటన జరిగే సమయానికి 172 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకూ 142 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ నెలాఖరుకల్లా పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలుకు నోచుకోలేదు. ఈ నెల 24 వరకూ 150.8 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలయింది. ఈ రెండు రోజుల్లో మరో రెండు మూడు మిలియన్ కిలోలకు మించి అమ్ముడు పోలేదు. అంటే ఇంకా సుమారు 18 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంది.
సోమవారం కూడా జిల్లాలో మొత్తం ఏడు వేలం కేంద్రాల్లో 6,335 బేళ్లను రైతులు తీసుకురాగా అందులో 1940 బేళ్లు అమ్ముడుపోలేదు. 1416 బేళ్లను నో బిడ్ చేశారు. మొత్తం 4395 బేళ్లు అమ్ముడుపోయాయి. మొత్తం మీద ఐదు లక్షల కిలోలు కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. ధర కూడా లోగ్రేడ్‌కు రూ.59 ఏవరేజీ వచ్చింది. ఇంకా రెండు రోజుల్లో మొత్తం పొగాకును ఎలా కొనుగోలు చేస్తారన్నదానికి బోర్డు అధికారుల నుంచి సమాధానం లేదు. వాణిజ్య మంత్రి జిల్లాకు వచ్చిన రోజునుంచి అమ్మిన పొగాక్కి కేజీకి రూ.20 కలుపుతామని ప్రకటించినా ఇంత వరకు అధికారికంగా బోర్డుకు ఉత్తర్వులు రాలేదు. 90 శాతం పొగాకు అమ్ముకున్నాక చివరి అమ్మకాలకు కలిపినా రైతుకు ప్రయోజనం శూన్యమని రైతులు ధ్వజమెత్తుతున్నారు.